Friday, January 5, 2018

ద్వారక అస్తమయం - 16

11-26-వ.
అది గావున యతి నిందాపరత్వంబున యదువంశనాశం బగు; సందియంబులే” దని పరమేశ్వరుండు వారలం జూచి “సముద్రతీరంబున నొక్క మహాపర్వతం బున్నది; యందు నుండు నత్యుచ్ఛ్రయ విశాలభీషణం బగు పాషాణంబున మీ భుజాబలంబుచేత నీ ముసలంబు దివిచి దీని చూర్ణంబు సింధు కబంధంబులఁ గలిపి రండు; పొండ”ని జగద్విభుండైన కృష్ణుం డానతిచ్చిన, వారు నట్ల చేసి తత్కీలితం బయిన లోహఖండంబును సరకుగొనక సాగరంబునఁ బడవైచిన నొక్క ఝషంబు గ్రసించిన, దాని నొక్క లుబ్ధకుండు జాలమార్గంబునఁ బట్టికొని, తదుదరగతంబయిన లోహఖండంబు దెచ్చి బాణాగ్రంబున ముల్కిగా నొనర్చె” నని తత్కథావృత్తాంతంబు సెప్పిన బాదరాయణిం గనుంగొని రాజేంద్రుం డిట్లనియె.
11-27-క.
"చిత్తం బే క్రియ నిలుచుం? 
జిత్తజగురు పాదపద్మ సేవ సదా య
త్యుత్తమ మని వసుదేవుఁడు
చిత్తముఁ దగ నిల్పి యెట్లు సెందె మునీంద్రా! "
భావము:
అందుచేత ఈ యతులను నిందించటం అనే దోషం వలన యదువంశం నాశనం కాక తప్పదు.” ఇలా పలికి వాసుదేవుడు వాళ్ళను ఇలా ఆఙ్ఞాపించాడు. “సముద్రపు ఒడ్డున ఒక పెద్ద కొండ ఉన్నది. అక్కడ భయంకరమైన బాగా పొడవూ వెడల్పూ గల పెద్దబండ మీద మీ భుజబలాలు వాడి, ఈ ఇనుప రోకలిని బాగా నూరి అరగదీసి పొడి పొడి చేసి, ఆ పొడిని సముద్రపు నీళ్ళలో కలపండి. పొండి.” అన్నాడు. విశ్వేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆనతిచ్చిన ఆ ప్రకారం పొడిచేసి సముద్రంలో కలిపి. మిగిలిన చిన్న లోహపు ముక్కను లెక్క చేయక, అరగదీయుట ఆపి, సముద్రంలో పడవేశారు. దానిని ఒకచేప మ్రింగింది దానిని ఒక బోయవాడు వలవేసి పట్టుకున్నాడు. దాని కడుపులో ఉన్న ఇనుపముక్కను తన బాణం చివర ములికిగా మలచుకున్నాడు.” అని ఆ కథా విషయం అంతా చెప్పిన శుకమహర్షిని పరీక్షన్మహారాజు ఇలా అన్నాడు. “మునీంద్రా! మనసు ఏ విధంగా నిశ్చలంగా నిలబడుతుంది? మన్మథుడి జనకుడైన శ్రీమహావిష్ణువు చరణకమలములను సేవించటం మిక్కిలి ఉత్తమమైనదని నమ్మి వసుదేవుడు ఏవిధంగా తన చిత్తాన్ని ఈశ్వరాయత్తం చేశాడు.”



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments: