Sunday, December 30, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 84

10.1-585-వ.
ఇట్లు బాలకులతోడఁ జల్ది గుడిచి వారలకు నజగర చర్మంబు చూపుచు వనంబున నుండి తిరిగి.
10.1-586-పంచ.
ప్రసన్నపింఛమాలికా ప్రభావిచిత్రితాంగుఁడుం
బ్రసిద్ధ శృంగ వేణునాద పాశబద్ధ లోకుఁడుం
బ్రసన్న గోప బాలగీత బాహువీర్యుఁ డయ్యు ను
ల్లసించి యేగె గోపకుల్ జెలంగి చూడ మందకున్.


భావము:
అలా కృష్ణుడు వారితో చల్దులు తిని వనంలో నుండి తిరిగి వస్తుంటే, వారికి కొండచిలువ చర్మం చూపాడు. శ్రీ కృష్ణుడు తలలో అడవిపూలు నెమలిపింఛము ధరించాడు. వాటి రంగురంగుల కాంతులు అంతటా ప్రసరించి అతని శరీరభాగాలను అలంకరిస్తున్నాయి. కృష్ణుని కొమ్ముబూర మోత, అతని వేణుగానం అందరికీ పరిచయమైనవి. అవి వినపడగానే లోకమంతా పరవశం చెంది ఆకర్షించబడుతుంది. గోపబాలురు సంతోషంతో అతని బాహుబలాన్ని స్తోత్రం చేసారు. కృష్ణుడు గోపబాలురతో కూడి ఉల్లాసంతో మందకు చేరుకుంటూ ఉంటే గోపకు లందరూ సంతోషంతో వారిని ఆదరించారు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Saturday, December 29, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 83

10.1-583-వ.
అప్పుడు.
10.1-584-మ.
“చెలికాఁడా! యరుదెంచితే యిచటికిన్? క్షేమంబునం గ్రేపులున్
నెలవుల్ జేరె నరణ్యభూమివలనన్ నీ వచ్చునం దాకఁ జ
ల్దులు వీ రించుక యెవ్వరుం గుడువ; రా లోకింపు; ర”మ్మంచు నా
జలజాక్షుండు నగన్ భుజించి రచటన్ సంభాషలన్ డింభకుల్.

భావము:
బ్రహ్మదేవుడి మాయా గుహనుండి పులినతలానికి కృష్ణబాలుడు తీసుకువచ్చిన సమయంలో (ఇసుకతిన్నెల మీద కూర్చుని చల్దులు తింటూ అర్థాంతరంగా ఆపు చేసిన గోపబాలురు కృష్ణుని చూసి ఇలా అన్నారు.) “చెలికాడా! వచ్చావా? ఇదిగో లేగదూడలు అరణ్య మధ్యం నుండి ఇప్పుడే తిరిగి వచ్చేసాయి. నీవు తిరిగివచ్చే వరకూ మాలో ఎవరమూ చల్దులు తినలేదు. చూడు. త్వరగారా! తిందాము.” అని పిలిచారు కృష్ణుడు నవ్వుతూ వచ్చి వారి మధ్యలో కూర్చోగానే అందరూ కబుర్లు చెప్పుకుంటూ చల్దులు తిన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=75&padyam=584

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, December 28, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 82

10.1-580-వ.
దేవా! నీకుఁ గల్పపర్యంతంబు నమస్కరించెద”నని యివ్విధంబున సంస్తుతించి ముమ్మాఱు వలగొని పాదంబులపైఁ బడి వీడ్కొని బ్రహ్మ తన నెలవునకుం జనియె; నతని మన్నించి భగవంతుండైన హరి తొల్లి చెడి తిరిగి వచ్చిన వత్సబాలకులం గ్రమ్మఱం గైకొని పులినంబుకడఁ జేర్చె; నిట్లు.
10.1-581-క.
క్రించు దనంబున విధి దము
వంచించిన యేఁడు గోపవరనందను లొ
క్కించుక కాలంబుగ నీ
క్షించిరి రాజేంద్ర! బాలకృష్ణుని మాయన్.


భావము:
ఓ భగవంతుడా! నా ఆయుర్దాయం ఈ కల్పాంతం వరకూ ఉంది కదా. అంత వరకూ నీకు నమస్కరిస్తూనే ఉంటాను.” అని స్తుతించి బ్రహ్మదేవుడు మూడుసార్లు కృష్ణుడికి ప్రదక్షిణం చేసి, పాదాలకు మ్రొక్కి, సెలవు తీసుకుని తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు అతనిని క్షమించి గౌరవించాడు. ఇంతకు ముందు మాయమై తిరిగి వచ్చిన దూడలను, బాలకులను మళ్ళీ ఇసుక తిన్నెల వద్దకు చేర్చాడు.ఈ విధముగా మహారాజా! ఈవిధంగా బ్రహ్మదేవుడు అల్పత్వంతో మోసగించి తమను దాచిపెట్టిన ఏడాది కాలాన్ని కృష్ణుని మాయ కారణంగా గోపబాలకులు కొద్దిసేపుగా భావించారు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Thursday, December 27, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 81

10.1-578-క.
సర్వము నీవ యెఱుంగుదు
సర్వవిలోకనుఁడ వీవ; జగదధిపతివిన్; 
సర్వాపరాధి నను నో! 
సర్వేశ! యనుగ్రహింపు; చనియెద నింకన్.
10.1-579-క.
జిష్ణు! నిశాటవిపాటన! 
వృష్ణికులాంభోజసూర్య! విప్రామర గో
వైష్ణవ సాగర హిమకర! 
కృష్ణా! పాషండధర్మగృహదావాగ్నీ!

భావము:
సర్వేశ్వరా! శ్రీకృష్ణా! సర్వం నీవే ఎరుగుదువు. నీవు అన్నీ చూడగలిగిన వాడవు. ఈ జగత్తు అంతటికీ అధిపతివి నీవే. అన్ని విధాలైన అపచారాలు చేసిన నన్ను మన్నించి అనుగ్రహించు. నేనింక సెలవు తీసుకుంటాను. కృష్ణా! నీవు సాక్షాత్తూ విష్ణుమూర్తివి; రాక్షసులను సంహరించడానికి అవతరించావు; వృష్ణి కులము అనే తామరపూవును వికసింప జేసే సూర్యుడవు నీవు; బ్రాహ్మణులు, దేవతలు, గోవులు, విష్ణుభక్తులు అనే పాలసముద్రంలో ప్రభవించి వారిని సంతోషింప జేసి చల్లగా చూసే చంద్రుడవు నీవు; ఈ అవతారంలో ప్రత్యేకంగా వేదాలకు విరుద్ధమైన పాషండధర్మం అనే ఇంటిని దహించే అగ్నిహోత్రుడవు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=74&padyam=579

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Tuesday, December 25, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 80

10.1-576-ఆ.
ఆశ్రయించు జనుల కానందసందోహ
మీఁ దలంచి వివిధ హేలతోడ
నప్రపంచకుండ వయ్యుఁ బ్రపంచంబు
వెలయఁజేయు దీవు విశ్వమూర్తి!
10.1-577-క.
ఎఱిఁగిన వార లెఱుంగుదు
రెఱుఁగన్ బహు భాషలేల? నీశ్వర! నీ పెం
పెఱుఁగ మనోవాక్కులకున్
గుఱిచేయం గొలది గాదు గుణరత్ననిధీ!


భావము:
విశ్వమంతటా అంతర్యామిగా ఉన్న ఓ విశ్వమూర్తీ! నీకు ప్రపంచం అంటూ నిజంగా లేదు అయినా నిన్ను భక్తితో ఆశ్రయించిన జనులకు ఆనందాన్ని ప్రసాదించటానికి ఎన్నో విలాసాలతో ఈ ప్రపంచాన్ని సృష్టించి, నడుపుతూ ఉంటావు. శ్రీకృష్ణ పరమశ్వరా! సర్వోత్తమ గుణాలకు నిధి వంటివాడా! నిన్ను తెలియవలె నంటే అది ఎలాగో జ్ఞానులకే తెలుసు. ఇన్ని మాట లెందుకు. నీ గొప్పతనం తెలుసుకోవడానికి మనస్సు గాని వాక్కు గాని ఉపయోగించడం కష్టంగా ఉంది.


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=74&padyam=577


// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Monday, December 24, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 79

10.1-575-క.
దేహము కారాగేహము
మోహము నిగళంబు; రాగముఖరములు రిపు
వ్యూహములు భక్తితో ని
న్నూహింపఁని యంతదడవు నో! కమలాక్షా!
భావము:
10.1-576-ఆ.
ఆశ్రయించు జనుల కానందసందోహ
మీఁ దలంచి వివిధ హేలతోడ
నప్రపంచకుండ వయ్యుఁ బ్రపంచంబు
వెలయఁజేయు దీవు విశ్వమూర్తి!

భావము:
కమలముల వంటి కన్నుల కల కృష్ణా! భక్తితో నిన్ను స్మరించనంత కాలమూ ఎవరికైనా శరీరము కారాగారము; మోహము అనేది సంకెళ్ళూ; రాగద్వేషాదులు శత్రువ్యూహాలూ; అవుతాయి. విశ్వమంతటా అంతర్యామిగా ఉన్న ఓ విశ్వమూర్తీ! నీకు ప్రపంచం అంటూ నిజంగా లేదు అయినా నిన్ను భక్తితో ఆశ్రయించిన జనులకు ఆనందాన్ని ప్రసాదించటానికి ఎన్నో విలాసాలతో ఈ ప్రపంచాన్ని సృష్టించి, నడుపుతూ ఉంటావు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=74&padyam=575

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Sunday, December 23, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 78

10.1-573-శా.
ఏలా బ్రహ్మపదంబు? వేదములకున్ వీక్షింపఁగారాని ని
న్నీలోకంబున నీ వనాంతరమునం దీ మందలోఁ గృష్ణ యం
చాలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు నీ
వ్రేలం దొక్కని పాదరేణువులు పై వేష్ఠించినం జాలదే?
10.1-574-మ.
నిను హింసించిన పూతనాదులకు మున్ నీ మేటి సంకేత మి
చ్చిన నీకుం బుర దార పుత్ర గృహ గో స్త్రీ ప్రాణ దేహాదు లె
ల్లను వంచింపక యిచ్చు గోపకులకున్ లక్షింప నే మిచ్చెదో? 
యని సందేహము దోఁచుచున్నది ప్రపన్నానీకరక్షామణీ!


భావము:
వేదాలు నిన్నుగురించి చెబుతాయే గాని. నిన్ను దర్శించ లేవు కదా. అటువంటి నిన్ను ఈ భూలోకంలో ఈ అడవిలో ఈ గోకులంలో సహచరుడుగా పొందగలిగారు. ఈ గోపకులు “కృష్ణా! కృష్ణా!” అంటూ మాటల దగ్గర నుంచీ అన్ని భావాలు నీ యందే సమర్పించుకుంటున్నారు. ఈ గొల్లలలో ఒక్కడి పాదరేణువులలో ఒక్క కణం నా శిరస్సు పైన ధరించగలిగితే చాలదా? ఈ బ్రహ్మ పదవి ఎందుకయ్యా నాకు. భక్తులకు అందరికి రక్షామణివైన ఓ కృష్ణా! నిన్ను చంప దలచి వచ్చిన పూతన మొదలైన రాక్షసులకే అద్భుతమైన మోక్షాన్ని ప్రసాదించావు. అటువంటి నీకు గోపకు లందరూ తమ ఊరిని, భార్యలను, పుత్రులను, ఇండ్లను, గోవులను, స్త్రీలను, ప్రాణాన్ని, శరీరం మొదలైన వాటిని అన్నింటినీ సందేహం లేకుండా సమర్పణ చేసుకున్నారు. అటువంటి వారికి ఆ మోక్షం కన్నా ఇంకా ఎక్కువైనది ఏమి ఇస్తావో అని నాకు సందేహం కలుగుతూ ఉంది.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Saturday, December 22, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 77

10.1-572-సీ.
ఏకదశేంద్రియాధీశులు చంద్రాదు; 
లేను ఫాలాక్షుండు నిట్లు గూడఁ
బదుమువ్వురము నెడపడక యింద్రియ పాత్ర; 
ముల నీ పదాంభోజముల మరంద
మమృతంబుగాఁ ద్రావి యమర నేకైకేంద్రి; 
యాభిమా నులుమయ్యు నతి కృతార్థ
భావుల మైతిమి; పరఁగ సర్వేంద్రియ; 
వ్యాప్తులు నీ మీఁద వాల్చి తిరుగు
10.1-572.1-తే.
గోప గోపికాజనముల గురు విశిష్ట
భాగ్య సంపదఁ దలపోసి ప్రస్తుతింప
నలవిగా దెవ్వరికి నైన నంబుజాక్ష! 
భక్తవత్సల! సర్వేశ! పరమపురుష!

భావము:
సర్వేశ్వరా! పరమపురుషా! పుండరీకాక్షా! చంద్రుడు మొదలైన పదకొండు ఇంద్రియాలకు అధిపతులు, నేను, శివుడు ఈ ముగ్గురమే నీ యందు ఏమరుపాటు చెందకుండా ఉన్న వారము. మేము మా మా ఇంద్రియాలు అనే పాత్రలలో నీ పాదపద్మముల నుండి పుట్టిన మకరందాన్ని అమృతం వలె త్రాగుతున్నాము. కనుకనే ఒక్కక్క ఇంద్రియానికి వేరువేరుగా అధిపతులం అయ్యాము. ఎంతో ధన్యులం అయ్యాము. అలాంటిది అన్ని ఇంద్రియాల ప్రవృత్తులూ నీ పైననే ఉంచుకో గలుగుతున్న గోపికల భాగ్యం ఎంత గొప్పదో ఎంత విశిష్ట మైందో దానిని గురించి ఆలోచించడానికి గాని స్తోత్రం చేయడానికి గాని ఎవరికీ సాధ్యం కాదు. నీవు భక్తుల యెడల వాత్సల్యం కలవాడవు కనుకనే గోపగోపికా జనాలకు ఇంతటి భాగ్యం లభించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=74&padyam=572

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, December 21, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 76

10.1-571-క.
పరిపూర్ణంబుఁ బురాణముఁ
బరమానందంబునైన బ్రహ్మమె చెలికాఁ
డరు దరుదు నందఘోష
స్థిరజనముల భాగ్యరేఖ చింతింపంగన్


భావము:
అంతా తన యందు ధరించినది; అన్నిటికి మొదటిది; పరమానంద స్వరూపము అయిన పరబ్రహ్మమే; ఈ నందగోకులం లోని జనులకు చెలికాడు అయినా డట; ఆహ! ఇది ఎంత అపురూప మైన విషయం. వీరి భాగ్యరేఖ ఎంత అద్భుత మైనదో ఊహించడం కూడా విధాత నైన నాకే సాధ్యం కావడం లేదు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




శ్రీకృష్ణ లీలావిలాసం - 75

10.1-569-శా.
దేవా! నీ చరణప్రసాదకణలబ్ధిం గాక లేకున్న నొం
డేవెంటం జను నీ మహామహిమ నూహింపంగ నెవ్వారికిన్? 
నీ వారై చనువారిలో నొకఁడనై నిన్ గొల్చు భాగ్యంబు నా
కీవే యిప్పటి జన్మమం దయిన నొం డెం దైన నో! యీశ్వరా!
10.1-570-త.
క్రతుశతంబునఁ బూర్ణ కుక్షివి; గాని నీ విటు క్రేపులున్
సుతులునై చనుఁబాలు ద్రావుచుఁ జొక్కి యాడుచుఁ గౌతుక
స్థితిఁ జరింపఁగఁ దల్లులై విలసిల్లు గోవుల గోపికా
సతుల ధన్యత లెట్లు చెప్పగఁ జాలువాఁడఁ గృపానిధీ!

భావము:
ఓ శ్రీకృష్ణ ప్రభూ! నీ మహోన్నత మహిమను ఊహించా లంటే నీ పాద ధూళికణ ప్రాప్తి వలన మాత్రమే సాధ్యం తప్ప మరి ఎవరికి సాధ్యం కాదు. నీవారుగా జీవించ గల ధన్యులలో నేను ఒకడిగా ఉండి నిన్ను సేవించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. ఈ జన్మలో కాకపోతే మరో జన్మలో నైనా సరే ఆ మహాభాగ్యం నాకు ప్రసాదించు. ఓ కృపానిధీ! కృష్ణా! నీవు యజ్ఞపురుషుడవు; వందల కొద్దీ యజ్ఞాలు నీ కడుపులో దాగి ఉన్నాయి; అయినా నీవు ఈ విధంగా లేగలుగా, గోపాలురుగా రూపాలు ధరించి ఉన్నావు; గోవుల వద్ద గోపికల వద్ద నీవు పాలు త్రాగి పరవశిస్తూ, ఆటలుఆడుతూ, ఎంతో ఉత్సాహంతో సంచరిస్తున్నావు; నీకు తల్లులు కాగలిగిన ఆ గోవులు గోపికలు ఎంత పుణ్యం చేసుకున్నారో ఎలా చెప్పగలను; నీవు కరుణామయుడవు కనుకనే ఆ గోవులు గోపికలు అంత ధన్యత్వాన్ని అందుకోగలిగారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=74&padyam=570

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Tuesday, December 18, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 74

10.1-568-వ.
దేవా! యిట్టి నీవు జీవాత్మ స్వరూపకుఁడవు, సకలాత్మలకు నాత్మయైన పరమాత్మ స్వరూపకుఁడవు నని యెవ్వ రెఱుంగుదురు, వారు గదా గురు వనియెడు దినకరునివలనఁ బ్రాప్తంబైన యుపనిషదర్థజ్ఞానం బను సునేత్రంబునంజేసి సంసార మిథ్యాసాగరంబుఁ దరించిన చందంబున నుండుదురు; రజ్జువందు రజ్జువని యెఱింగెడి యెఱుక లేకుండ, న య్యెఱుంగమి నది సర్పరూపంబయి తోఁచిన పిదప నెఱింగిన వారివలన రజ్జువు రజ్ఝువని యెఱుంగుచుండ, సర్పరూపంబు లేకుండు కైవడి, నాత్మ యప్పరమాత్మ యని యెవ్వ రెఱుంగరు వారి కయ్యెఱుంగమివలన సకల ప్రపంచంబు గలిగి తోఁచు; నాత్మ యప్పరమాత్మ యని యెవ్వరెఱుంగుదురు, వారి కయ్యెఱుకవలనఁ బ్రపంచంబు లేకుండు నజ్ఞాన సంభావిత నామకంబులైన సంసార బంధ మోక్షంబులు, జ్ఞాన విజ్ఞానంబులలోనివి గావు; కావునఁ గమలమిత్రున కహోరాత్రంబులు లేని తెఱంగునఁ, బరిపూర్ణ జ్ఞానమూర్తి యగు నాత్మ యందు నజ్ఞానంబులేమిని బంధంబును సుజ్ఞానంబు లేమిని మోక్షంబు లే; వాత్మవయిన నిన్ను దేహాదికంబని తలంచియు, దేహాదికంబు నిన్నుఁగాఁ దలంచియు, నాత్మ వెలినుండు నంచు మూఢులు మూఢత్వంబున వెదకుచుందురు; వారి మూఢత్వంబుఁ జెప్పనేల? బుద్ధిమంతులయి పరతత్వంబు గాని జడంబును నిషేధించుచున్న సత్పురుషులు తమ తమ శరీరంబుల యంద నిన్నరయుచుందు రదిగావున.


భావము:
ఓ దేవా! శ్రీకృష్ణా! ఇట్టి నీవు జీవాత్మస్వరూపుడ వని; ఆత్మలు అన్నింటికీ ఆత్మ యైన పరమాత్మ స్వరూపుడ వని గ్రహించ గలిగినవారు, గురువు అనే సూర్యుని వలన ఉపనిషత్తుల జ్ఞానం అనే కన్నును పొందినవారు. అటువంటివారు సంసార మనే ఈ మాయాసముద్రాన్ని దాటినట్లు కనిపిస్తారు. అది త్రాడే అను జ్ఞానం లేనప్పుడు, దానిని చూస్తే అది పాములా కనిపిస్తుంది. తరవాత తెలిసినవారి వలన అది త్రాడే అని తెలుసుకున్న తర్వాత ఇంక పాము అనే రూపం ఉండదు. అలాగే తనలో నున్న ఆత్మయే పరమాత్మ అని తెలియని వారికి, ఈ ప్రపంచ మంతా ఉన్నట్లుగా కనిపిస్తుంది. తరువాత తాను ఆత్మ అని ఆత్మయే పరమాత్మ అని తెలిసిన తరువాత వారికి “అజ్ఞానం కారణంగా ఈ ప్రపంచమంతా తనకు కనిపించినదే తప్ప నిజంగా అక్కడ ఏమీ లే” దని తెలుస్తుంది. సంసారబంధము అనేది అజ్ఞానం వలన పుట్టినది. మోక్షం అనేది కూడా అజ్ఞానం వలననే పుట్టినదే. ఈ బంధ మోక్షాలు జ్ఞాన విజ్ఞానాల లోనికి చేరవు. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం వలన మనకు రాత్రింబవళ్ళు ఉన్నాయి గానీ సూర్యునికి రాత్రి పగలు లేవు అలాగే సంపూర్ణు డైన, జ్ఞాన స్వరూపు డైన ఆత్మకు అజ్ఞానం లేనందువలన బంధ మోక్షాలు ఉండవు. ఆత్మ వైన నిన్ను శరీర మని శరీరాదులు నీ వని భావించేవారు శరీరానికి బయట ఎక్కడో ఆత్మ ఉంటుంది అనుకునేవారు మూఢులు. అంటే మోహం చెందిన వారు. అ మోహంలోనే పడి ఆత్మ కోసం వెతుకులాడుతూ ఉంటారు. వారి మూఢత్వం ఇంత అని చెప్పడ మెందుకు. జడపదార్ధంలో కూడా పరమాత్మనే దర్శనం చేసేవారు బుద్ధిమంతు లైన సత్పురుషులు. వారు తమ శరీరాల లోనే నిన్ను చూడగలుగుతారు. అందుచేత. . .



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Sunday, December 16, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 73

10.1-567-సీ.
అది గాన నిజరూప మనరాదు; కలవంటి; 
దై బహువిధదుఃఖమై విహీన
సంజ్ఞానమై యున్న జగము సత్సుఖబోధ; 
తనుఁడవై తుదిలేక తనరు నీదు
మాయచేఁ బుట్టుచు మనుచు లే కుండుచు; 
నున్న చందంబున నుండుచుండు; 
నొకఁడ; వాత్ముఁడ; వితరోపాధి శూన్యుండ; 
వాద్యుండ; వమృతుండ; వక్షరుండ;
10.1-567.1-ఆ.
వద్వయుండవును; స్వయంజ్యోతి; వాపూర్ణుఁ
డవు; పురాణపురుషుఁడవు; నితాంత
సౌఖ్యనిధివి; నిత్యసత్యమూర్తివి; నిరం
జనుఁడ వీవు; తలఁపఁ జనునె నిన్ను. ?

భావము:
కనుక ఇది నీ అసలు స్వరూపం అని అనటానికి లేదు. ఈ జగత్తు అంతా కల వంటిది, ఎన్నో రకాల దుఃఖాలు కలది “సత్య జ్ఞానం” నష్టపోవడంలో మునిగి ఉంది. అటువంటి జగత్తు అంతా నీ మాయ చేత పుట్టుతూ, ఉంటూ, లేకుండా పోతూ ఉన్నట్లు అనిపిస్తుంది. నీవు మాత్రం సత్తు, నిరతిశయానంద రూపుడవు. ఆది, అంతమూ అంటూ లేనివాడవు; నీవు అనితరుడవు, స్వేతరుడవు కనుక ఒక్కడివే; ఆత్మ స్వరూపుడవు; నీవు మరో శరీరం అక్కరలేని వాడవు; నీవే అంతటికీ మూలమైన వాడవు; అంతము లేని వాడవు; తరిగిపోవడం అంటూ ఉండని వాడవు; నీకు సాటి రెండవవాడు లేడు; నీ యంత నీవు వెలుగుతూ ఉన్నావు; మొదటినుండీ సర్వమూ నీ లోనే ఉన్నవాడవు; ప్రాచీనులలో కెల్లా ప్రాచీనతముడవు అయిన మొట్టమొదటి పురుషుడవు నీవే; నిరంతరమైన సంపూర్ణమైన సుఖమునకు నిధానమైన వాడవు నీవు; సమస్త సృష్టికీ నిత్యమూ ఆధారమైన సత్యము నీవే; షోడశకళాపూర్ణ స్వరూపుడవు నీవు. ఇటువంటి నిన్ను ఉత్తి భౌతిక మనస్సుతో భావించాలంటే సాధ్యమా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=74&padyam=567

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, December 14, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 72

10.1-565-క.
జలచర మృగ భూసుర నర
కులముల జన్మించి తీవు కుజనులఁ జెఱుపన్
జెలిమిని సుజనుల మనుపను
దలపోయఁగ రాదు నీ విధంబు లనంతా!
10.1-566-ఆ.
మ్రబ్బుగొలిపి యోగమాయ నిద్రించిన
యో! పరాత్మభూమ! యోగిరాజ! 
యే తెఱంగు లెన్ని యెంత యెచ్చోట నీ
హేల లెవ్వఁ డెఱుఁగు నీశ్వరేశ!


భావము:
ఓ అనంత కృష్ణా! నీవలనే నీ మార్గాలు కూడా అంతం లేనివి. నీవు దుర్మార్గులను శిక్షించడానికీ, సజ్జనులను ప్రేమతో రక్షించడానికీ జలచరములుగా, మృగములుగా, బ్రాహ్మణులుగా, సాధారణ మానవులుగా ఎన్నో అవతారాలు ఎత్తావు. నీ మార్గాలు ఈవిధంగా ఉంటాయని ఊహించడం అసాధ్యం కదా. ఓ పరమాత్మా! మహాయోగీశ్వరేశ్వరా! శ్రీకృష్ణా! నీ కన్న ఇతరులుగా జీవిస్తున్న జీవులందరూ “ఎవరికివారు “నేను” అని మిగిలినవారిని “వారు” అని అనుకుంటున్నారు. వారందరిలో ఉన్న “నేను” నివాసంగా “నీవు” ఉన్నావు. దానిని దర్శించడానికి సాధన చేసేవారే యోగులు. వారి యోగంగా వారిలో వెలుగుతూ ఉన్నదీ నీవే మిగిలినవారు ఈ నీ యందు మరుపు కలిగి ఉంటారు. “తాము ఉన్నామనే తెలివి” మైకంగా కప్పుతుంది. ఈ మైకాన్నికలిగించి నీవు లోపల ఉంటే వారికి నీవు నిద్రిస్తున్నట్లు ఉంటావు. అలాంటి యోగనిద్రలో ఉన్న నీ లీలలు ఎవరికి తెలుస్తాయి? ఎప్పుడు తెలుస్తాయి? ఎక్కడ తెలుస్తాయి?



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




శ్రీకృష్ణ లీలావిలాసం - 71

10.1-563-క.
ఎఱిఁగిన వారికిఁ దోఁతువు
నెఱిఁ బ్రకృతింజేరి జగము నిర్మింపఁగ నా
తెఱఁగున రక్షింపఁగ నీ
తెఱఁగున బ్రహరింప రుద్రు తెఱఁగున నీశా!
10.1-564-వ.
అదియునుం గాక.

భావము:
శ్రీకృష్ణ ప్రభూ! నీవు ప్రకృతితోకూడి జగత్తును నిర్మిస్తూ ఉండి నేను గానూ; రక్షిస్తూ ఉండి నీవు గానూ; లయం చేస్తూ ఉండి రుద్రుని గానూ జ్ఞానులకు నీవే తెలుస్తూ ఉంటావు. అంతే కాకుండా....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=74&padyam=563

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Tuesday, December 11, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 70

10.1-561-మ.
వినుమో; యీశ్వర! వెల్పలన్ వెలుఁగు నీ విశ్వంబు నీ మాయ గా
క నిజంబైన యశోద యెట్లుగనియెం? గన్నార నీ కుక్షిలోఁ
గనెఁ బోఁ గ్రమ్మఱఁ గాంచెనే? భవదపాంగశ్రీఁ బ్రపంచంబు చ
క్కన లోనౌ; వెలి యౌను; లోను వెలియుం గాదేఁ దదన్యం బగున్;
10.1-562-మ.
ఒకఁడై యుంటివి; బాలవత్సములలో నొప్పారి తీ వంతటన్
సకలోపాసితులౌ చతుర్భుజులునై సంప్రీతి నేఁ గొల్వఁగాఁ
బ్రకటశ్రీ గలవాఁడ వైతి; వటుపై బ్రహ్మాండముల్ జూపి యొ
ల్లక యిట్లొక్కఁడవైతి; నీ వివిధ లీలత్వంబుఁ గంటిం గదే?


భావము:
ఓ శ్రీకృష్ణ ప్రభూ! వెలుపల కనిపిస్తున్న ఈ విశ్వం అంతా నీ మాయకాక నిజమే అయినట్లయితే, యశోద కనులారా నీ కడుపులో ఈ విశ్వాన్ని ఎలా చూడగలిగింది? చూసిందే అనుకో, మళ్లీ ఏనాడైనా చూడగలిగిందా? నీ కడగంటిచూపుతో ఈ ప్రపంచమంతా నీ లోపలది అవుతుంది; నీ బయటది అవుతుంది; లోపల వెలుపల కాకపోతే మూడవది అవుతుంది; లోపలా వెలుపలా కూడా అవుతుంది. మొదట నీవు ఒక్కడవే ఉన్నావు; తరువాత గోపబాలురలో లేగలలో వెలుగొందేవు; ఆ తరువాత అందరిచేత నమస్కారాలు అందుకుంటున్న చతుర్భుజులైన విష్ణువుల రూపాలలో కనిపించి నన్ను ఆనందపరచి నీ వైభవాన్ని చక్కగా ప్రదర్శించావు; ఆ తరువాత బ్రహ్మాండాలన్నీ చూపించావు; తరువాత అది కాదని మళ్లీ ఇప్పుడు ఇలా ఒక్కడివిగా కనిపిస్తున్నావు; ఆహ! ఏమి నా భాగ్యం? ఇన్నాళ్ళకు ఇన్నిరకాల నీ లీలలు చూసాను.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :