Friday, December 8, 2017

పోతన రామాయణం - 53

9-358-వ.
అని వగచి, రామచంద్రుండు బ్రహ్మచర్యంబు ధరియించి, పదుమూఁడువేల యేం డ్లెడతెగకుండ నగ్నిహోత్రంబు చెల్లించి తా నీశ్వరుండు గావునఁ దన మొదలినెలవుకుం జనియె నివ్విధంబున.
9-359-ఆ.
ఆదిదేవుఁడైన యా రామచంద్రుని
కబ్ది గట్టు టెంత యసురకోటి
జంపు టెంత కపుల సాహాయ్య మది యెంత
సురల కొఱకుఁ గ్రీడ జూపెఁగాక.


భావము:
ఇలా బాధపడిన శ్రీరాముడు బ్రహ్మచర్యం చేపట్టి పదమూడువేల (13,000) సంవత్సరాలు ఎడతెగకుండా హోమాలు నడిపించి భగవంతుడు కనుక తన మూలస్థానం పరమపదానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా దేవతల కోసం లీలలు చూపించడానికి తప్పించి, ఆదిదేవుడైన ఆ రామచంద్ర మూర్తికి సముద్రానికి సేతువు కట్టుట అనగా ఎంతపని? రాక్షససంహారం అనగా ఎంతపని? ఆయనకు వానరులు తోడా అది ఏపాటిదనవచ్చు?



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments: