Friday, December 8, 2017

పోతన రామాయణం - 52

9-356-వ.
అని వాల్మీకి పలుక, రామచంద్రుండు పుత్రార్థి యై విచారింపఁ, గుశ లవులను వాల్మీకికి నొప్పగించి, రామచంద్రచరణధ్యానంబు చేయుచు నిరాశ యై సీత భూవివరంబు జొచ్చెను; అయ్యెడ.
9-357-మ.
ముదితా! యేటికిఁ గ్రుంకి తీవు మనలో మోహంబు చింతింపవే
వదనాంభోజము చూపవే మృదువు నీ వాక్యంబు విన్పింపవే
తుది చేయం దగ దంచు నీశ్వరుఁడునై దుఃఖించె భూపాలుఁ డా
పదగాదే ప్రియురాలిఁ బాసిన తఱిన్ భావింప నెవ్వారికిన్?

భావము:
అని వాల్మీకి చెప్పగా, శ్రీరాముడు కొడుకుల కోసం విచారించాడు. వాల్మీకి కుశలవులను శ్రీరామునికి అప్పచెప్పాడు. నిరాశచెందిన సీతాదేవి భర్త పాదాలు ధ్యానిస్తూ భూగర్భములోకి ప్రవేశించింది. అప్పుడు తాను భగవంతుడే అయినా రాముడు సీత కోసం దుఃఖిస్తూ, ఇలా అన్నాడు. “ఓ కాంతా! అయ్యో నీవు ఎందుకు భూమిలోకి కుంగిపోయావు. మన మధ్య ఉన్న ప్రేమను గుర్తుచేసుకో. నీ ముఖపద్మాన్ని చూపించు. నీ మృదుమధుర వాక్కులు వినిపించు. ఇలా నన్ను విడిచి పోవద్దు.” అవును, ఎంతటివారికి అయినా ప్రియురాలు దూరమైతే దుఃఖం కలగుతుంది కదా..

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=23&padyam=357

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: