Wednesday, November 8, 2017

పోతన రామాయణం - 31

9-317-వ.
వచ్చి పాదుకల ముందట నిడికొని, యెడనెడ సాష్టాంగదండప్రణామంబులు చేయుచు, మెల్లమెల్లన డాసి, రామచంద్రుని పాదంబులు దన నొసలం గదియించి, తచ్చరణరేణువులు దుడిచి, శిరంబునం జల్లికొని, తనివి చనక, మఱియు నప్పదకమలంబు లక్కున మోపి కొనుచు, సంతసంపుఁ గన్నీటం గడిగి, క్షేమంబు లరయుచుండె; నంత సీతాలక్ష్మణ సహితుండయి విభుండును, దన కెదురువచ్చిన బ్రాహ్మణ జనంబులకు నమస్కరించి, తక్కినవారలచేత మన్ననలు పొంది, వారల మన్నించెను; అయ్యవసరంబున.
9-318-చ.
నృపవర! పెక్కునాళ్ళఁగొలె నిన్ గనకుండిన యట్టి నేఁడు మా
తపములుపండె నిందఱము ధన్యులమైతి మటంచుఁ బుట్టముల్
చపలతఁ ద్రిప్పి పువ్వుల వసంతములాడుచుఁ బాడుచున్ గత
త్రపులయి యాడుచుం బ్రజలు దద్దయుఁ బండుగ జేసి రెల్లెడన్.

భావము:
అలా అన్నకు ఎదురు వచ్చిన భరతుడు, పాదుకలను ఎదురుగా ఉంచుకుంటూ, అడగడుక్కి సాష్టాంగనమస్కారాలు చేస్తూ మెల్లగా దగ్గరకు వచ్చి శ్రీరాముడి పాదాలు తన నుదుట చేర్చుకొన్నాడు. పాదధూళి తలపై జల్లుకొని తృప్తి చెందక, ఆ పాదాలను తన వక్షానికి చేర్చుకొని, ఆనంద భాష్పాలతో కడిగాడు. క్షేమసమాచారాలు అడిగాడు. అంతట సీతాలక్ష్మణు సమేతుడైన శ్రీరాముడు వచ్చిన విప్రులకు నమస్కారంచేసాడు. మిగిలిన వారి మర్యాదలు స్వీకరించి ఆదరించాడు. ప్రతిచోటా ప్రజలందరు పైబట్టలు గాలిలోతిప్పుతూ, పూల వసంతాలు ఆడుతు, పాడుతు, “మహారాజ! శ్రీరామ! అనేక రోజుల నుండి నిన్ను చూడకలేకపోయాం. ఇవాళ్టికి మా తపస్సులు ఫలించాయి. భాగ్యవంతులం అయ్యాము.” అని అంటూ గొప్పగా పండుగలు చేసుకొన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=317

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: