Saturday, September 16, 2017

పోతన రామాయణం - 6

9-267-క.
భరతున్ నిజపదసేవా
నిరతున్ రాజ్యమున నునిచి నృపమణి యెక్కెన్
సురుచిర రుచి పరిభావిత
గురుగోత్రాచలముఁ జిత్రకూటాచలమున్.
9-268-ఉ.
పుణ్యుఁడు రామచంద్రుఁ డట పోయి ముదంబునఁ గాంచె దండకా
రణ్యముఁ దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హి బర్హ లా
వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటనప్రభూత సా
ద్గుణ్యము నుల్లసత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్.

భావము:
తన పాదాసేవానురక్తుడైన భరతుడిని రాజ్య పాలన యందు నియమించాడు. పిమ్మట, కులపర్వతాలను మించిన రమణీయమైన కాంతులు గల చిత్రకూటపర్వతాన్ని రాజశేఖరుడు శ్రీరాముడు ఎక్కాడు. పుణ్యాత్ముడైన శ్రీరామచంద్రుడు అలా వెళ్ళి ఋషీశ్వరుల సమాశ్రయము, పురివిప్పి ఆడే నెమళ్ళతో మనోజ్ఞమైనది, పవిత్ర గోదావరీ జలాలతో విలసిల్లేది, గొప్ప చెట్లు పొదలుతో కూడినది ఐన విశిష్టమైన దండకారణ్యాన్ని సంతోషముతో దర్శించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=268

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: