Tuesday, September 12, 2017

పోతన రామాయణం - 3

9-262-మ.
ఒక మున్నూఱు గదల్చి తెచ్చిన లలాటోగ్రాక్షుచాపంబు బా
లకరీంద్రంబు సులీలమైఁ జెఱకుఁగోలం ద్రుంచు చందంబునన్
సకలోర్వీశులు చూడఁగా విఱిచె దోశ్శక్తిన్ విదేహక్షమా
పక గేహంబున సీతకై గుణమణిప్రస్ఫీతకై లీలతోన్.
9-263-క.
భూతలనాథుఁడు రాముఁడు 
ప్రీతుండై పెండ్లియాడెఁ బృథుగుణమణి సం
ఘాతన్ భాగ్యోపేతన్
సీతన్ ముఖకాంతివిజిత సితఖద్యోతన్.

భావము:
సుగుణాల ప్రోవు సీతాదేవి కోసం, ఆమె తండ్రి విదేహరాజు జనకుని ఇంట, రాజలోకం అందరు చూస్తుండగా, మూడువందల మంది కదలించి తీసుకువచ్చిన శివధనుస్సును, గున్న ఏనుగు అవలీలగా చెరుకు గడను విరిచినట్లు అతి సుళువుగా విరిచేసాడు. లోకనాయకుడు అయిన శ్రీరాముడు గొప్ప గుణవంతురాలు, అదృష్టవంతురాలు మఱియు చంద్రుని మించిన కాంతివంతమైన ముఖము కలిగిన సీతాదేవిని ప్రీతితో పెళ్ళిచేసుకొన్నాడు

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=263

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: