Thursday, July 20, 2017

దక్ష యాగము - 93

4-199-మ.
"మును కల్పాంతమునందుఁ గుక్షి నఖిలంబున్దాఁచి యేకాకివై
జనలోకోపరి లోకవాసులును యుష్మత్తత్త్వమార్గంబు చిం
తనముం జేయఁ బయోధియందు నహిరాట్తల్పంబునం బవ్వళిం
చిన నీ రూపము నేఁడు చూపితివి లక్ష్మీనాథ! దేవోత్తమా!"
4-200-వ.
గంధర్వు లిట్లనిరి.

టీకా:
మును = పూర్వము; కల్పాంతము = కల్పము యొక్క అంతము; అందున్ = సమయమునందు; కుక్షిన్ = కడుపులో; అఖిలంబున్ = సమస్తమును; దాచి = దాచి; ఏకాకివి = ఉన్నవాడవు ఒక్కడవే; ఐ = అయ్యి; జనలోక = జనలోకము; ఉపరి = పైనున్న; లోక = లోకముల నుండు; వాసులును = వసించువారును; యుష్మత్ = నీ యొక్క; తత్త్వమార్గంబున్ = తత్త్వ విధానమును; చింతనమున్ = ఆలోచన; చేయన్ = చేయగా; పయోధి = సముద్రము; అందున్ = లో; అహిరాట్ = శేష {అహిరాట్టు - అహి (సర్పము) లందు రాట్టు (రాజు), ఆదిశేషుడు}; తల్పంబునన్ = శయ్యయందు; పవ్వళించిన = శయనించిన; = నీ = నీ యొక్క; రూపమున్ = స్వరూపమును; నేడు = ఈవేళ; చూపితివి = చూపించితివి; లక్ష్మీనాథ = విష్ణుమూర్తి; దేవోత్తమా = దేవతలలో ఉత్తముడ. గంధర్వులు = గంధర్వులు; ఇట్లు = ఈవిధముగ; అనిరి = పలికిరి.

భావము:
“శ్రీపతీ! దేవాధిదేవా! పూర్వం ప్రళయకాలంలో సర్వాన్ని కడుపులో దాచుకొని నీవు ఒంటరిగా ఉన్నప్పుడు జనలోకానికన్నా పైలోకాలలో ఉండే సిద్ధపురుషులు నీ సత్య స్వరూపాన్ని మనస్సులో మననం చేయగా ఆనాడు పాలసముద్రం మధ్యలో పన్నగరాజు తల్పంపై పవ్వళించి ఉన్న నీ దివ్య స్వరూపాన్ని ఈనాడు మళ్ళీ మాకుచూపించావు.” గంధర్వులు ఇలా అన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=199

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం :

No comments: