Monday, July 10, 2017

దక్ష యాగము - 85:

4-183-చ.
"కడఁగి భవత్పదార్చనకుఁ గా నిటు దక్షునిచే రచింపఁగాఁ
బడి శితికంఠరోషమున భస్మము నొంది పరేతభూమియై
చెడి కడు శాంతమేధమునఁ జెన్నఱియున్న మఖంబుఁ జూడు మే
ర్పడ జలజాభ నేత్రములఁ బావన మై విలసిల్లు నచ్యుతా!"
4-184-వ.
ఋషు లిట్లనిరి.

టీకా:
కడగి = పూని; భవత్ = నీ యొక్క; పద = పాదముల; అర్చన = పూజ; కున్ = కు; కాన్ = అగునట్లు; ఇటు = ఈవిధముగ; దక్షుని = దక్షుని; చేన్ = చేత; రచింపగాబడి = ఏర్పరుపబడి; శితికంఠ = శివుని {శితికంఠుడు - శితి (నల్లని) కంఠుడు (కంఠముకలవాడు), శివుడు}; రోషమునన్ = క్రోధముచే; భస్మమున్ = కాలిబూడిద; ఒంది = అయ్యి; పరేత = శ్మశాన; భూమి = భూమి; ఐ = అయ్యి; చెడి = చెడిపోయి; కడు = మిక్కిలి; శాంత = ఆగిపోయిన; మేధమునన్ = బలులుతో; చెన్నఱి = కళా విహీనమై; ఉన్న = ఉన్నట్టి; మఖంబున్ = యజ్ఞమును; చూడుము = చూడుము; ఏర్పడ = ఏర్పడునట్లు; జలజ = పద్మముల; అభ = వంటి; నేత్రములన్ = కన్నులతో; పావనము = పవిత్రము; ఐ = అయ్యి; విలసిల్లున్ = విలసిల్లును; అచ్యుత = నారాయణ. ఋషులు = ఋషులు; ఇట్లు = ఈవిధముగ; అనిరి = పలికిరి.

భావము:
“నీ పాదాలను ఆరాధించడంకోసం దక్షప్రజాపతి ప్రారంభించిన యజ్ఞం పరమశివుని ఆగ్రహంవల్ల భస్మీపటలం అయింది. యజ్ఞభూమి శ్మశానంగా మారి కళాహీనంగా కనిపిస్తున్నది. యజ్ఞవైభవమంతా నేల పాలయింది. అచ్యుతా! పద్మపత్రాల వంటి నీ నేత్రాలను విప్పి ఒక్కమాటు చూస్తే ఈ యజ్ఞం పవిత్రమై యథారూపాన్ని పొందుతుంది. ఋషులు ఇలా స్తుతించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=183

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: