Monday, July 31, 2017

శ్రీ కృష్ణ జననం - 6

10.1-33-క.
కావునఁ బరులకు హింసలు
గావింపఁగ వలదు తనకుఁ గల్యాణముగా 
భావించి పరుల నొంచినఁ
బోవునె? తత్ఫలము పిదపఁ బొందక యున్నే?
10.1-34-మత్త.
వావిఁ జెల్లెలు గాని పుత్రికవంటి దుత్తమురాలు; సం
భావనీయచరిత్ర; భీరువు; బాల; నూత్నవివాహ సు
శ్రీవిలాసిని; దీన; కంపితచిత్త; నీ కిదె మ్రొక్కెదం; 
గావవే; కరుణామయాత్మక; కంస! మానవవల్లభా!
10.1-35-వ.
అని మఱియు సామభేదంబులగు పలుకులు పలికిన వినియు వాఁడు వేఁడిచూపుల రాలు నిప్పులు గుప్పలుగొన ననుకంపలేక, తెంపుఁజేసి చంపకగంధిం జంపఁ జూచుట యెఱింగి మొఱంగెడి తెఱంగు విచారించి తనలో నిట్లనియె.

భావము:
కాబట్టి, ఇతరులను బాధించడం మంచిపని కాదు. తన సౌఖ్యం కోసం అనుకుంటూ ఇతరులను బాధిస్తే ఊరకే పోతుందా? దానికి ఫలితం తరువాత అయినా పొందక తప్పదు కదా.. ఓ కంసమహారాజా! నువ్వు దయామయుడవు. ఈ దేవకి ఏదో వరసకి చెప్పడానికి నీకు చెల్లెలు కాని నీకు కూతురు వంటిది. చాలా మంచిది. గౌరవించదగ్గ ప్రవర్తన కలది. భయస్తురాలు. కొత్త పెళ్ళికూతురు. మంచి లక్ష్మీకళ ఉట్టిపడుతున్నది. దీనురాలు. భయంతో లోలోన వణికిపోతూ ఉంది. ఇదిగో నీకు మ్రొక్కుతున్నాను, ఈమెను కాపాడవయ్యా ఇలా వసుదేవుడు ఎంతో అనునయంగా కంసుడి మనస్సు కరిగించాలని మాట్లాడాడు. అయినా కంసుడికి జాలి పుట్ట లేదు. అతడు కోపపు చూపులతో కన్నుల నుండి నిప్పులు రాలుతూండగా, దేవకిని చంపబోయాడు. అతని మూర్ఖత్వాన్ని గమనించి వసుదేవుడు ఎలాగైనా అతణ్ని ఒప్పించాలని తనలో ఇలా అనుకున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=5&padyam=34

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: