Saturday, June 24, 2017

దక్ష యాగము - 71:

4-157-క.
విను దక్షు నంత మేషము
ఖునిఁ జేసిన నిద్ర మేలుకొని లేచిన పో
ల్కిని నిలిచె దక్షుఁ, డభవుఁడు
కనుఁగొనుచుండంగ నాత్మఁ గౌతుక మొప్పన్.
4-158-వ.
ఇట్లు లేచి నిలిచి ముందఱ నున్న శివునిం గనుంగొనిన మాత్రన శరత్కాలంబున నకల్మషంబైన సరస్సునుంబోలెఁ బూర్వరుద్రవిద్వేష జనితంబు లైన కల్మషంబులం బాసి నిర్మలుండై యభవుని నుతియింపం దొడంగి మృతిఁ బొందిన సతీ తనయం దలంచి యనురా గోత్కంఠ బాష్పపూరిత లోచనుండును, గద్గదకంఠుండునునై పలుకం జాలక యెట్టకేలకు దుఃఖంబు సంస్తంభించుకొని ప్రేమాతిరేక విహ్వలుం డగుచు సర్వేశ్వరుం డగు హరున కిట్లనియె.

టీకా:
విను = వినుము; దక్షున్ = దక్షుని; అంత = అప్పుడు; మేష = గొర్రె; ముఖునిన్ = తల కలవానిగ; చేసినన్ = చేయగా; నిద్రన్ = నిద్రనుండి; మేలుకొని = మేల్కొని; లేచిన = లేచిన; పోల్కిని = విధముగ; నిలిచెన్ = నిలబడెను; దక్షుడు = దక్షుడు; అభవుడు = బ్రహ్మదేవుడు; కనుగొనుచుండగన్ = చూస్తుండగా; ఆత్మన్ = మనసున; కౌతుకము = కుతూహలము; ఒప్పన్ = ఒప్పగ. ఇట్లు = ఈవిధముగ; లేచి = లేచి; నిలిచి = నిలబడి; ముందఱ = ఎదుట; ఉన్న = ఉన్నట్టి; శివునిన్ = శివుని; కనుగొనిన = చూసి; మాత్రన = మాత్రముచేతనే; శరత్కాలంబునన్ = శరత్కాలమునందు; అకల్మషంబున్ = నిర్మలము; ఐన = అయిన; సరస్సునున్ = సరోవరము; పోలెన్ = వలె; పూర్వ = పాతకాలపు; రుద్ర = శివ; విద్వేష = ద్వేషించుటచేత; జనితంబులు = పుట్టినవి; ఐన = అయిన; కల్మషంబులన్ = దోషములను; పాసి = తొలగి; నిర్మలుండు = అమలినుడు; ఐ = అయ్యి; అభవుని = శివుని; నుతియింపన్ = స్తోత్రముచేయ; తొడగి = మొదలెట్టి; మృతి = మరణము; పొందిన = పొందిన; సతీ = సతి అనెడి; తనయన్ = పుత్రికను; తలంచి = తలచుకొని; అనురాగ = ప్రేమ; ఉత్కంఠలన్ = వేగిరిపాటులవలన; బాష్ప = కన్నీటితో; పూరిత = నిండిన; లోచనుండును = కన్నులు కలవాడును; గద్గద = గద్గదమైన; కంఠుండును = కంఠముకలవాడును; ఐ = అయ్యి; పలుకన్ = పలుక; చాలక = లేక; ఎట్టకేలకు = ఆఖరికి; దుఃఖంబున్ = దుఃఖమును; సంస్తంభించుకొని = చక్కగ ఆపుకొని; ప్రేమా = ప్రేమ; అతిరేక = అతిశయముచే; విహ్వలుడు = విహ్వలుడు; అగచున్ = అవుతూ; సర్వేశ్వరుండు = సమస్తమునకు ప్రభువు; అగు = అయిన; హరున్ = శివుని; కిన్ = కి; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.

భావము:
విదురా! విను. శివుడు దక్షుని గొఱ్ఱెతల కలవానిగా చేసి చూస్తుండగా అతడు నిద్రనుండి మేలుకొన్న విధంగా సంతోషంగా లేచాడు. అలా లేచి నిలిచిన దక్షుడు శివుని చూచినంత మాత్రాన శరత్కాలంలో బురద లేని సరస్సు వలె పూర్వం రుద్రుని ద్వేషించడం వలన కలిగిన దోషాలను పోగొట్టుకొని నిర్మలుడై ఆ శివుణ్ణి స్తుతించాలకున్నాడు. కాని మరణించిన తన కూతురును తలచుకొని ప్రేమతో, తహతహపాటుతో కన్నులలో నీరు నిండగా, డగ్గుత్తిక పడిన కంఠంతో మాట్లాడలేక, ఎట్టకేలకు దుఃఖాన్ని దిగమ్రింగుకొని ప్రేమాతిరేకంతో ఒడలు మరచి ఆ శివునితో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=157

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: