Monday, May 22, 2017

దక్ష యాగము - 40:

4-102-క.
దేహము విడిచిన సతిఁ గని
బాహాబల మొప్ప రుద్రపార్షదులును ద
ద్ద్రోహిం ద్రుంచుటకై యు
త్సాహంబున లేచి రసిగదాపాణులునై.
4-103-క.
ఆ రవ మపు డీక్షించి మ
హారోషముతోడ భృగుమహాముని క్రతు సం
హారక మారక మగు 'నభి
చారకహోమం' బొనర్చె సరభసవృత్తిన్.

టీకా:
దేహమువిడిచిన = మరణించిన; సతిన్ = సతీదేవిని; కని = చూసి; బాహా = బాహువుల యొక్క; బలము = శక్తి; ఒప్పన్ = అతిశయించగ; రుద్ర = శివుని; పార్షదులు = అనుచరులు; తత్ = ఆ; ద్రోహిన్ = ద్రోహిని; త్రుంచుట = సంహరించుట; కై = కోసము; ఉత్సాహంబునన్ = పట్టుదలతో; లేచిరి = లేచిరి; అసి = కత్తులు; గదా = గదలు; పాణులు = చేతులలో ధరించినవారు; ఐ = అయ్యి. ఆ = ఆ; రవము = చప్పుళ్లు; అపుడు = అప్పుడు; ఈక్షంచి = చూసి; మహా = గొప్ప; రోషము = రోషము; తోడ = తోటి; భృగు = భగువు అనెడి; మహా = గొప్ప; ముని = ముని; క్రతు = యజ్ఞమును; సంహారక = నాశనము చేయుదానికి; మారకము = మృత్యువు; అగు = అయ్యెడి; అభిచారక = చెడుచేయుటకైనట్టి; హోమంబు = కర్మకాండ; ఒనర్చె = చేసెను; = సరభస = త్వరతతోకూడిన; వృత్తిన్ = విధముగ.

భావము:
మరణించిన సతీదేవిని చూసి శివుని అనుచరులైన ప్రమథగణాలు అతిశయించిన బాహుబలంతో కత్తులు గదలు చేతుల్లో ధరించి దక్షుని సంహరించడానికి ఉత్సాహంతో లేచారు. ఆ సందడిని చూసి అధ్వర్యుడైన భృగుమహర్షి మిక్కిలి కోపంతో యజ్ఞనాశకులను సంహరించే అభిచారక హోమాన్ని వెంటనే చేశాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=102

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: