Wednesday, May 3, 2017

దక్షయాగము - 21:

4-67-క.
అనయముఁ బిలువక యుండం
జన ననుచిత మంటివేని జనక గురు సుహృ
జ్జననాయక గేహములకుఁ
జనుచుందురు పిలువకున్న సజ్జను లభవా!"
4-68-వ.
అని మఱియు నిట్లనియె “దేవా! నా యందుఁ బ్రసన్నుండవై మదీయ మనోరథంబుం దీర్ప నర్హుండవు; సమధిక జ్ఞానంబు గల నీచేత నేను భవదీయదేహంబు నందర్థంబున ధరియింపంబడితి; నట్టి నన్ను ననుగ్రహింపవలయు” నని ప్రార్థించిన మందస్మితవదనారవిందుం డగుచు జగత్స్రష్టల సమక్షంబున దక్షుండు తన్నాడిన మర్మభేదంబు లైన కుహక వాక్యసాయకంబులం దలంచుచు నిట్లనియె.

టీకా:


అనయమున్ = అవశ్యము; పిలువక = పిలవకుండ; ఉండన్ = ఉండగ; జనన్ = వెళ్ళుట; అనుచితము = తగనిది; అంటివేని = అంటే; జనక = తండ్రి; గురు = గురువు; సుహృత్ = స్నేహితుడు; జననాయక = రాజు {జననాయక - ప్రజలకు నాయకుడు, రాజు}; గేహముల్ = గృహముల; కున్ = కు; చనుచుందురు = వెళ్తుంటారు; పిలవకున్నన్ = పిలవకపోయిన; సజ్జనలు = మంచివారు; అభవా = శివ. అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఇలా; అనియెన్ = పలికెను; దేవా = దేవుడ; నా = నా; అందున్ = ఎడల; ప్రసన్నుండవు = సుముఖుడవు; ఐ = అయ్యి; మదీయ = నా యొక్క; మనోరథంబున్ = కోరికను {మనోరథము - మనసున ధరించినది, కోరిక}; తీర్పన్ = తీర్చుటకు; అర్హుండవు = తగినవాడవు; సమ = మిక్కిలి; అధిక = అధికమైన; జ్ఞానంబు = జ్ఞానము; కల = కలిగినట్టి; నీ = నీ; చేతన్ = చేత; నేను = నేను; భవదీయ = నీ యొక్క; దేహంబునన్ = దేహమందు; అర్థంబునన్ = సగములో; ధరియింపంబడితిని = ధరింపబడితిని; అట్టి = అటువంటి; నన్నున్ = నన్ను; అనుగ్రహింపవలయును = అనుగ్రహించవలసినది; అని = అని; ప్రార్థించిన = ప్రార్థించగ; మందస్మిత = చిరునవ్వుగల; వదన = మోము యనెడి; అరవిందుండు = పద్మముగలవాడు; అగుచున్ = అవుతూ; జగత్ = లోకములకు; స్రష్టలు = సృష్టికారకుల; సమక్షంబునన్ = ఎదుట; దక్షుండు = దక్షుడు; తన్నున్ = తనను; ఆడిన = అడినట్టి; మర్మభేదంబులు = మనసుకు కష్టము కలిగించునవి; ఐన = అయినట్టి; కుహక = కపట; వాక్య = మాటలు యనెడి; సాయకంబులన్ = బాణములను; తలంచుచున్ = తలచుకొంటూ; ఇట్లు = ఇలా; అనియెన్ = పలికెను.

భావము:
అభవా! పిలువకుండా వెళ్ళడం తగదని మీరు అనవచ్చు. తండ్రి, గురువు, మిత్రులు, రాజు మొదలైనవారి యిండ్లకు పిలువకపోయినా సజ్జనులైనవారు వెళ్తారు కదా! అని చెప్పి సతీదేవి మళ్ళీ ఇలా అన్నది “దేవా! నా పట్ల ప్రసన్నబుద్ధితో నా కోరికను తీర్చగలవాడవు నీవు. జ్ఞానవంతుడవైన నీచేత అర్ధశరీరాన్ని పొందినదానను. అటువంటి నన్ను అనుగ్రహించు” అని ప్రార్థించగా శివుడు చిరునవ్వు నవ్వుతూ పూర్వం సృష్టికర్తలైన ప్రజాపతుల సన్నిధిలో దక్షుడు తనను పలికిన బాణాలవంటి మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని సతీదేవితో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=67

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: