Thursday, April 27, 2017

దక్షయాగము - 15:


4-56-తే.
దక్షతనయ సతీదేవి దవిలి యాత్మ
సదనమున నుండి జనకుని సవనమహిమ
గగన చరులు నుతింప నా కలకలంబు
విని కుతూహలిని యయి విన్వీథిఁ జూడ.
4-57-వ.
అయ్యవసరంబునఁ దదుత్సవ దర్శన కుతూహలులై సర్వదిక్కుల వారును జనుచుండి; రా సమయంబున.

టీకా:
దక్ష = దక్షుని; తనయ = పుత్రిక; సతీదేవి = సతీదేవి; తవిలి = పూని; ఆత్మ = తన; సదనమున్ = భవనము; నుండి = నుంచి; జనకుని = తండ్రి; సవన = యాగము యొక్క; మహిమన్ = గొప్పదనమును; గగనచరులు = ఆకాశన తిరుగు దేవతలు; నుతింపన్ = స్తుతింపగా; ఆ = ఆ; కలకలంబున్ = శబ్దములను; విని = వినుటచే; కుతూహలిని = కుతూహలముకలామె; అయి = అయ్యి; విన్వీథిన్ = ఆకాశమార్గమును; చూడన్ = చూడగా. ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు; తత్ = ఆ; ఉత్సవము = ఉత్సవమును; దర్శన = చూసెడి; కుతూహలులు = కుతూహలముకలవారు; ఐ = అయ్యి; సర్వ = అన్ని; దిక్కులన్ = దిక్కులందు; వారున్ = ఉండువారు; చనుచుండిరి = వెళ్ళుతుండిరి; ఆ = ఆ; సమయంబునన్ = సమయములో.

భావము:
దక్షుని కూతురైన సతీదేవి తన ఇంటిలో ఉన్నదై తండ్రి చేస్తున్న యజ్ఞవైభవాన్ని దేవతలు పొగడుతుండగా ఆ కలకలాన్ని విని ఆకాశంవైపు చూడగా... అప్పుడు ఆ యజ్ఞవైభవాన్ని చూడాలనే కుతూహలంతో అన్నిదిక్కులవారు వెళ్తున్నారు. ఆ సమయంలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=56

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: