Saturday, March 4, 2017

త్రిపురాసుర సంహారం - 8:


7-398-క.
సిద్ధామృతరస మహిమను
శుద్ధమహావజ్రతుల్య శోభిత తను లై
వృద్ధిం బొందిరి దానవు
లుద్ధత నిర్ఘాత పావకోపము లగుచున్.
7-399-క.
కూపామృత రససిద్ధిని
దీపితులై నిలిచి యున్న దేవాహితులన్
రూపించి చింత నొందెడు
గోపధ్వజుఁ జూచి చక్రి కుహనాన్వితుఁడై.

టీకా:
సిద్ధ = యోగసిద్దమైన; అమృత = అమృతపు; రస = ద్రవము యొక్క; మహిమను = ప్రభావముచేత; శుద్ధ = స్వచ్ఛమైన; మహా = గొప్ప; వజ్ర = వజ్రముతో; తుల్య = సమానమైన; శోభిత = ప్రకాశించెడి; తనులు = దేహములు గలవారు; ఐ = అయ్యి; వృద్ధింబొందిరి = పెంపొందిరి; దానవులు = రాక్షసులు; ఉద్ధతన్ = అతిశయముతో; నిర్ఘాత = పిడుగులలోని; పావక = నిప్పులకు; ఉపములు = పోల్చదగినవారు; అగుచున్ = అగుచు. కూప = బావిలోని; అమృత = అమృతపు; రస = ద్రవము; సిద్ధిని = ఫలించుటచేత; దీపితులు = ప్రకాశించెడివారు; ఐ = అయ్యి; నిలిచి = బతికి; ఉన్న = ఉన్నట్టి; దేవాహితులన్ = రాక్షసులను; రూపించి = కనిపెట్టి; చింతన్ = విచారమును; ఒందెడు = పొందుచున్న; కోపద్వజునిన్ = పరమశివుని {కోపద్వజుడు - వృషభము ద్వజము (జండా) గా గలవాడు, శివుడు}; చూచి = చూసి; చక్రి = విష్ణుమూర్తి {చక్రి - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు}; కుహన = మాయావిలాసముతో; ఆన్వితుండు = కూడినవాడు; ఐ = అయ్యి.

భావము:
ఆ సిద్ధరస ప్రభావం వలన ఆ రక్కసులందరూ పునరుజ్జీవితులు అయ్యారు, వజ్రాల వంటి దృఢమైన దేహాలతో చిచ్చర పిడుగుల వలె బలసంపన్నులు అయ్యారు. మయుని సిద్ధరస కూపం ప్రభావం వల్ల రాక్షసులు ఇలా ప్రబలి విజృంభించటం, తన బాణశక్తి వ్యర్థం కావటం తెలిసి మహాశ్వరునకు బాధ కలిగింది. తన పరాక్రమానికి కళంకం ఏర్పడిందని, తన కీర్తికి మచ్చ కలిందని చింతించాడు. విష్ణుమూర్తి ఇది తెలుసుకుని ఉపాయం ఆలోచించాడు. మాయగాళ్ళను మాయల తోటే మట్టుపెట్టాలని నిశ్చయించుకున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=399

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: