Friday, March 3, 2017

త్రిపురాసుర సంహారం - 7:

7-397-వ.
అనిన భక్తవత్సలుం డగు పరమేశ్వరుండు శరణాగతు లైన గీర్వాణుల వెఱవకుం డని దుర్వారబలంబున బాణాసనంబుఁ గేల నందికొని యొక్క దివ్యబాణంబు సంధించి త్రిపురంబులపయి నేసిన మార్తాండమండలంబున వెలువడు మయూఖజాలంబుల చందంబునఁ దద్బాణంబువలన దేదీప్యమానంబులై యనేక బాణసహస్రంబులు సంభవించి భూ నభోంతరాళంబులు నిండి మండి తెప్పలుగాఁ గుప్పలు గొని త్రిపురంబుల పయిఁ గప్పె; నప్పుడు తద్బాణపావక హేతిసందోహ దందహ్యమాను లై గతాసు లయిన త్రిపురపుర నివాసులం దెచ్చి మహాయోగి యైన మయుండు సిద్ధరసకూపంబున వైచిన.

టీకా:
అనినన్ = అనగా; భక్తవత్సలుండు = పరమశివుడు {భక్తవత్సలుడు - భక్తులయెడ వాత్సల్యముగలవాడు, శివుడు}; అగు = అయిన; పరమేశ్వరుండు = పరమశివుడు {పరమేశ్వరుడు - పరమ (అత్యుత్తమమైన) ఈశ్వరుడు (ప్రభువు), శివుడు}; శరణ = శరణుగోరి; ఆగతులు = వచ్చినవారు; ఐన = అయిన; గీర్వాణులన్ = దేవతలను {గీర్వాణులు - శాపరూపమగు వాక్కు (బాణముగా) గలవారు, దేవతలు}; వెఱవకుండు = బెదరకండి; అని = అని; దుర్వార = వారింపశక్యముగాని; బలంబునన్ = శక్తితో; బాణాసనంబున్ = విల్లును; కేలన్ = చేతిలోకి; అందికొని = తీసుకొని; ఒక్క = ఒక; దివ్య = దివ్యమైన; బాణంబున్ = బాణమును; సంధించి = ఎక్కుపెట్టి; త్రిపురంబుల్ = త్రిపురముల; పయిన్ = మీద; ఏసిన = ప్రయోగించగా; మార్తాండ = సూర్య {మార్తాండుడు - బ్రహ్మాండము మృతి (రెండు చెక్కలగునప్పుడు) పుట్టినవాడు, సూర్యుడు}; మండలంబునన్ = మండలమునుండి; వెలువడు = వెలువడెడి; మయూఖ = కిరణముల; జాలంబుల = సమూహముల; చందంబునన్ = వలె; తత్ = ఆ; బాణము = బాణము; వలన = నుండి; దేదీప్యమానంబులు = మిక్కిల ివెలుగుచున్నవి; ఐ = అయ్యి; అనేక = పలు; బాణ = బాణముల; సహస్రంబులు = వేలకొలది; సంభవించి = పుట్టి; భూ = భూమి; నభో = ఆకాశము; అంతరాళంబులు = మధ్యప్రదేశములు; నిండి = నిండిపోయి; మండి = కాలిపోయి; తెప్పలు = తుట్టలు; కాన్ = అయినట్లు; కుప్పలుకొని = గుంపులై; త్రిపురంబుల్ = త్రిపురముల; పయిన్ = మీద; కప్పెన్ = కప్పివేసెను; అప్పుడు = అప్పుడు; తత్ = ఆ; బాణ = బాణము యొక్క; పావక = అగ్ని; హేతి = మంటల; సందోహ = సమూహమునకు; దందహ్యమానులు = మిక్కలికాలిపోయినవారు; ఐ = అయ్యి; గతాసులు = పోయిన ఊపిరిగలవారు; అయిన = ఐనట్టి; త్రిపుర = త్రిపురములలో; నివాసులన్ = వసించెడివారిని; తెచ్చి = తీసుకొచ్చి; మహా = గొప్ప; యోగి = యోగబలముగలవాడు; ఐన = అయిన; మయుండు = మయుడు; సిద్ధరస = అమృతపు; కూపంబునన్ = బావిలో; వైచినన్ = వేయగా.

భావము:
అని ఇలా దేవతలు మొరపెట్టగా, పరమ భక్తవశంకరుడగు శంకరుడు కరుణించి, అభయహస్తం ఇచ్చాడు. అవక్రపరాక్రమంతో ధనుస్సు చేతపట్టాడు. దివ్యమైన అగ్నేయాస్త్రం గురిపెట్టి త్రిపురాలపైకి వేశాడు. ఆ బాణం వలన చండ ప్రచండమైన సూర్యమండలంలో వెలిగే కిరణాల సమూహాల వంటి అగ్నిశిఖలు సహస్రముఖాలుగా వెలువడి భూమ్యాకాశాలు నిండి, మండి, నిప్పులు తెప్పలు తెప్పలుగా కురుస్తూ త్రిపురాలను చుట్టుముట్టాయి. ఆ బాణాగ్ని శిఖల సందోహానికి దానవులు దహించుకు పోయి ప్రాణాలు విడిచారు. అపుడు మహాయోగి అయిన మయుడు తన యోగబలంతో, సిద్ధరసంతో నిండిన కూపంలో అసువులు బాసిన త్రిపుర వాసులైన అసురులను తెచ్చి వేశాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=397

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: