Monday, March 6, 2017

త్రిపురాసుర సంహారం - 10:

7-402-ఆ.
అమరు లైన దనుజు లైనను నరు లైన
నెంత నిపుణు లైన నెవ్వరైన
దైవికార్థచయముఁ దప్పింపఁగా లేరు
వలదు దనుజులార! వగవ మనకు.
7-403-వ.
అని పలికె; అంత విష్ణుండు నైజంబు లైన ధర్మవిజ్ఞానవిద్యాతపో విరక్తి సమృద్ధి క్రియాశక్తివిశేషంబుల శంభునికిఁ బ్రాధాన్యంబు సమర్పించి రథసూత కేతు వర్మ బాణాసన ప్రముఖ సంగ్రామ సాధనంబులు చేసినం గైకొని.

టీకా:
అమరులు = దేవతలు {అమరులు - మరణములేనివారు, దేవతలు}; ఐనన్ = అయినను; దనుజులు = రాక్షసులు {దనుజులు - కశ్యపునకు దనువు యందు కలిగిన సంతానము, రాక్షసులు}; ఐనను = అయినను; నరులు = మానవులు; ఐనన్ = అయినను; ఎంత = ఎంత; నిపుణులు = నేర్పరులు; ఐనన్ = అయినను; ఎవ్వరు = ఎవరు; ఐనన్ = అయినను; దైవిక = దైవమువలన ప్రాప్తించెడి; అర్థ = విషయముల; చయమున్ = సమూహములను; తప్పింపగా = తొలగించుటకు; లేరు = సమర్థులుకారు; వలదు = వద్దు; దనుజులారా = రాక్షసులూ; వగవన్ = దుఃఖపడుటకు; మన = మన; కున్ = కు.అని = అని; పలికె = చెప్పెను; అంతన్ = అంతట; విష్ణుండు = విష్ణుమూర్తి; నైజంబులు = తనవి; ధర్మ = న్యాయము; విజ్ఞాన = విజ్ఞానము; విద్య = విద్య; తపస్ = తపస్సు; విరక్తి = వైరాగ్యము; సమృద్ధి = నిండుదనము; క్రియాశక్తి = కర్మసామర్థ్యముల; విశేషంబులన్ = అతిశయములను; శంభునికి = శివునికి; ప్రాధాన్యంబు = ముఖ్యత్వము; సమర్పించి = ఇచ్చి; రథ = రథము; సూత = సారథి; కేతు = జండా; వర్మ = డాలు; బాణాసన = విల్లు; ప్రముఖ = మొదలైన; సంగ్రామ = యుద్ద; సాధనంబులు = పరికరములు; చేసినన్ = కలిగించగా; కైకొని = చేపట్టి.

భావము:
“రక్కసుల్లారా! దైవేచ్ఛ ఇలా ఉంది కాబోలు. దైవేచ్ఛను తప్పించటం ఎవరి తరమూ కాదు. అమరులైనా, అసురులైనా నరులైనా ఎంతటివారైనా విధివిలాసాన్ని మార్చలేరు కదా. దీనికి మనం దుఃఖించరాదు.” ఇలా పలికి మయుడు రాక్షసులను ఓదార్చాడు. అటుపిమ్మట విష్ణువు తన సహజశక్తులైన ధర్మం, జ్ఞానం, విద్య, తపస్సు, సమృద్ధి, క్రియాశక్తి విశేషాలతో రథం, సారథి, కేతనం, కవచం, విల్లు, అమ్ములు మున్నగు యుద్ధసామగ్రి అంతా సమకూర్చాడు. రథికుడైన శివుడు స్వీకరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=402

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: