Tuesday, February 14, 2017

కాళియమర్దనము – అంతలోన వారునుం

కాళియమర్దనము – అంత నా దుర్నిమిత్తంబులు
:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:


10.1-652-వ.
అంతలోన వారునుం దానును గాంతారమార్గంబు పట్టిపోవుచు నెడనెడ గోపగోష్పదంబుల సందుల నింతనంత నక్కడక్కడ యవాంకుశ హల కమల కులిశ చక్ర చాప కేతనాది రేఖాలంకృతంబులై మార్గాభరణంబులయిన హరిచరణంబుల జాడఁ గని చొప్పుదప్పక చని దుర్ఘటంబైన యమునా తటంబుఁ జేరి వారిమధ్యంబున నితరుల కసాధ్యం బయిన సర్పంబుచేతఁ గాటుపడి దర్పంబుఁ జూపక భోగిభోగపరివృతుం డయిన శ్రీకృష్ణునిం గని "కృష్ణ కృష్ణేతి" విలాపంబులఁ దాపంబులం బొందుచు తత్కాలంబునఁ బ్రతికూలం బయ్యె ననుచు దైవంబుఁ దిట్టు గోపికలును గోపకులం గలసి మేతలుడిగి ఱెప్పలిడక కృష్ణునిం దప్పక చూచుచు నొఱలుచున్న గోవులం గని; రందు గోపికలు యశోదం బట్టుకొని విలపించుచుఁ గృష్ణు నుద్దేశించి యిట్లనిరి.

టీకా:
అంతలోన = ఆలోపున; వారునున్ = ఆ గోపకులు; తానును = అతను; కాంతార = అడవి; మార్గంబున్ = దారి; పట్టి = అమ్మట, వెంట; పోవుచున్ = వెళ్తూ; ఎడనెడ = అక్కడక్కడ; గోప = గోపాలుర; గో = ఆవుల; పాదంబులన్ = పాదముద్రలను; సందులన్ = మధ్యలో; ఇంతనంతన్ = ఇంతింత; అక్కడక్కడ = అక్కడక్కడ; యవ = గోధుమగింజ; అంకుశ = అంకుశపు; హల = నాగలి; కమల = పద్మము; కులిశ = వజ్రము; చక్ర = చక్రము; చాప = విల్లు; కేతన = ధ్వజము; ఆది = మొదలైన; రేఖా = గుర్తులుగల రేఖలచే; అలంకృతంబులు = అలంకరింపబడినవి; ఐ = అయ్యి; మార్గ = మార్గమునకు; ఆభరణంబులు = భూషణములు; అయిన = ఐనట్టి; హరి = కృష్ణుని; చరణంబుల = పాదముద్రల; జాడన్ = పోబడిగుర్తులు; కని = కనుగొని; చొప్పు = జాడ; తప్పక = విడువక; చని = వెళ్ళి; దుర్ఘటంబు = చేరరానిది; ఐన = అయన; యమునా = యమునానదీ; తటంబున్ = గట్టును; చేరి = చేరి; వారి = నీటి; మధ్యన = నడుమ; ఇతరుల = మామూలువారి; కిన్ = కి; అసాధ్యంబు = సాధింపశక్యముకానిది; అయిన = ఐనట్టి; సర్పంబున్ = పాము; చేతన్ = చేత; కాటుపడి = కాటువేయబడి; దర్పంబున్ = పరాక్రమము; చూపక = చూపించకుండ; భోగి = పాము; భోగ = శరీరముచేత; పరివృతుండు = పెనవేసుకోబడినవాడు; అయిన = ఐనట్టి; శ్రీకృష్ణుని = శ్రీకృష్ణుని; కని = చూసి; కృష్ణా = కృష్ణా; కృష్ణా = కృష్ణా; ఇతి = అని; విలాపంబులన్ = ఏడ్చుటలను; తాపంబులన్ = తపించుటలను; పొందుచు = పొందుతు; తత్ = ఆ; కాలంబునన్ = సమయము; ప్రతికూలంబు = వ్యతిరేకముచేయువాడు; అయ్యెను = అయ్యెను; అనుచున్ = అనుచు; దైవంబున్ = భగవంతుడిని; తిట్టు = తిడుతున్నట్టి; గోపికలను = గొల్లస్త్రీలు; గోపకులన్ = గొల్లలు; కలిసి = తోపాటు; మేతలు = గడ్డితినుటలు; ఉడిగి = మానివేసి; ఱెప్పలిడక = కనురెప్పలువాల్చకుండ; కృష్ణునిన్ = కృష్ణుని; తప్పక = దృష్టితప్పక; చూచుచున్ = చూస్తు; ఒఱలుచున్న = విలపించుచున్న; గోవులన్ = ఆవులను; కనిరి = చూసిరి; అందు = అప్పుడు; గోపికలు = గొల్లస్త్రీలు; యశోదన్ = యశోదను; పట్టుకొని = కౌగలించుకొని; విలపించుచున్ = ఏడ్చుచు; కృష్ణున్ = కృష్ణుని; ఉద్దేశించి = గూర్చి; ఇట్లు = ఇలా; అనిరి = పలికిరి.

భావము:
బలరాముడు కూడ వారితో పాటు అడవిలో ప్రవేశించి కృష్ణుడి జాడ వెదుక సాగాడు. గోపబాలుర, గోవుల కాలి గుర్తుల మధ్యలో అక్కడక్కడ కృష్ణుని అడుగుజాడలు కనబడసాగాయి. కృష్ణుడి అడుగు జాడలలో యవరేఖ, అంకుశరేఖ, హలరేఖ, వజ్ర రేఖ, చక్రరేఖ, చాపరేఖ, ధ్వజరేఖ మున్నగు శుభలక్షణాల రేఖలన్నీ కనిపిస్తు ఆ దారికే ఆభరణాలై ప్రకాశించసాగాయి. వారంతా చివరికి చేరటానికి దుష్కరమైన యమునానది మడుగు వద్దకు చేరారు. నీటి మధ్యలో ఇప్పటిదాకా ఎవరికి జయించ సాధ్యంకాని మహాసర్పంచేత కాటువేయబడి దాని శరీరంచేత చుట్టివేయబడిన కృష్ణుడిని చూసారు. అతడు శక్తి కోల్పోయిన వాడిలా సొమ్మసిలి పడి ఉన్నాడు. అది చూసి “కృష్ణా! కృష్ణా!” అంటు విలపిస్తు వారంతా దుఃఖంతో తపించసాగారు. "ఇన్నాళ్ళు దయ చూపిన దైవం ఈరోజు ప్రతికూలమైందా ఏమిటి?" అని గోపకులు దుర్విధిని తిట్టసాగారు. వారితో పాటు గోవులు లేగలుతో సహా మేతలు మేయడం మానేసి రెప్పలార్పకుండ కృష్ణుణ్ణే చూస్తూ కన్నీళ్ళు కారుస్తున్నాయి. వారిలో కొందరు గోపికలు యశోదాదేవితో ఇలా అన్నారు.

No comments: