Wednesday, February 8, 2017

వామన వైభవం - 110:

8-652-సీ.
ఇతనికి మున్ను నీ వింద్రపదం బిచ్చి;
నేఁడు త్రిప్పుటయును నెఱయమేలు
మోహనా హంకృతి మూలంబు గర్వాంధ;
తమస వికారంబు దాని మాన్పి
కరుణ రక్షించుటఁగాక బంధించుటే? ;
తత్త్వజ్ఞునకు మహేంద్రత్వమేల?
నీ పాదకమలంబు నియతిఁ గొల్చిన దాని;
బోలునే సురరాజ్య భోగపరత?
8-652.1-తే.
గర్వ మేపారఁ గన్నులు గానరావు;
చెవులు వినరావు; చిత్తంబు చిక్కుపడును;
మఱచు నీ సేవలన్నియు మహిమ మాన్పి
మేలు చేసితి నీ మేటి మేర చూపి.

టీకా:
ఇతను = ఇతను; కిన్ = కి; మున్ను = ఇంతకుముందు; నీవు = నీవు; ఇంద్ర = ఇంద్రుని; పదంబు = పదవిని; ఇచ్చి = ఇచ్చి; నేడు = ఇవాళ; త్రిప్పుటయును = తొలగించుట; నెఱయ = చాలా; మేలు = మంచిది; మోహన = అజ్ఞానమునకు; అహంకృతి = అహంకారమునకు; మూలంబు = కారణమైనది; గర్వ = గర్వము యనెడి; అంధతమస = కారుచీకటి; వికారంబు = కలిగించెడిది; దానిన్ = అట్టిదానిని; మాన్పి = పోగొట్టి; కరుణన్ = దయతో; రక్షించుట = కాపాడుట; కాక = తప్పించి; బంధించుటే = శిక్షించుటా కాదు; తత్త్వజ్ఞున్ = బ్రహ్మజ్ఞానికి; మహేంద్రత్వము = ఇంద్రపదవి; ఏల = ఎందుకు; నీ = నీ యొక్క; పాద = పాదములు యనెడి; కమలంబున్ = పద్మములను; నియతిన్ = నిష్ఠగా; కొల్చినన్ = సేవించినచో; దానిన్ = దానికి; పోలునే = సాటివచ్చునా రాదు; సురరాజ్య = ఇంద్రత్వమును; భోగపరత = అనుభవించుట. గర్వమున్ = గర్వము; ఏపారన్ = పెరుగుటవలన; కన్నులు = కళ్ళు; కానరావు = కనిపించవు; చెవులు = చెవులు; వినరావు = వినపించవు; చిత్తంబు = మనసు; చిక్కుపడును = సంకటపడును; మఱచున్ = మరచిపోవును; నీ = నిన్ను; సేవలు = సేవించుటలు; అన్నియున్ = అన్నిటిని; మహిమన్ = నీ మహిమతో; మాన్పి = పోగొట్టి; మేలు = మంచిపని; చేసితి = చేసితివి; నీ = నీ యొక్క; మేటి = అధిక్యము యొక్క; మేర = ఎల్ల; చూపి = చూపించి.

భావము:
“స్వామీ నీవు వీనికి మొదట ఇంద్రపదవి ఇచ్చావు. మరల దానిని ఈనాడు తొలగించడంతో చాలా మేలు అయింది. ఆ పదవి అజ్ఞానానికి అహంకారానికీ మూలకారణం అయి ఉన్నది; గర్వం అనే కారుచీకటిని కలిగించేది; అట్టి దానిని దయతో పోగొట్టుట రక్షించడమే; అంతేకాని ఈ బంధనం శిక్షించడం కాదు; పరమాత్ముని తెలుసుకున్నవానికి ఇంద్రపదవి ఎందుకూ కొరగానిది; అది నీపాద సేవకు సాటిరాదు; ఇంద్రపదవిలో గర్వం పెరిగి కన్నులు కనిపించవు; చెవులు వినిపించవు; మనస్సుకు మైకం కమ్ముతుంది; నిన్ను మరచిపోతాడు. అటువంటి పదవిని విడిపించి వీనికి గొప్ప ఉపకారమే చేసావు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=82&Padyam=652

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: