Friday, December 30, 2016

వామన వైభవం - 70:

8-585-ఆ.
వారిజాక్షులందు వైవాహికము లందుఁ
బ్రాణవిత్తమానభంగమందుఁ
జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు
బొంకవచ్చు నఘము పొందఁ దధిప!
8-586-మ.
కులమున్ రాజ్యముఁ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుం
డలతిం బోఁడు; త్రివిక్రమస్ఫురణ వాఁడై నిండు బ్రహ్మాండముం;
గలఁడే మాన్ప నొకండు? నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్;
వలదీ దానము గీనముం బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా! "



టీకా:
వారిజాక్షుల = ఆడవారివిషయము {వారిజాక్షులు - వారిజ (పద్మముల)వంటి అక్షులు (కన్నులు కలవారు), స్త్రీలు}; అందున్ = లోను; వైవాహికములు = పెండ్లికిసంబంధించినవాని; అందున్ = లోను; ప్రాణ = ప్రాణములు; విత్త = ధనములు; మాన = గౌరవము; భంగము = పోయెడిసందర్భముల; అందున్ = లోను; చకిత = భీతిల్లిన; గో = గోవుల; కుల = సమూహములను; అగ్రజన్మ = బ్రాహ్మణులను; రక్షణము = కాపాడుట; అందున్ = లోను; బొంకవచ్చు = అబద్దమాడవచ్చును; అఘము = పాపము; పొందదు = అంటదు; అధిప = రాజా.
కులమునున్ = వంశమును; రాజ్యమున్ = రాజ్యమును; తేజమున్ = తేజస్సును; నిలుపుము = నిలబెట్టుము; ఈ = ఈ; కుబ్జుండు = వామనుడు; విశ్వంభరుండు = విష్ణుమూర్తి {విశ్వంభరుడు - జగత్తును భరించువాడు, హరి}; అలతిన్ = అంతతేలికగా; పోడు = వదలిపెట్టడు; త్రివిక్రమ = ముల్లోకములను ఆక్రమించెడి; స్పురణన్ = స్పూర్తికల; వాడు = వాడు; ఐ = అయ్యి; నిండున్ = నిండిపోవును; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును; కలడే = సమర్థుడు ఉన్నాడా; మాన్పన్ = ఆపుటకు; ఒకండు = ఒకడైన; నా = నా యొక్క; పలుకులున్ = మాటలను; ఆకర్ణింపుము = వినుము; కర్ణంబులన్ = చెవులారా; వలదు = వద్దు; ఈ = ఈ; దానమున్ = దానము; గీనమున్ = గీనము; పనుపుమా = పంపివేయుము; వర్ణిన్ = బ్రహ్మచారిని; వదాన్య = దాతలలో; ఉత్తమా = శ్రేష్ఠుడా.

భావము:
ఓ బలిచక్రవర్తి! ఆడువారి విషయంలో కాని; పెళ్ళిళ్ల సందర్భంలో కాని; ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగేటప్పుడు కాని; భీతిల్లిన గోవులను, విప్రులను కాపాడే టప్పుడు కాని అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు. దాని వల్ల ఏ పాపం రాదు. దాతలలోకెల్లా అగ్రేశ్వరుడా! బలీ! ఈ పొట్టివాడు సాక్షాత్తు విశ్వభర్త, విష్ణువు. అంత తేలికగా ఇతను ఇక్కడ నుండి వెళ్ళడు. మూడు లోకాలనూ, మూడు అడుగులుగా కొలిచే త్రివిక్రమ రూపం ధరించి, బ్రహ్మాండం అంతా నిండిపోతాడు. అప్పుడు అతనిని ఎవ్వరూ ఆపలేరు తెలుసా. దానం వద్దు, గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని పంపిచెయ్యి. నీ కులాన్నీ, రాజ్యాన్నీ, పరాక్రమాన్నీ నిలబెట్టుకో"
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=76&Padyam=586

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం :

No comments: