Wednesday, December 28, 2016

వామన వైభవం - 68:


8-581-వ.
అదియునుం గాక యీ యర్థంబునందు బహుభంగి బహ్వృచ గీతా ర్థంబుఁ గల దొక్కటి; సావధానుండవై యాకర్ణింపుము.
8-582-సీ.
అంగీకరించిన నఖిలంబుఁ బోవుచో;
ననృతంబుఁగాదు లే దనిన నధిప!
యాత్మ వృక్షము మూల మనృతంబు నిశ్చయ;
మనృత మూలముఁ గల్గ నాత్మ చెడదు;
పుష్పఫలము లాత్మ భూజంబునకు సత్య;
మామ్రాను బ్రతుకమి నదియుఁ జెడును;
ఫలపుష్పములు లేక పస చెడి వృక్షంబు;
మూలంబుతో వృద్ధిఁ బొందుఁ గాదె?
8-582.1-తే.
చేటుఁ గొఱతయు లఘిమయుఁ జెందకుండ
నిచ్చు పురుషుండు చెడకుండు నిద్ధచరిత!
కాక యంచిత సత్య సంగతి నటంచు
నిజధనం బర్థి కిచ్చిన నీకు లేదు.

టీకా:
అదియునున్ = అంతే; కాక = కాకుండగ; ఈ = ఈ; అర్థంబు = విషయము; అందున్ = లో; బహు = అనేక; భంగిన్ = విధములుగ; బహ్వృచ = ఋగ్వేద; గీతార్థంబు = సూక్తి; కలదు = ఉన్నది; ఒకటి = ఒకటి; సావధానుండవు = శ్రద్ధ గలవాడవు; ఐ = అయ్యి; ఆకర్ణింపుము = వినుము. అంగీకరించినన్ = ఒప్పుకొనినచో; అఖిలంబున్ = సమస్తము; పోవుచోన్ = పోవునప్పుడు; అనృతంబు = అబద్దము; కాదు = కాదు; లేదు = లేదు; అనినన్ = అన్నప్పటికిని; అధిప = రాజా; ఆత్మ = దేహము యనెడి; వృక్షమున్ = చెట్టునకు; మూలము = మూలము, వేళ్ళు; అనృతంబు = అబద్దము; నిశ్చయము = తథ్యముగా; అనృత = అబద్దము; మూలమునన్ = కాండము; కల్గన్ = బాగున్నచో; ఆత్మ = దేహము; చెడదు = పాడైపోదు; పుష్ప = పూలు; ఫలముల్ = పండ్లు; ఆత్మన్ = దేహము యనెడి; భూజంబున్ = చెట్టున; కున్ = కు; సత్యము = సత్యము; ఆ = ఆ; మ్రాను = కాండము; బ్రతుకమి = జీవములేకపోయినచో; అదియున్ = అదికూడ; చెడును = నశించును; ఫల = పండ్లు; పుష్పములున్ = పూలు; లేక = లేకుండ; పస = అందము; చెడి = పాడైపోయినను; వృక్షంబు = చెట్టు; మూలంబు = కాండము, మొదలు; తోన్ = ద్వారా; వృద్దిన్ = అభివృద్దిని; పొందున్ = పొందును; కాదె = కదా.  చేటు = నాశనము; కొఱత = లోటు; లఘిమ = తక్కువగుట; చెందకుండ = పొందకుండగ; ఇచ్చు = దానముచేసెడి; పురుషుండు = మానవుడు; చెడక = నాశనముకాకుండ; ఉండున్ = ఉండును; ఇద్దచరిత = ప్రసిద్దమైన నడవడిక కలవాడా; కాక = అలాకాకండ; అంచిత = అచ్చమైన; సత్య = సత్యము; సంగతిన్ = కోసము; అటంచున్ = అనుచు; నిజ = తన; ధనంబున్ = సంపదలను; అర్థి = అడిగినవాని; కిన్ = కి; ఇచ్చిన = ఇచ్చివేసినచో; నీకు = నీకు; లేదు = ఏమీఉండదు.

భావము:
అంతేకాకుండా, ఈ విషయంలో పెక్కువిధాలుగా ప్రసిద్ధమైన ఒక ఋగ్వేదసూక్తి ఉన్నది. దాన్ని చెబుతాను శ్రద్ధగా విను. రాజా! సచ్చరిత్రా! దేనిని ఇవ్వడం వలన సమస్తమూ నష్టము అవుతుందో ఆ దానము ఇవ్వరాదు. ఇస్తానని మాట ఇచ్చినాసరే. దానివల్ల అసత్య దోషం అంటదు. ఆత్మ అనే చెట్టుకు అసత్యమే మూలం కదా. అటువంటి ఆత్మ వృక్షానికి సత్యం పూలు పండ్లుగా ఉంటుంది. అసత్యం అనే మూలం బాగుంటే ఆత్మ అనే వృక్షం చెడదు. మొదలు చెడితే చెట్టు పూలూ పండ్లు చెడతాయి. పండ్లు పూలు లేకపోయినా మొదలు బాగా ఉంటే వృక్షం వృద్ధి చెందుతుంది. కాబట్టి మొదటికి చేటు వాటిల్లకుండా; లోటు రాకుండా; పదుగురలో పలుచన కాకుండా దానం చేసే దాత చెడిపోడు. అందుచేత, సత్యంకోసం నీవు ఇతనికి దానమిస్తే నీకు మిగిలేది ఏమీ ఉండదు

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=76&Padyam=582

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: