Thursday, December 22, 2016

వామన వైభవం - 62:

8-573-వ.
అదియునుంగాక.
8-574-క.
వ్యాప్తిం బొందక వగవక
ప్రాప్తంబగు లేశమైనఁ బదివే లనుచుం
దృప్తిం జెందని మనుజుఁడు
సప్తద్వీపముల నయినఁ జక్కంబడునే?



టీకా:
అదియునున్ = అంతే; కాక = కాకుండగ. వ్యాప్తిన్ = ఉబ్బిపోవుట; పొందక = పొందకుండగ; వగవక = విచారించకుండ; ప్రాప్తంబు = దొరికినది; అగు = అయిన; లేశము = కొంచము; ఐనన్ = అయినప్పటికిని; పదివేలు = అధికమైనది; అనుచున్ = అనుకొని; తృప్తిన్ = తృప్తి; చెందని = పడని; మనుజుడు = మానవుడు; సప్తద్వీపములన్ = సప్తద్వీపములసంపదతో {సప్తద్వీపములు - 1జంబూ 2ప్లక్ష 3శాల్మల 4కుశ 5క్రౌంచ 6శాక 7పుష్కర యనెడి 7 ద్వీపములు}; అయినన్ = అయినప్పటికిని; చక్కంబడునే = సరిగా అగునా కాడు.

భావము:
అంతేకాకుండా.... లభించినది ఎంత కొంచం అయినాసరే ఉబ్బితబ్బిబ్బు పడకుండా, అదే పదివేలుగా భావించి తృప్తి పొందాలి. అలా తృప్తిపడనివారికి సప్తద్వీపాల సంపదలు వచ్చిపడినా కూడా తృప్తి తీరదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=75&Padyam=574

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: