Wednesday, December 14, 2016

వామన వైభవం - 54:

8-557-మ.
ఎదురై పోర జయింప రా దితనిఁ; గా కెందేనియుం బోవ భీ
ప్రదుఁడై ప్రాణులఁ దోలు మృత్యువు క్రియం బైవచ్చు నంచుం గ్రియా
విదుఁ డబ్జాక్షుఁడు సూక్ష్మరూపమున నావేశించె నిశ్శ్వాస రం
ధ్ర దిశన్ దైత్యు హృదంతరాళమునఁ బ్రత్యక్షక్రియాభీరుఁడై.
8-558-వ.
అంత నద్దైత్యవల్లభుండు వైష్ణవాలయంబు జొచ్చి వెదకి హరిం గానక కోపంబు మానక మిన్ను మన్ను నన్వేషించి త్రిదివంబు నరసి, దిశలం బరికించి, భూ వివరంబులు వీక్షించి, సముద్రంబులు వెదకి, పురంబులు శోధించి, వనంబులు విమర్శించి, పాతాళంబు పరీక్షించి, జగంబున నదృష్టశత్రుండై మార్గణంబు చాలించి, తనలో నిట్లనియె.



టీకా:
ఎదురై = ఎదిరించి; పోర = యుద్ధము చేయుటకు; జయింపన్ = జయించుటకు; రాదు = వీలుకాదు; ఇతనిన్ = ఇతనిని; కాక = అలాకాకుండగ; ఎందేనియున్ = ఎక్కడకైనను; పోవన్ = పోయినచో; భీప్రదుడు = భయముకలిగించెడివాడు; ఐ = అయ్యి; ప్రాణులన్ = జీవులను; తోలున్ = తరుమును; మృత్యువు = మరణము; క్రియన్ = వలె; పైవచ్చు = మీదికివచ్చును; అంచున్ = అనుచు; క్రియా = ఉపాయము; విదుడు = తెలిసినవాడు; అబ్జాక్షుడు = నారాయణుడు; సూక్ష్మ = చాలాచిన్న; రూపమునన్ = రూపముతో; ఆవేశించె = ప్రవేశించెను; నిశ్వాసరంధ్ర = ముక్కు; దిశన్ = ద్వారా; దైత్యు = రాక్షసుని; హృదయ = హృదయము; అంతరాళమునన్ = లోనికి; ప్రత్యక్షక్రియా = ఎదుర్కొనుటకు; భీరుడు = బెదరినవాడు; ఐ = అయ్యి. అంతన్ = అంతట; ఆ = ఆ; దైత్య = రాక్షస; వల్లభుండు = రాజు; వైష్ణవాలయంబున్ = వైకుంఠమును {వైష్ణవాలయము -విష్ణువు యొక్క నివాసము, వైకుంఠము}; చొచ్చి = ప్రవేశించి; వెదకి = అన్వేషించి; హరిన్ = విష్ణుని; కానక = కనుగొనలేక; కోపంబు = కోపము; మానక = వదలకుండ; మిన్ను = ఆకాశము; మన్ను = నేల; అన్వేషించి = వెతికి; త్రిదివంబున్ = స్వర్గమును {త్రిదివము - భూర్భువస్సువః త్రిలోకములలోని మూడవది, స్వర్గము}; అరసి = గాలించి; దిశలన్ = దిక్కులను; పరికించి = పరిశీలించిచూసి; భూవివరంబులున్ = బొరియ గుహాదులందు; వీక్షించి = చూసి; సముద్రంబులు = సముద్రములలో; వెదకి = అన్వేషించి; పురంబులు = పట్టణములు; శోధించి = వెతికి; వనంబులున్ = అడవులను; విమర్శించి = గాలించి; పాతాళంబున్ = పాతాళమును; పరీక్షించి = వెతికి; జగంబునన్ = జగత్తునందు; అదృష్ట = కనబడని; శత్రుండు = శత్రువు కలవాడు; ఐ = అయ్యి; మార్గణంబు = వెతకుట; చాలించి = ఆపివేసి; తన = తన; లోనన్ = మనసులో; ఇట్లు = ఇలా; అనియె = అనుకొనెను.

భావము:
ఈ హిరణ్యకశిపుడిని యుద్ధంలో ఎదిరించి జయించడానికి వీలుకాదు. అలాకాకుండా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే ఇక లోకంలోని ప్రాణులపైకి మృత్యువు మాదిరిగా దండెత్తి భయపెట్టి పారద్రోలుతాడు అనుకొని విష్ణువు ఉపాయాన్ని ఆలోచించాడు. సూక్ష్మరూపంతో ముక్కురంధ్రం గుండా హిరణ్యకశిపుని గుండెలో ప్రవేశించాడు. ఆ తరువాత ఆ రాక్షసేంద్రుడు హిరణ్యకశిపుడి వైకుంఠం ప్రవేశించి, విష్ణువు కోసం వెదకాడు. కానీ పగవాడు కనిపించ లేదు. కోపంతో ఆ రాక్షసుడు విష్ణువు కోసం ఆకాశాన్ని, భూలోకాన్ని, స్వర్గలోకాన్ని గాలించాడు. సకల దిక్కులనూ, భూగర్భాలనూ, సముద్రాలనూ, పట్టణాలనూ, అడవులనూ అంతటా వెదకాడు. లోకంలో విష్ణువుజాడ ఎక్కడా చిక్కలేదు. కడకు వెతుకుట ఆపి ఇలా అనుకున్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=74&Padyam=557

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: