Sunday, December 4, 2016

వామన వైభవం - 44:

8-539-క.
కొందఱతోఁజర్చించును
గొందఱతో జటలు చెప్పు గోష్ఠిం జేయుం
గొందఱతోఁ దర్కించును
గొందఱతో ముచ్చటాడుఁ; గొందఱ నవ్వున్.
8-540-వ.
మఱియు ననేక విధంబుల నందఱకు నన్ని రూపులై వినోదించుచు.



టీకా:
కొందఱ = కొంతమంది; తోన్ = తోటి; చర్చించును = చర్చలుచేయును; జటలు = వేదపాఠములను {జట - వేదము చెప్పుటలో విశేషము - జట, ఘన}; చెప్పున్ = చదువును; గోష్ఠిన్ = సల్లాపములు; చేయున్ = ఆడును; కొందఱ = కొంతమంది; తోన్ = తోటి; తర్కించును = వాదించును; కొందఱ = కొంతమంది; తోన్ = తోటి; ముచ్చటలాడును = ముచ్చటించును; కొందఱన్ = కొందరితో; నవ్వున్ = నవ్వుతుండును. మఱియున్ = అంతేకాక; అనేక = పలు; విధంబులన్ = విధములుగా; అందఱ = అందరి; కున్ = కి; అన్ని = అన్ని; రూపులు = రకములుగా; ఐ = కనబడుచు; వినోదించెను = క్రీడించెను.

భావము:
ఆ సభలో వామనుడు కొందరితో వాదోపవాదాలు చేసాడు. కొందరితో కలిసి వేదాన్ని చదివాడు. కొందరితో చక్కగా సల్లాపాలు సాగించాడు. కొందరితో వాదించాడు. కొందరితో చక్కగా మాట్లాడాడు. అంతేకాకుండా అందరితోనూ అనేకవిధాలుగా వ్యవహరిస్తూ విహరించసాగాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=72&Padyam=539

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : : 

No comments: