Wednesday, November 23, 2016

వామన వైభవం - 33:

8-518-క.
బిక్షాపాత్రిక నిచ్చెను
యక్షేశుఁడు వామనునకు; నక్షయ మనుచున్
సాక్షాత్కరించి పెట్టెను
బిక్షునకు భవాని పూర్ణబిక్ష నరేంద్రా!
8-519-క.
శుద్ధబ్రహ్మర్షి సమా
రాద్ధుండై విహితమంత్రరాజిఁ జదువుచుం
బ్రోద్ధంబగు ననలంబున
వృద్ధాచారమున వటుఁడు వేల్చెన్ గడకన్!

టీకా:
బిక్షాపాత్రికన్ = చిన్నబిక్షాపాత్రను; ఇచ్చెను = ఇచ్చెను; యక్షేశుడు = కుబేరుడు; వామనున్ = వామనుని; కున్ = కి; అక్షయము = అక్షయము; అనుచున్ = అనుచు; సాక్షాత్కరించి = ప్రత్యక్షమై; పెట్టెను = పెట్టెను; బిక్షున్ = బ్రహ్మచారి; కున్ = కి; భవాని = అన్నపూర్ణాదేవి; పూర్ణ = పూర్తి; బిక్షన్ = బిక్షను; నరేంద్రా = రాజా.
శుద్ధ = పరిశుద్ధమైన; బ్రహ్మర్షి = మునీశ్వరులుచే; సమారాద్ధుండు = చక్కగాసిద్ధముచేయబడినవాడు; ఐ = అయ్యి; విహిత = శాస్త్రానుసారము; మంత్రరాజిన్ = వేదమంత్రములను; చదువుచున్ = చదువుతూ; ప్రోద్ధంబు = వెలుగుతున్నది; అగు = అయిన; అనలంబునన్ = అగ్నియందు; వృద్ధాచారమునన్ = సంప్రదాయబద్దముగా; వటుడు = బ్రహ్మచారి; వ్రేల్చెను = హోమముచేసెను; కడకన్ = నిష్ఠతో.

భావము:
పరీక్షన్మహారాజా! యక్షుల ప్రభువు అయిన కుబేరుడు వామనుడికి బిక్షాపాత్ర ఇచ్చాడు. జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై అక్షయం అంటూ ఆ బ్రహ్మచారికి నిండైన భిక్ష పెట్టింది.
ఆ పరిశుద్ధులైన బ్రహ్మఋషులు వామనుని ఆదరంగా ఆశీర్వదించారు. తరువాత, ఆ బ్రహ్మచారి సంప్రదాయం ప్రకారం వేదమంత్రాలు చదువుతూ, వెలిగే అగ్నిహోత్రంలో ఉత్సాహంతో హోమం చేశాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=69&Padyam=518

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: