Sunday, November 13, 2016

వామన వైభవం - 23:

8-499-క.
పెట్టుదురు నుదుట భూతిని
బొట్టిడుదురు మేఁన బట్టుఁ బుట్టపుదోయిం
బెట్టుదురు వేల్పు లమ్మకుఁ
గట్టుదురు సురక్ష పడఁతిగర్భంబునకున్.
8-500-వ.
ఇవ్విధంబున
8-501-తే.
విశ్వగర్భుఁడు దన గర్భ వివరమందు
బూటపూటకుఁ బూర్ణుఁడై పొటకరింప
వ్రేఁక జూలాలితనమున వేల్పుఁ బెద్ద
పొలఁతి కంతట నీళ్ళాడు ప్రొద్దులయ్యె

టీకా:
పెట్టుదురు = పెట్టెదరు; నుదుటన్ = నుదుటిమీద; భూతిని = విభూతిని; బొట్టిడుదురు = బొట్టుగాపెట్టెదరు; మేనన్ = ఒంటిమీదకి; పట్టు = పట్టు; పుట్టపు = బట్టల; దోయిన్ = జత (2)ని; పెట్టుదురు = పెట్టెదరు; వేల్పులమ్మ = అదితి; కున్ = కి; కట్టుదురు = కట్టెదరు; సురక్ష = రక్షాతోరమును; పడతి = సతియొక్క; గర్భంబున్ = గర్భమున; కున్ = కు. ఈ = ఈ; విధంబునన్ = విధముగ.
విశ్వగర్భుడు = నారాయణుడు {విశ్వగర్భుడు - విశ్వము గర్భమున కలవాడు, విష్ణువు}; తన = తన యొక్క; గర్భవివరము = గర్భాశయము; అందున్ = లో; పూటపూట = రోజురోజు; కున్ = కి; పూర్ణుడు = నిండుతున్నవాడు; ఐ = అయ్యి; పొటకరింపన్ = వర్థిల్లుచుండగా; వ్రేకన్ = భారమైన; చూలాలితనమునన్ = నిండుచూలాలిగ; వేల్పుపెద్దపొలతి = అదితి; కిన్ = కి; అంతట = అప్పుడు; నీళ్ళాడు = ప్రసవించెడి, పురిటి; ప్రొద్దులు = సమయము; అయ్యె = అయినది.

భావము:
పెద్దముత్తైదువలు దేవతలకు తల్లి అయిన అదితికి నుదుట విభూతి పెట్టారు. తిలకం దిద్దారు పట్టుబట్టలు కట్టారు. ఆమె గర్భానికి రక్ష కట్టారు. ఈ విధంగా హరి గర్భస్తుడు అయి.... 
             అదితి గర్భంలో విశ్వగర్భుడైన భగవంతుడు పూర్ణుడు అవుతూ పూటపూటకూ పెరిగసాగాడు. గర్భం బరువెక్కసాగింది. దేవతల కన్నతల్లి అదితి నీళ్ళాడే సమయం ఆసన్నమయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=67&Padyam=499

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :



No comments: