Friday, November 11, 2016

వామన వైభవం - 21:

8-495-క.
మహితతర మేఘమాలా
పిహితాయుత చండభాను బింబప్రభతో
విహితాంగంబులఁ గశ్యపు
గృహిణీగర్భమున శిశువుఁ గ్రీడించె నృపా!
8-496-క.
తన కడుపున నొక యిరువునఁ
వనరుహగర్భాండభాండ వనధిచయంబుల్
గొనకొని జగములు నిడుకొని
తనుగతిఁ గడు నడఁగి మడిఁగి తనరెన్ బెడఁగై.

టీకా:
మహితతర = మిక్కిలిగొప్పదైన; మేఘ = మబ్బుల; మాలా = గుంపులచే; పిహిత = కప్పివేయబడిన; అయుత = పదివేల; చండభాను = సూర్య; బింబ = బింబముల; ప్రభ = ప్రకాశము; తోన్ = తో; విహిత = చక్కటి; అంగంబులన్ = అవయవములతో; కశ్యపు = కశ్యపుని; గృహిణీ = ఇల్లాలు యొక్క; గర్భమునన్ = కడుపులో; శిశువు = శిశువు; క్రీడించెన్ = కదలాడసాగెను; నృపా = రాజా {నృపుడు - నరులను పాలించువాడు, రాజు}.
           తన = తన యొక్క; కడుపునన్ = గర్భమునందు; ఒక = ఒక; ఇరువున = పక్కన; వనరుహగర్భాండభాండ = బ్రహ్మాండముల {వనరుహగర్భాండభాండము - వనరుహగర్భ (బ్రహ్మ) అండముల భాండములు (గుంపులు), బ్రహ్మాండ భాండములు}; వనధి = సముద్రముల {వనధి - వనము (నీటి)కి నిధి, సముద్రము}; చయంబుల్ = సమూహములు; కొనకొని = కూడుకొనిన; జగములున్ = భువనములను; ఇడుకొని = ఉంచుకొని; తను = సన్ననిఅర్భకుని; గతిన్ = వలె; అడగి = అణిగి; మడిగి = మణిగి; తనరెన్ = చక్కగనుండెను; బెడగు = అందగించినవాడు; ఐ = అయ్యి.

భావము:
పరీక్షిన్మహారాజా! అదితి గర్భంలో అవయవాలతోకూడిన ఆ అద్భుత శిశువు గొప్ప మేఘాలు కప్పిన సూర్యబింబాల వెలుగుతో కదలాడసాగాడు.
అదితి గర్భంలోని చిన్నారి శిశువు భూగోళాలనూ ఖగోళాలను సముద్రాలను సమస్తలోకాలనూ తన కడుపులో ఇమిడించికొని సన్ననైన చిన్ని రూపంతో అందంగా అణగిమణిగి ఉన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=67&Padyam=495

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: