Tuesday, October 4, 2016

క్షీరసాగరమథనం – సిద్ధించెన్ సురలార

8-381-వ.
వచ్చి సురలకు నారదుం డిట్లనియె.
8-382-శా.
సిద్ధించెన్ సురలార! మీ కమృతమున్శ్రీనాథ సంప్రాప్తులై
వృద్ధిం బొందితి రెల్ల వారలును; విద్వేషుల్ మృతిం బొంది; రీ
యుద్ధం బేటికి ? నింకఁ జాలుఁ; బనిలే దోహో పురే" యంచు సం
ద్ధాలాపము లాడి మాన్చె సురలం బాండవ్యవంశాగ్రణీ!

టీకా:
            వచ్చి = వచ్చి; సురల్ = దేవతల; కున్ = కు; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
            సిద్దించెన్ = సమకూరినది; సురలార = దేవతలు; మీ = మీ; కున్ = కు; అమృతమున్ = అమృతము; శ్రీనాథ = నారయణుని; సంప్రాప్తులు = ఆశ్రయముదొరికినవారు; ఐ = అయ్యి; వృద్ధిన్ = అభివృద్ధిని; పొందితిరి = పొందిరి; ఎల్లవారలను = మీరు అందరు; విద్వేషుల్ = శత్రువులు; మృతిన్ = మరణమును; పొందిరి = పొందిరి; ఈ = ఈ; యుద్ధంబున్ = పోరు; ఏటికిన్ = ఎందులకు; ఇంకన్ = ఇంక; చాలును = చాలించండి; పని = అవసరము; లేదు = లేదు; ఓహో = భళీ; పురే = బాగు; అంచున్ = అనుచు; సంబద్ద = తగిన; ఆలాపములు = మాటలు; ఆడి = పలికి; మాన్చెన్ = మానిపించెను; సురలన్ = దేవతలను; పాండవ్యవంశాగ్రణీ = పరీక్షిన్నరేంద్రుడ.

భావము:
          ఆ దేవదానవ సంగ్రామాన్ని ఆపడానికి వచ్చిన నారదుడు దేవతలతో ఇలా అన్నాడు.
          ఓ పాండవ వంశంలో ఉత్తముడవయిన పరీక్షిన్మహారాజా! ఓ దేవతలాగా! మీకు అమృతం లభించింది కదా. మీరు అందరూ చక్కగా శ్రీమహావిష్ణువును ఆశ్రయించి బాగుపడ్డారు. మీ శత్రువులు నశించిపోయారు. బాగు బాగు. ఇంక యుద్ధంతో పని లేదు, ఆపేయండి అంటూ నచ్చజెప్పి నారదుడు యుద్ధం ఆపించాడు.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: