Saturday, August 27, 2016

క్షీరసాగరమథనం – ఇట్లు సుధాకలశంబు

8-312-వ.
ఇట్లు సుధాకలశంబు కేల నందికొని మందస్మిత భాషణంబుల సుందరీ రూపుఁ డగు ముకుందుండు "మేలుఁ గీ డనక నేనుఁ బంచియిచ్చిన తెఱంగున నంగీకరించుట కర్తవ్యం" బనవుడు "నగుంగాక" యని సురాసుర దైత్యదానవ సమూహం బుపవసించి కృతస్నానులై హోమంబు లాచరించి విప్రులకు గోభూహిరణ్యాది దానంబులు చేసి తదాశీః ప్రవచనంబులు గైకొని ధవళపరిధాను లై గంధమాల్య ధూపదీపాలంకృతం బగు కనకరత్నశాలా మధ్యంబునఁ బ్రాగగ్రకుశ పీఠంబులం బూర్వదిశాభిముఖులై పంక్తులుఁ గొని యున్న సమయంబున.

టీకా:
            ఇట్లు = ఈ విధముగా; సుధా = అమృతపు; కలశంబున్ = పాత్రను; కేలన్ = చేతితో; అందికొని = తీసుకొని; మందస్మిత = చిరునవ్వులతో కూడిన; భాషణంబులన్ = మాటలతో; సుందరీ = అందెగత్తె యొక్క; రూపుడు = రూపముననున్నవాడు; అగు = అయిన; ముకుందుండు = విష్ణుమూర్తి; మేలు = మంచి; కీడు = చెడు; అనక = అనకుండ; నేను = నేను; పంచి = పంపంకము; ఇచ్చిన = పెట్టిన; తెఱంగునన్ = విధముగా; అంగీకరించుట = ఒప్పుకొనుట; కర్తవ్యంబున్ = చేయవలెను; అనవుడు = అనగా; అగుంగాక = సరే, అలాగే; అని = అని; సుర = దేవతలు; అసుర = రాక్షసులు; దైత్య = దైత్యులు; దానవ = దానవుల; సమూహంబున్ = గుంపులుగా; ఉపవసించి = ఉపవాసముండి; కృత = చేసిన; స్నానులు = స్నానములుగలవారు; ఐ = అయ్యి; హోమంబుల్ = అగ్నిహోత్రములను; ఆచరించి = చేసి; విప్రుల్ = బ్రాహ్మణుల; కున్ = కు; గో = గోవులు; హిరణ్య = బంగారము; ఆది = మున్నగునవి; దానంబులున్ = దానములు; చేసి = చేసి; తత్ = వారి యొక్క; ఆశీఃప్రవచనంబులు = ఆశీర్వాదములు; కైకొని = స్వీకరించి; ధవళ = తెల్లని; పరిధానులు = వస్త్రములుకట్టినవారు; ఐ = అయ్యి; గంధ = మంచిగంధము; మాల్య = మాలలు; ధూప = ధూపములు; దీప = దీపాలతోను; అలంకృతంబు = అలంకరింపబడినది; అగు = అయిన; కనక = బంగార; రత్న = రత్నములు పొదిగిన; శాల = మండపము; మధ్యంబునన్ = మధ్యమందు; ప్రాగగ్ర = తూర్పుకికొసలుంచిన; కుశ = దర్భల; పీఠంబులన్ = పీటలపైన; పూర్వ = తూర్పు; దిశా = దిక్కువైపునకు; అభిముఖులు = తిరిగినవారు; ఐ = అయ్యి; పంక్తులు = బారులు; కొని = తీరి; ఉన్న = ఉన్నట్టి; సమయంబునన్ = సమయము నందు.

భావము:
            ఆవిధంగా రాక్షసులు అందించిన, అమృతకలశాన్ని, మాయా సుందరి మోహినీ రూపంలో ఉన్న విష్ణుమూర్తి తన చేతులలోకి తీసుకున్నాడు. చిరునవ్వులు చిందే పలుకులతో “నేను పంచిపెట్టిన విధంగా ‘ఔను’ ‘కాదు’ అనకుండా ఒప్పుకోవాలి” అన్నాడు. ఆ షరతులకు అంగీకరించిన రాక్షసులూ, దేవతలూ “సరే” అన్నారు. వారందరూ ఉపవాసం ఉండి స్నానాలు చేసి హోమాలు ఆచరించారు. బ్రాహ్మణులకు గోదానాలు, భూదానాలూ, హిరణ్యదానాలూ మున్నగు దానాలు ఇచ్చి, వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. తెల్లని బట్టలు కట్టుకున్నారు. చందనం పూతలూ, పూలమాలలూ, ధూపాలూ, దీపాలూ అలంకరించిన బంగారు మండపంలో చేరారు. తూర్పుకు కొసలు ఉండేలా పరచిన దర్భాసనాల మీద తూర్పుముఖంగా వరుసలు కట్టి కూర్చున్నారు.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: