Tuesday, July 12, 2016

క్షీరసాగరమథనం – లంపటము

8-230-క.
లంటము నివారింపను
సందఁ గృపజేయ జయము సంపాదింపం
జంపెడివారి వధింపను
సొంపారఁగ నీక చెల్లు సోమార్ధధరా!
8-231-క.
నీకంటె నొండెఱుంగము
నీకంటెం బరులు గావ నేరరు జగముల్
నీకంటె నొడయఁ డెవ్వఁడు
లోకంబుల కెల్ల నిఖిలలోకస్తుత్యా!
టీకా:
            లంపటము = ఆపదను, తగులమును; నివారింపను = తొలగించుట; సంపదన్ = సంపదలను; కృపజేయ = ప్రసాదించుట; జయము = జమయును; సంపాదింపన్ = సంపాదించుట; చంపెడివారిన్ = క్రూరులను; వధింపను = సంహరించుట; సొంపారగన్ = చక్కగా చేయుట; నీక = నీకుమాత్రమే; చెల్లున్ = తగినది; సోమార్ధధరా = శంకరుడా {సోమార్ధధరుడు - సోమ (చంద్ర) అర్ధ (ఖండమును) ధర (ధరించినవాడు), శివుడు}.
            నీకున్ = నీకు; కంటెన్ = కంటె; ఒండు = మరొకరిని; ఎఱుంగము = తెలియము; నీకున్ = నీకు; కంటెన్ = కంటెను; పరులు = ఇతరులు; కావన్ = కాపాడుటకు; నేరరు = సమర్థులుకారు; జగముల్ = లోకములను; నీకున్ = నీకు; కంటెన్ = కంటె; ఒడయడు = స్వామి; ఎవ్వడు = ఎవరుకలరు; లోకంబుల్ = లోకముల; కున్ = కు; ఎల్లన్ = అన్నిటికి; నిఖిల = సమస్తమైన; లోక = లోకములచేత; స్తుత్యా = కీర్తింపబడువాడా.
భావము:
            అర్థచంద్రుని అలంకారంగా ధరించిన మహా ప్రభూ! పరమేశ్వరా! ఈ ఆపదను తొలగించడానికి, ఆనందం చేకూర్చడానికీ, జయాన్ని సంపాదించడానికి, క్రూరులను హతమార్చడానికి నీవు మాత్రమే సమర్థుడవు.
            సమస్తలోకాల యందూ కీర్తింపబడు స్వామీ! శివా! నీవే మాకు దిక్కు. నిన్ను తప్ప మరెవ్వరినీ ఆశ్రయింపము. నీవు తప్ప మరెవ్వరూ లోకాలను కాపాడలేరు. నిన్ను మించిన గొప్పవాడు మరెవ్వరూ లేరు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: