Tuesday, April 26, 2016

ప్రహ్లాదుడు స్తుతించుట – దేవా మునీంద్రులు


7-366-వ.
దేవా! మునీంద్రులు నిజవిముక్త కాములయి విజనస్థలంబులం దపంబు లాచరింతురు; కాముకత్వంబు నొల్లక యుండువారికి నీ కంటె నొండు శరణంబు లేదు గావున నిన్ను సేవించెదరు; కొందఱు కాముకులు కరద్వయ కండూతిచేతం దనియని చందంబునఁ దుచ్ఛంబయి పశు పక్షి క్రిమి కీట సామాన్యం బయిన మైథునాది గృహ మేది సుఖంబులం దనియక కడపట నతి దుఃఖవంతు లగుదురు; నీ ప్రసాదంబు గల సుగుణుండు నిష్కాముం డయియుండు. మౌనవ్రత జప తప శ్శ్రుతాధ్యయనంబులును నిజధర్మవ్యాఖ్యాన విజనస్థల నివాస సమాధులును మోక్షహేతువులగు; నయిన నివి పదియు నింద్రియజయంబు లేనివారికి భోగార్థంబులయి విక్రయించువారికి జీవనోపాయంబులయి యుండు; డాంభికులకు వార్తాకరంబులై యుండు, సఫలంబులుగావు; భక్తి లేక భవదీయజ్ఞానంబు లేదు; రూపరహితుండ వైన నీకు బీజాంకురంబులకైవడిఁ గారణకార్యంబు లయిన సదసద్రూపంబులు రెండును బ్రకాశమానంబు లగు; నా రెంటి యందును భక్తియోగంబున బుద్ధిమంతులు మథనంబున దారువులందు వహ్నిం గనియెడు తెఱంగున నిన్ను బొడఁగందురు; పంచభూత తన్మాత్రంబులును ప్రాణేంద్రియంబులును మనోబుద్ధ్యహంకార చిత్తంబులును నీవ; సగుణంబును నిర్గుణంబును నీవ; గుణాభిమాను లయిన జననమరణంబుల నొందు విబుధు లాద్యంతంబులు గానక నిరుపాధికుండవైన నిన్నెఱుంగరు; తత్త్వజ్ఞులయిన విద్వాంసులు వేదాధ్యయనాది వ్యాపారంబులు మాని వేదాంతప్రతిపాద్యుండ వగు నిన్ను సమాధివిశేషంబుల నెఱింగి సేవింతు; రదిగావున.
టీకా:
      దేవా = భగవంతుడా; ముని = మునులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; నిజ = సత్యమైన; విముక్త = విడువబడిన; కాములు = కోరికలుగలవారు; అయి = అయ్యి; విజన = నిర్జన; స్థలంబులన్ = ప్రదేశములందు; తపంబున్ = తపస్సును; ఆచరింతురు = చేయుదురు; కాముకత్వంబున్ = కోరికలకులొంగెడిగుణమును; ఒల్లక = అంగీకరింపక; ఉండు = ఉండెడి; వారి = వారి; కిన్ = కి; నీ = నీ; కంటెన్ = కంటెను; ఒండు = ఇతరమైన; శరణంబు = శరణము; లేదు = లేదు; కావునన్ = కనుక; నిన్నున్ = నిన్ను; సేవించెదరు = కొలిచెదరు; కొందఱు = కొంతమంది; కాముకులు = కోరికలుగలవారు; కర = చేతులు; ద్వయ = రెంటిచేతను; కండూతి = దురద; చేతన్ = వలన; తనియని = తృప్తిచెందని; చందంబునన్ = విధముగ; తుచ్ఛంబు = నీచమైనది; అయి = అయ్యి; పశు = పశువులు; పక్షి = పక్షులు; క్రిమి = పురుగులు; కీట = కీటకములకు; సామాన్యంబు = సామాన్యధర్మము; అయిన = ఐన; మైథున = సురతము; ఆదిన్ = మొదలగానిచే; గృహమేధి = గృహస్థులు; సుఖంబులన్ = సుఖములందు; తనియక = తృప్తిచెందక; కడపడటన్ = చివరకు; అతి = మిక్కిలి; దుఃఖవంతులు = దుఃఖముగలవారు; అగుదురు = అగుదురు; నీ = నీ; ప్రసాదంబున్ = అనుగ్రహము; కల = కలిగిన; సుగుణుండు = సజ్జనుడు; నిష్కాముండు = కోరికలులేనివాడు; అయి = అయ్యి; ఉండున్ = ఉండును; మౌన = మౌనముగానుండెడి; వ్రత = దీక్ష; జప = జపము; తపస్ = తపస్సు; శ్రుత = వేదశాస్త్రలను చదువుకొనుట; అధ్యయనంబులును = మననముచేసికొనుట; నిజ = తన; ధర్మ = ధర్మములను; వ్యాఖ్యాన = వివరించుకొనుచు; విజన = నిర్జన; స్థల = ప్రదేశములందు; నివాస = నివసించుట; సమాధులను = యోగసమాధులు; మోక్ష = ముక్తిపద; హేతువులు = సాధనములు; అగున్ = అయినట్టివి; అయిన = అయిన; ఇవి = ఇవి; పదియున్ = పది (10); ఇంద్రియ = ఇంద్రియ; జయంబు = నిగ్రహము; లేని = లేని; వారి = వారి; కిన్ = కి; భోగ = అనుభవైక; అర్థంబులు = ప్రయోజనములు; అయి = అయ్యి; విక్రయించు = అమ్మకొను; వారి = వారి; కిన్ = కి; జీవనోపాయంబులు = జీవనోపాధులు; అయి = అయ్యి; డాంభికుల్ = దంభముబూనువారల; కున్ = కు; వార్తా = వృత్తాంత; కరంబులు = జనకములు; అయి = అయ్యి; ఉండున్ = ఉండును; సఫలంబులు = సార్థకములు {సఫలంబులు - తగిన ప్రయోజనములు గలవి, సార్థకములు}; కావు = కావు; భక్తి = భక్తి; లేక = లేకుండగ; భవదీయ = నీకుసంబంధించిన; జ్ఞానంబు = ఎరుక; లేదు = లేదు; రూప = ఆకారము; రహితుండవు = లేనివాడవు; ఐన = అయిన; నీ = నీ; కున్ = కు; బీజ = విత్తు; అంకురంబుల = మెలకల; కైవడిన్ = వలె; కారణ = కారణము; కార్యంబులు = కార్యములు; అయిన = ఐన; సత్ = శాశ్వతము; అసత్ = భంగురములునైన; రూపంబులు = రూపంబులు; రెండును = రెండును (2); ప్రకాశమానంబులు = తెలియబడుచున్నవి; అగున్ = అగును; ఆ = ఆ; రెంటి = రెంటి; అందునున్ = లోను; భక్తియోగంబునన్ = భక్తియోగముచేత; బుద్ధిమంతులు = జ్ఞానులు; మథనంబునన్ = తరచిచూచుటద్వారా; దారువులు = కట్టెల; అందున్ = లో; వహ్నిన్ = అగ్ని; కనియెడి = తెలిసికొను; తెఱంగునన్ = విధముగ; నిన్నున్ = నిన్ను; పొడగందురు = చూచెదరు; పంచభూత = పృథివ్యాదుల; తన్మాత్రంబులును = లేశములు, పంచతన్మాత్రలు {పంచతన్మాత్రలు - 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రసము 5గంధము}; ప్రాణ = పంచప్రాణములు; ఇంద్రియంబులును = దశేంద్రియములు; మనస్ = మనస్సు; బుద్ధి = బుద్ధి; అహంకార = అహంకారము, మమత్వము; చిత్తంబులును = చిత్తములు; నీవ = నీవే; సగుణంబును = గుణసహితమైనవి; నిర్గుణంబును = గుణరహితమైనవి; నీవ = నీవే; గుణ = గుణములందు; అభిమానులు = తగులముగలవారు; అయిన = ఐనచో; జనన = పుట్టుక; మరణంబులన్ = చావులను; ఒందున్ = పొందును; విబుధులు = విద్వాంసులు; ఆది = పుట్టుక; అంతంబులున్ = చావులను; కానక = తెలియక; నిరుపాధింకుడవు = ఉపాధిరహితుండవు; ఐన = అయిన; నిన్నున్ = నిన్ను; తత్త్వజ్ఞులు = తత్త్వజ్ఞానముగలవారు; అయిన = ఐన; విద్వాంసులు = పండితులు; వేద = వేదములను; అధ్యయన = అధ్యయనముచేయుట; ఆది = మొదలైన; వ్యాపారంబులు = పనులను; మాని = విడిచి; వేదాంత = వేదాంతములచే; ప్రతిపాద్యుండవు = వర్ణింపబడినవాడవు; అగు = అయిన; నిన్నున్ = నిన్ను; సమాధి = యోగసమాధి యొక్క; విశేషంబులన్ = భేదములచేత; ఎఱింగి = తెలిసికొని; సేవింతురు = కొలచెదరు; అదిగావునన్ = అందుచేత.
భావము:
        భగవంతుడా! మునీశ్వరులు కోరికలు వదలి ఏకాంత ప్రదేశాలలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. కామవికారాలు లేనివాళ్లకునీ కంటె కాంక్షించ దగ్గది మరేదీ ఉండదు; అందుకే నేను నిన్ను సేవిస్తాను. దురద వేసిందని రెండు చేతులతోటి గోక్కున్నా దురద తీరదు, తృప్తి పొందలేరు. అలాగే కాముకులు తుచ్ఛమైన పశుపక్ష్యాదులకూ క్రిమికీటకాలకూ సామాన్యమైన మైథునాది గృహస్థ సుఖాలలో మునిగితేలుతూ, ఎప్పటికీ సంతృప్తి చెందలేరు. చివరకు దుఃఖాల పాలవుతారు. నీ దయ పొందిన బుద్ధిమంతుడు నిష్కాముడై దివ్య సుఖం పొందుతాడు. 1) మౌనం, 2) వ్రతం, 3) జపం, 4) తపం, 5) స్మరణం, 6) అధ్యయనం, 7) స్వధర్మం, 8) వ్యాఖ్యానం, 9) ఏకాంతవాసం, 10) ఏకాగ్రత అనే ఈ పది ముముక్షువులకు మోక్షహేతువులు, ఈ పదీ (అ) ఇంద్రియ నిగ్రహం లేనివారికి భోగకారణాలు. (ఇ) విక్రయించే వారికి జీవనోపాయాలు, (ఉ) ఆడంబరులకు కాలక్షేపవిషయాలు. ఇలాంటి వారికి ఈ మోక్షహేతువులు సఫలం కావు. భక్తి భావం మనసులో లేనివారికి నీ తత్వజ్ఞానం అంతుపట్టదురూపంలేని నీ యందు, విత్తనాల నుండి మొలకలు బయలుదేరినట్లు, కార్య కారణాలైన, అసత్తు సత్తు రూపాలు రెండూ తేజరిల్లుతూ ఉంటాయి. బుద్ధిమంతులు భక్తియోగంతో, ఆరణిలో అగ్నిని కనుగొన్నట్లు, ఆ రెంటిలోనూ నిన్ను దర్శిస్తారు. 1) భూమి, 2) జలము, 3) అగ్ని, 4) వాయువు, 5) ఆకాశం అనే పంచభూతాలూ; 1) శబ్దము, 2) స్పర్శము, 3) రూపము, 4) రసము, 5) గంధము అనే పంచతన్మాత్రలూ; 1. ప్రాణము, 2. అపానము, 3. వ్యానము, 4. ఉదానము, 5. సమానము అనే పంచప్రాణాలూ; 1 చెవి, 2 చర్మము, 3 కన్ను, 4 నాలుక, 5 ముక్కు, 6 నోరు, 7 చేయి, 8 కాలు, 9 గుదము,10 రహస్యేంద్రియము అనే దశేంద్రియాలూ; మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అన్నీ నీవే. సగుణం, నిర్గుణం నీవే. సత్త్వ, రజ, స్తమో గూణాభిమానులూ, జననమరణాలు పొందే వారూ అయిన పండితులు, నీ ఆద్యంతాలు తెలుసుకోలేరు. ఉపాధిరహితుడవు అయిన నిన్ని గుర్తించలేరు. తత్వజ్ఞులైన విద్వాంసులు వేదాధ్యాయాది కర్మలు మాని,వేదాంత ప్రతిపాదకుడవైన నిన్ను ఏకాగ్రచిత్తంతో దర్శించి సేవిస్తుంటారు.
 ७-३६६-व.
देवा! मुनींद्रुलु निजविमुक्त कामुलयि विजनस्थलंबुलं दपंबु लाचरिंतुरु; कामुकत्वंबु नोल्लक युंडुवारिकि नी कंटे नोंडु शरणंबु लेदु गावुन निन्नु सेविंचेदरु; कोंदर्रु कामुकुलु करद्वय कंडूतिचतं दनियनि चंदंबुनँ दुच्छंबयि पशु पक्षि क्रिमि कीट सामान्यं बयिन मैथुनादि गृह मेदि सुखंबुलं दनियक कडपट नति दुःखवंतु लगुदुरु; नी प्रसादंबु गल सुगुणुंडु निष्कामुं डयियुंडु. मौनव्रत जप तप श्श्रुताध्ययनंबुलुनु निजधर्मव्याख्यान विजनस्थल निवास समाधुलुनु मोक्षहतुवुलगु; नयिन निवि पदियु निंद्रियजयंबु लेनिवारिकि भोगार्थंबुलयि विक्रयिंचुवारिकि जीवनोपायंबुलयि युंडु; डांभिकुलकु वार्ताकरंबुलै युंडु, सफलंबुलुगावु; भक्ति लेक भवदीयज्ञानंबु लेदु; रूपरहितुंड वैन नीकु बीजांकुरंबुलकैवडिँ गारणकार्यंबु लयिन सदसद्रूपंबुलु रेंडुनु ब्रकाशमानंबु लगु; ना रेंटि यंदुनु भक्तियगंबुन बुद्धिमंतुलु मथनंबुन दारुवुलंदु वह्निं गनियेडु तेर्रंगुन निन्नु बोडँगंदुरु; पंचभूत तन्मात्रंबुलुनु प्राणंद्रियंबुलुनु मनोबुद्ध्यहंकार चित्तंबुलुनु नीव; सगुणंबुनु निर्गुणंबुनु नीव; गुणाभिमानु लयिन जननमरणंबुल नोंदु विबुधु लाद्यंतंबुलु गानक निरुपाधिकुंडवैन निन्नेर्रुंगरु; तत्त्वज्ञुलयिन विद्वांसुलु वदाध्ययनादि व्यापारंबुलु मानि वेदांतप्रतिपाद्युंड वगु निन्नु समाधिविशषंबुल नेर्रिंगि सेविंतु; रदिगावुन.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: