Friday, January 8, 2016

ప్రహ్లాదుని హింసించుట - మంటిమి కూడి

7-220-ఉ.
"మంటిమి కూడి, భార్గవకుమారకు లొద్ద ననేక శాస్త్రముల్
వింటిమి. లేఁడు సద్గురుఁడు వేఱొకఁ డెన్నఁడు, రాజశాల ము
క్కంటికి నైన రాదు చొరఁగావెలికిం జన రాదు, నీకు ని
ష్కంకవృత్తి నెవ్వఁడు ప్రల్భుఁడు చెప్పె? గుణాఢ్య! చెప్పుమా.
టీకా:
          మంటిమి = బ్రతికితిమి; కూడి = కలిసి; భార్గవకుమారకుల = చండామార్కుల {భార్గవకుమారకులు - భార్గవ (శుక్రుని) కుమారకులు (పుత్రులు), చండామార్కులు}; ఒద్దన్ = దగ్గర; అనేక = అనేకమైన; శాస్త్రముల్ = శాస్త్రములను; వింటిమి = తెలుసుకొంటిమి; లేడు = లేడు; సత్ = మంచి; గురుడు = గురువు; వేఱొకడున్ = ఇంకొకడు; ఎన్నడున్ = ఎప్పుడును కూడ; రాజశాల = అంతఃపురము; ముక్కంటి = మూడుకన్నులుగల శివుని; కిన్ = కి; ఐనన్ = అయినను; రాదు = సాధ్యముకాదు; చొరగాన్ = ప్రవేశించుటకు; వెలి = వెలుపలి; కిన్ = కి; చనన్ = వెళ్ళుటకు; రాదు = వీలులేదు; నీ = నీ; కున్ = కును; నిష్కంటక = అడ్డులేని {నిష్కంటకము - కంటకము (ముల్లు)లు లేనిది, అడ్డులేనిదారి}; వృత్తిన్ = విధముగ; ఎవ్వడు = ఎవడు; ప్రగల్భుడు = ప్రతిభగలవాడు, ధీరుడు; చెప్పెన్ = చెప్పెను; గుణాడ్యా = సుగుణములుచే శ్రేష్ఠుడా; చెప్పుమా = చెప్పుము.
భావము:
            సుగుణశీలా! ప్రహ్లాదా! మనం అందరం ఇక్కడే పుట్టి ఇక్కడే కలిసి పెరిగాం. భర్గుని వంశస్థులు శుక్రాచార్యుని కుమారులు చండామార్కులు వద్ద కలిసి అనేక శాస్త్రాలు చదువుకున్నాం. మరొక గొప్ప గురువు ఎవరిని మనం ఎరగం. పైగా నువ్వు రాకుమారుడువు, చండశాసనుడు అయిన మన మహారాజ అనుమతి లేకుండా మన పాఠశాలలోనికి ఫాలాక్షుడు కూడా ప్రవేశించలేడు. మనమూ బయటకు పోలేము. అలాంటప్పుడు ఏ అడ్డూ ఆపూ లేకుండా, నీకు ఈ విషయాలు అన్నీ ఏ మహానుభావుడు చెప్పాడు. అన్నీ వివరంగా చెప్పు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: