Saturday, January 2, 2016

ప్రహ్లాదుని హింసించుట

(పాఠ్యవిస్త్రుతి రీత్యా లిప్యంతీకరణ ఇవ్వలేదు సహకరించగలరు.)
7-213-వ.
వినుండు సకల జన్మంబు లందును ధర్మార్థాచరణ కారణం బయిన మానుషజన్మంబు దుర్లభం; బందుఁ బురుషత్వంబు దుర్గమం; బదియు శతవర్షపరిమితం బైన జీవితకాలంబున నియతంబై యుండు; నందు సగ మంధకారబంధురం బయి రాత్రి రూపంబున నిద్రాది వ్యవహారంబుల నిరర్థకంబయి చను; చిక్కిన పంచాశద్వత్సరంబు లందును బాల కైశోర కౌమారాది వయోవిశేషంబుల వింశతి హాయనంబులు గడచు; కడమ ముప్పది యబ్దంబులు నింద్రియంబుల చేతఁ బట్టుపడి దురవగాహంబు లయిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంబులను పాశంబులం గట్టుపడి విడివడ సమర్థుండు గాక ప్రాణంబులకంటె మధురాయమాన యైన తృష్ణకు లోనై భృత్య తస్కర వణిక్కర్మంబులఁ బ్రాణహాని యైన నంగీకరించి పరార్థంబుల నర్థించుచు, రహస్యసంభోగచాతుర్య సౌందర్య విశేషంబుల ధైర్యవల్లికా లవిత్రంబు లయిన కళత్రంబులను, మహనీయ మంజుల మధురాలాపంబులు గలిగి వశులయిన శిశువులను, శీలవయోరూపధన్య లగు కన్యలను, వినయ వివేక విద్యాలంకారు లయిన కుమారులను, గామిత ఫలప్రదాతలగు భ్రాతలను, మమత్వ ప్రేమ దైన్య జనకు లయిన జననీజనకులను, సకల సౌజన్య సింధువు లయిన బంధువులను, ధన కనక వస్తు వాహన సుందరంబు లయిన మందిరంబులను, సుకరంబు లైన పశు భృత్య నికరంబులను, వంశపరంపరాయత్తంబు లయిన విత్తంబులను వర్జింపలేక, సంసారంబు నిర్జించు నుపాయంబుఁ గానక, తంతువర్గంబున నిర్గమద్వారశూన్యం బయిన మందిరంబుఁ జేరి చుట్టుపడి వెడలెడి పాటవంబు చాలక తగులుపడు కీటకంబు చందంబున గృహస్థుండు స్వయంకృతకర్మ బద్ధుండై శిశ్నోదరాది సుఖంబుల బ్రమత్తుండయి నిజకుటుంబపోషణ పారవశ్యంబున విరక్తిమార్గంబు దెలియనేరక, స్వకీయ పరకీయ భిన్నభావంబున నంధకారంబునం బ్రవేశించుం; గావునఁ గౌమార సమయంబున మనీషా గరిష్ఠుండై పరమ భాగవతధర్మంబు లనుష్ఠింప వలయు; దుఃఖంబులు వాంఛితంబులు గాక చేకుఱుభంగి సుఖంబులును గాలానుసారంబులై లబ్దంబు లగుం; గావున వృథాప్రయాసంబున నాయుర్వ్యయంబు జేయం జనదు; హరిభజనంబున మోక్షంబు సిద్ధించు; విష్ణుండు సర్వభూతంబులకు నాత్మేశ్వరుండు ప్రియుండు; ముముక్షువైన దేహికి దేహావసానపర్యంతంబు నారాయణచరణారవింద సేవనంబు కర్తవ్యంబు.
టీకా:
          వినుండు = వినండి; సకల = సమస్తమైన; జన్మంబులు = పుట్టువులు; అందును = లోను; ధర్మ = ధర్మము; అర్థ = సంపదలకైనవానిని; ఆచరణ = చేయుటకు; కారణంబు = వీలగునది; మానుష = మానవ; జన్మంబు = పుట్టుక; దుర్లభంబు = పొందరానిది; అందున్ = వానిలో; పురుషత్వంబు = మగవాడౌట; దుర్గమంబు = అందుకొనరానిది; అదియున్ = అదికూడ; శత = వంద (100); వర్ష = సంవత్సరములకు; పరిమితంబు = మించనిది; ఐన = అయిన; జీవిత = జీవించెడి; కాలంబునన్ = సమయములో; నియతంబు = కేటాయింపబడినది; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; అందున్ = దానిలో; సగము = సగము (1/2 వంతు); అంధకార = చీకటిచే; బంధురంబు = నిండినది; అయి = అయ్యి; రాత్రి = రాత్రి; రూపంబునన్ = రూపములో; నిద్ర = నిద్ర; ఆది = మొదలగు; వ్యవహారంబులన్ = పనులలో; నిరర్థకంబు = పనికిమాలినది; అయి = అయ్యి; చనున్ = జరిగిపోవును; చిక్కిన = మిగిలిన; పంచాశత్ = ఏభై (50); వత్సరంబులు = ఏళ్ళ; అందును = లోను; బాల = బాల్యము; కైశోర = కైశోరము; కౌమార = కౌమారము; ఆది = మొదలగు; వయః = వయస్సు యొక్క {అవస్థాష్టకము - 1కౌమారము (5సం.) 2పౌగండము(10సం.) 3కైశోరము(15సం.) 4బాల్యము (16సం), 5కారుణ్యము (25సం.) 6యౌవనము (50) 7వృద్ధము (70) 8వర్షీయస్త్వము (90)}; విశేషంబుల = భేదములచేత; వింశతి = ఇరవై (20); హాయనంబులు = సంవత్సరములు; గడచున్ = జరిగిపోవును; కడమన్ = చివరగా; ముప్పది = ముప్పై; అబ్దంబులు = సంవత్సరములు; ఇంద్రియంబుల్ = ఇంద్రియముల; చేతన్ = చేత; పట్టుబడు = నష్టపోవును; దురవగాహంబులు = తెలియరానిది; అయిన = ఐన; కామ = కామము; క్రోధ = క్రోధము; లోభ = లోభము; మోహ = మోహము; మద = మదము; మాత్సర్యంబులు = మాత్సర్యములు; అను = అనెడి; పాశంబులన్ = బంధనములచే; కట్టుపడి = కట్టుపడి; విడివడన్ = బయటబడుటకు; సమర్థుండుగాక = చేతనైనవాడు; కాక = కాకుండి; ప్రాణంబుల్ = ప్రాణముల; కంటెన్ = కంటెను; మధురాయమాన = తీయనిదానివలెనుండునది; ఐన = అయిన; తృష్ణ = అలవికాని ఆశ; కున్ = కు; లోను = వశము; ఐ = అయ్యి; భృత్య = సేవించుట; తస్కర = దొంగతనము చేయుట; వణిక్ = వర్తకపు; కర్మంబులన్ = పనులందు; ప్రాణహానిన్ = చావుని {ప్రాణహాని - ప్రాణములు హాని (నష్టమగుట), చావు}; ఐనన్ = అయినను; అంగీకరించి = ఒప్పుకొని; పర = ఇతరుల; అర్థంబులన్ = సొమ్మును, ధనములను; అర్థించుచు = కోరుతూ; రహస్య = రహస్యముగా చేసెడి; సంభోగ = సురత; చాతుర్య = నేరుపు; సౌందర్య = అందము యొక్క; విశేషంబుల = అతిశయములతో; ధైర్య = ధైర్యము యనెడి; వల్లికా = తీగలకు; లవిత్రంబులు = కొడవళ్ళ; అయిన = ఐన; కళత్రంబులను = భార్యలను; మహనీయ = గొప్పగా; మంజుల = సొగసైన; మధుర = తీయనైన; ఆలాపంబులున్ = పలుకులు; కలగి = ఉండి; వశులు = స్వాధీనముననుండువారు; అయిన = ఐన; శిశువులను = పిల్లలను; శీల = మంచి నడవడిక; వయస్ = ప్రాయము; రూప = అందమైన రూపములచే; ధన్యలు = కృతార్థులు; అగు = అయిన; కన్యలను = కూతుర్లను; వినయ = అణకువ; వివేక = తెలివి; విద్యా = చదువులతో; అలంకారులు = అలంకరింపబడినవారు; అయిన = ఐన; కుమారులనున్ = పుత్రులను; కామిత = కోరబడిన; ఫల = ప్రయోజనములను; ప్రదాతలు = ఒనగూర్చెడివారు; అగు = ఐన; భ్రాతలను = సోదరులను; మమత్వ = మమకారము; ప్రేమ = ప్రీతి; దైన్య = దీనత్వములను; జనకులు = కలిగించువారు; అయిన = ఐన; జననీజనకులను = తల్లిదండ్రులను; సకల = అఖిలమైన; సౌజన్య = మంచితనములకు; సింధువు = సముద్రమువంటివారు; అయిన = ఐన; బంధువులను = చుట్టములను; ధన = సంపదలు; కనక = బంగారము; వస్తు = వస్తువులు; సుందరంబులు = అందమైనవి; అయిన = ఐన; మందిరంబులను = ఇండ్లను; సుకరంబులు = సుఖములను కలిగించెడివి; ఐన = అయిన; పశు = పశువులు; భృత్య = సేవక; నికరంబులను = సమూహములను; వంశపరంపరాయత్త = వంశానుక్రమముగ; ఆయత్తంబులు = సంక్రమించినవి; అయిన = ఐన; విత్తంబులను = ధనములను; వర్జింపలేక = విడువజాలక; సంసారంబు = సంసారమును; నిర్జించు = జయించెడి, దాటు; ఉపాయంబున్ = ఉపాయమును; కానక = కనుగొనలేక; తంతు = దారముల; వర్గంబునన్ = గుంపులో; నిర్గమ = బయటపడెడి; ద్వార = ద్వారము; శూన్యంబు = లేనిది; అయిన = ఐన; మందిరంబున్ = నివాసమును; చేరి = ప్రవేశించి; చుట్టుపడి = చుట్టబెట్టుకొని; వెడలెడి = బయల్పడెడి; పాటవంబు = నేర్పు; చాలక = లేక; తగులుపడు = చిక్కుకొనిన; కీటకంబు = పురుగు; చందంబునన్ = వలె; గృహస్థుండు = గృహస్థుడు; స్వయం = తాను; కృత = చేసిన; కర్మ = కర్మములచే; బద్ధుండు = బంధనములజిక్కినవాడు; ఐ = అయ్యి; శిశ్న = మైథున; ఉదర = భోజన; సుఖంబులన్ = సుఖములందు; ప్రమత్తుండు = మిక్కలి మత్తుగొన్నవాడు; అయి = అయ్యి; నిజ = తన; కుటుంబ = కుటుంబమును; పోషణ = పోషించుటయందు; పారవశ్యంబునన్ = ఒడలుమరచిపోవుటచే; విరక్తి = వైరాగ్య; మార్గంబున్ = మార్గమును; తెలియనేరక = తెలిసికొనలేక; స్వకీయ = తనది; పరకీయ = ఇతరులది యను; భిన్న = భేద; భావంబునన్ = బుద్ధితో; అంధకారంబునన్ = చీకటిలో; ప్రవేశించున్ = చేరును; కావున = కనుక; కౌమార = చిన్నతనపు; సమయంబునన్ = వయసులోనే; మనీషా = బుద్ధిబలమున; గరిష్ఠుండు = శ్రేష్ఠుండు; ఐ = అయ్యి; పరమ = అత్యుత్తమమైన; భాగవత = బాగవత; ధర్మంబులన్ = ధర్మములను; అనుష్ఠింపవలయును = ఆచరించవలెను; దుఖంబులు = దుఃఖములు; వాంఛితంబులు = కోరినవి; కాక = కాకుండగనే; చేకుఱ = కలిగెడి; భంగిన్ = విధముగనే; సుఖంబులును = సుఖములుకూడ; కాల = కాలమునకు; అనుసారంబులు = అనుసరించునవి; ఐ = అయ్యి; లబ్దంబులు = దొరకునవి; అగున్ = అగును; కావున = కనుక; వృథా = వ్యర్థమైన; ప్రయాసంబునన్ = శ్రమతో; ఆయుః = జీవితకాలమును; వ్యయంబున్ = ఖర్చుపెట్టుట; చేయన్ = చేయుట; జనదు = తగదు; హరి = నారాయణుని; భజనంబునన్ = భక్తివలన; మోక్షంబు = ముక్తిపదము; సిద్ధించున్ = లభించును; విష్ణుండు = నారాయణుడు; సర్వ = సమస్తమైన; భూతంబుల్ = జీవుల; కున్ = కు; ఆత్మ = తమలోనుండెడి; ఈశ్వరుండు = భగవంతుండు; ప్రియుండు = ఇష్ఠుడు; ముముక్షువు = మోక్షమును కోరెడివాడు; ఐన = అయిన; దేహికి = శరీరధారికి; దేహ = దేహము; అవసాన = తీరెడికాలము, మరణకాల; పర్యంతంబున్ = వరకు; నారాయణ = విష్ణుమూర్తి; చరణ = పాదములనెడి; అరవింద = పద్మముల; సేవనంబు = కైంకర్యము, సేవించుట; కర్తవ్యంబు = చేయవలసినది.
భావము:
            ఇంకా వినండి. అన్ని జన్మలలోనూ ధర్మాలు ఆచరించగల మానవ జన్మ పొందడం చాలా కష్టం. అందులో పురుషుడుగా పుట్టడం ఇంకా కష్టం. మానవులకు ఆయుర్దాయం వంద సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. దానిలో సగం అంటే ఏభై సంవత్సరాలు చీకటి నిండిన రాత్రి కావటం వలన నిద్ర మున్నగు వాటితో గడచిపోతుంది. పసివాడిగా, బాలుడుగా ఇరవై సంవత్సరాలు వ్యయమౌతాయి. మిగిలిన ముప్పై సంవత్సరాలు ఇంద్రియసుఖాలకు మానవుడు వశమై పోయి ఉంటాడు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం అనే, జీవుల పాలిటి భయంకర శత్రువులు ఆరింటిని అరిషడ్వర్గాలు అంటారు. ఈ అరిషడ్వర్గాల బంధాలలో చిక్కుకొని బయటకు రాలేక మానవుడు గింజుకుంటూ ఉంటాడు; జీవుడు తన ప్రాణం కంటె తియ్యగా అనిపించే ఆశ అనే పాశానికి దాసుడు అవుతాడు; ఈ కోరికల కారణంగా ఇతరుల ధనం అపహరిస్తుంటాడు; ఆ ధనం కోసం సేవకులు, దొంగలు, వ్యాపారులు చేతిలో ప్రాణం పోగొట్టుకోడానికి అయినా సిద్దపడతాడు; అక్రమ సంబంధం, సౌఖ్యం పొందే చాతుర్యం, విశేషమైన అందాలు కోరుకుంటాడు; కాళ్లకు బంధాలు వేసే కట్టుకున్న భార్యలూ, జిలిబిలి పలుకులతో ఆనందింపజేస్తూ చెప్పిన మాట వినే తన శిశువులూ, మంచి నడతలు యౌవనం అందచందాలు కల కుమార్తెలూ, వినయ వివేకాలు కల విద్యావంతులు అయిన కొడుకులూ, కోరిన సహకారాలు అన్నీ అందించే సోదరులూ, ప్రేమానురాగలతో జాలిగోలిపే తల్లిదండ్రులూ, అన్నివిధాలా మంచిగా మెలిగే బంధువులూ, ఈ విధమైన రకరకాల బంధాలలో చిక్కుకుంటాడు. ఈ బంధాలను; డబ్బు, బంగారం, ఉపకరణాలు, వాహనాలు మొదలైన సౌకర్యాలను; పశువులు, సేవకులు మున్నగు సంపదలను; ఇంకా తరతరాల నుండి వారసత్వంగా వస్తున్న ఆస్తులను వదలిపెట్టలేక మానవుడు పూర్తిగా సంసారంలో పడిపోతాడు. సాలీడు గూటిలో చిక్కుకున్న చిన్న పురుగు ఎంత తన్నుకున్నా బయట పడలేదు. అలాగే ఈ సంసార పాశాలలో చిక్కుకున్న మానవుడు విడివడలేడు. తాను చేసిన కర్మల ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాడు; కామం సౌఖ్యాదుల మత్తులో పడి, తన కుటుంబాన్ని పోషించడంలో నిమగ్నుడై ముక్తి మార్గాన్ని మరచిపోతాడు; తాను వేరు, మిగతా వారు వేరు అనే ద్వైత భావంతో చీకట్లో పడతాడు; అందుకనే, చిన్నప్పుడే కౌమార వయసునుండే బుద్ధిబలంతో పూర్తి భగవద్భక్తి, ధర్మాలను ఆచరించాలి. దుఃఖాలు కోరకుండానే వస్తాయి. అలాగే సుఖాలు కూడ ఆ సమయం వచ్చినప్పుడు అవే వస్తాయి. కనుక, మానవుడు వాటికోసం ఎంతో విలువైన తన జీవితకాలాన్ని వృథా చేసుకోకూడదు. విష్ణు భక్తి వలన మోక్షం లభిస్తుంది. సకల ప్రాణికోటికి శ్రీహరే ఆత్మీయుడు, పరమాత్మ, పరమేశ్వరుడు. ముక్తి కోరుకునే వాడికి ఆ శ్రీమన్నారాయణుని పాదపద్మాలను సేవించడం మాత్రమే చేయదగిన పని.
పాఠ్యవిస్త్రుతి రీత్యా లిప్యంతీకరణ ఇవ్వలేదు సహకరించగలరు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: