Wednesday, December 2, 2015

ప్రహ్లాద చరిత్ర - కమలాక్షు నర్చించు

7-169-సీస పద్యము
మలాక్షు నర్చించు రములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు; ధువైరిఁ దవిలిన నము మనము;
గవంతు వలగొను దములు పదములు; పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;
7-169.1-తేటగీతి
దేవదేవుని చింతించు దినము దినము;
క్రహస్తునిఁ బ్రకటించు దువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి.
            నాన్న గారు! కమలాల వంటి కన్నులు కల ఆ విష్ణుమూర్తిని పూజిస్తేనే అవి చేతులు; లేకపోతే చేతులు, చేతులు కావు; శ్రీపతి అయిన విష్ణుదేవుని స్త్రోత్రము చేస్తేనే నాలుక అనుటకు అర్హమైనది; కాకపోతే ఆ నాలుకకు సార్థకత లేదు; దేవతలను కాపాడే ఆ హరిని చూసేవి మాత్రమే చూపులు; ఇతరమైన చూపులకు విలువ లేదు; ఆదిశేషుని పాన్పుగా కల ఆ నారాయణునకు మ్రొక్కేది మాత్రమే శిరస్సు; మిగిలిన శిరస్సులకు చరితార్థత లేదు; విష్ణు కథలు వినే చెవులే చెవులు; మధు అనే రాక్షసుని చంపిన హరి యందు లగ్నమైతేనే చిత్త మనవలెను; పరమ భగవంతుడైన ఆయనకు ప్రదక్షిణము చేసేవి మాత్రమే పాదాలు; మిగతావి పాదాలా? కాదు. పురుషోత్తము డైన ఆయనను భావించే బుద్ధే బుద్ధి; లేకపోతే అది సద్భుద్ధి కాదు; ఆ దేవుళ్ళకే దేవుడైన విష్ణుమూర్తిని తలచు దినమే సుదినము; చక్రాయుధం ధరించు ఆ నారాయణుని గాథలు విశదపరుచు చదువు మాత్రమే సరైన చదువు; భూదేవి భర్త అయిన గోవిందుని గురించి బోధించే వాడే గురువు; విష్ణుమూర్తిని సేవించమని చెప్పే తండ్రే తండ్రి కాని ఇతరులు తండ్రులా? కాదు; నాన్నగారు! దేహి శరీరంలోని చేతులు, నాలుక, కళ్ళు, శిరస్సు, చెవులు, చిత్తం, పాదాలు, బుద్ధి ఒకటేమిటి? సమస్తమైన అవయవాలు విష్ణు భక్తిలో పరవశమై పవిత్రం కావలసిందే. లేకపోతే అతడు భగవంతుని విషయంలో కృతఘ్నుడే. ప్రతి రోజూ, ప్రతి చదువూ శ్రీ హరి స్మరణలతో పునీతం కావలసిందే. ప్రతి గురువూ, ప్రతి తండ్రీ నారాయణ భక్తిని బోధించాల్సిందే. అవును లోకైకరక్షాకరు డైన విష్ణుమూర్తికి అంకితం గాని దేనికి సార్థకత లేదు.
           కమలాక్షున్ = నారాయణుని {కమలాక్షుడు - కమలముల వంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; అర్చించు = పూడించెడి; కరములు = చేతులే; కరములు = చేతులు; శ్రీనాథున్ = నారాయణుని {శ్రీనాథుడు - శ్రీ (లక్ష్మీదేవికి) నాథుడు (భర్త), విష్ణువు}; వర్ణించు = స్తోత్రముచేసెడి; జిహ్వ = నాలుకే; జిహ్వ = నాలుక; సురరక్షకునిన్ = నారాయణుని {సురరక్షకుడు - సుర (దేవతలకు) రక్షకుడు, విష్ణువు}; చూచు = చూచెడి; చూడ్కులు = చూపులే; చూడ్కులు = చూపులు; శేషశాయి = నారాయణుని {శేషశాయి - శేష (ఆదిశేషుని)పై శాయి (శయనించువాడు), విష్ణువు}; కిన్ = కి; మ్రొక్కు = నమస్కరించెడి; శిరము = తలయే; శిరము = తల; విష్ణున్ = నారాయణుని {విష్ణువు - సర్వమునందు వ్యాపించువాడు, హరి}; ఆకర్ణించు = వినెడి; వీనులు = చెవులే; వీనులు = చెవులు; మధువైరిన్ = నారాయణుని {మధువైరి - మధు యనెడి రాక్షసుని వైరి (శత్రువు), విష్ణువు}; తవిలిన = లగ్నమైన; మనము = చిత్తమే; మనము = చిత్తము; భగవంతున్ = నారాయణుని; వలగొను = ప్రదక్షిణలుచేసెడి; పదములు = అడుగులే; పదములు = అడుగులు; పురుషోత్తముని = నారాయణుని {పురుషోత్తముడు - పురుషులందరిలోను ఉత్తముడు, విష్ణువు}; మీది = మీదగల; బుద్ధి = తలపే; బుద్ధి = తలపు.
          దేవదేవుని = నారాయణుని {దేవదేవుడు - దేవుళ్ళకే దేవుడు, విష్ణువు}; చింతించు = ధ్యానించు; దినము = రోజే; దినము = రోజు; చక్రహస్తుని = నారాయణుని {చక్రహస్తుడు - చక్రాయుధము హస్తుడు (చేతిలోగలవాడు), విష్ణువు}; చదువు = చదువే; చదువు = చదువు; కుంభినీధవున్ = నారాయణుని {కుంభునీధనువు - కుంభినీ (భూదేవి కి) (వరాహాతారమున) ధవుడు (భర్త), విష్ణువు}; చెప్పెడి = చెప్పెడి; గురుడు = గురువే; గురుడు = గురువు; తండ్రి = తండ్రి; హరిన్ = నారాయణుని; చేరుము = చేరుము; అనియెడి = అనెడి; తండ్రి = తండ్రియే; తండ్రి = తండ్రి.
७-१६९-सीस पद्यमु
कमलाक्षु नर्चिंचु करमुलु करमुलु; श्रीनाथु वर्णिंचु जिह्व जिह्व;
सुररक्षकुनिँ जूचु चूड्कुलु चूड्कुलु; शेषशायिकि म्रोक्कु शिरमु शिरमु;
विष्णु नाकर्णिंचु वीनुलु वीनुलु; मधुवैरिँ दविलिन मनमु मनमु;
भगवंतु वलगोनु पदमुलु पदमुलु; पुरुषोत्तमुनि मीँदि बुद्धि बुद्धि;
७-१६९.१-तेटगीति
देवदेवुनि चिंतिंचु दिनमु दिनमु;
चक्रहस्तुनिँ ब्रकटिंचु चदुवु चदुवु;
कुंभिनीधवुँ जेप्पेडि गुरुँडु गुरुँडु;
तंड्रि! हरिँ जेरु मनियेडि तंड्रि तंड्रि.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: