Thursday, November 5, 2015

ప్రహ్లాద చరిత్ర - ఇట్లు పూర్వజన్మ

7-125-వచనము
ఇట్లు పూర్వజన్మ పరమభాగవత సంసర్గసమాగతం బైన ముకుంద చరణారవింద సేవాతిరేకంబున నఖర్వ నిర్వాణభావంబున విస్తరించుచు నప్పటప్పటికి దుర్జన సంసర్గ నిమిత్తంబునం దన చిత్తం బన్యాయత్తంబుగానీక నిజాయత్తంబు చేయుచునప్రమత్తుండును, సంసార నివృత్తుండును, బుధజనవిధేయుండును, మహాభాగధేయుండును, సుగుణమణిగణగరిష్ఠుండును, పరమభాగవతశ్రేష్ఠుండును, కర్మబంధలతాలవిత్రుండును, పవిత్రుండును నైన పుత్రుని యందు విరోధించి సురవిరోధి యనుకంపలేక చంపం బంపె" నని పలికిన నారదునకు ధర్మజుం డిట్లనియె.
            ఇలా ప్రహ్లాదుడికి పూర్వజన్మలో పరమ భాగవతులతో చేసిన సత్సంగం వలన గొప్ప విష్ణు పాద భక్తి లభించింది. అతను అఖర్వ నిర్వాణ భావం విస్తరిస్తున్నప్పటికి, దుర్జనులతో సాంగత్యం కలిగి తన మనసు అన్యాయత్తంబు కానివ్వటం లేదు. అతడు ఆత్మావలోకనం చేసుకుంటూ అప్రమత్తుడై ఉంటాడు. సాంసారిక వృత్తులన్నీ వదిలేశాడు. అతను విజ్ఞులకు విధేయుడిగా ఉంటాడు. రత్నాలలాంటి సర్వ సుగుణాల రాశితో గొప్ప భాగ్యవంతుడు. పరమ భాగవతులలో ఉత్తముడు. కర్మబంధలన్నీ వదుల్చుకున్నవాడు. అటువంటి పవిత్రుడైన పుత్రుడితో విరోధించి జాలి లేకుండా చంపమని తండ్రి అయిన హిరణ్యకశిపుడు పంపాడు అని పలికిన నారదుడితో ధర్మరాజు ఇలా అన్నాడు.
          ఇట్లు = విధముగ; పూర్వజన్మ = పూర్వపు పుట్టువులందలి; పరమ = ఉత్తమ; భాగవత = భాగవతులతోటి; సంసర్గ = చేరికవలన; సమాగతంబు = లభించినది; ఐన = అయిన; ముకుంద = నారాయణుని; చరణ = పాదములనెడి; అరవింద = పద్మములను; సేవా = సేవించుటయొక్క; అతిరేకంబునన్ = అతిశయమువలన; అఖర్వ = కొఱతలేని; నిర్వాణ = ఆనంద; భావంబు = అనుభూతి; విస్తరించున్ = పెరుగుతు; ఉన్నప్పటికిని = ఉన్నప్పటికిని; దుర్జన = చెడ్డవారితోటి; సంసర్గ = కలియకల; నిమిత్తంబునన్ = వలన; తన = తన యొక్క; చిత్తంబు = మనసు; అన్యా = ఇతరుల (పర); ఆయత్తంబు = అధీనమైనది; కానీక = అవ్వనియ్యకుండగ; నిజ = తన యొక్క; ఆయత్తంబు = అధీనములోనున్నదిగా; చేయుచున్ = చేయుచు; అప్రమత్తుండును = ఏమరికలేనివాడు; సంసార = సంసారమును; నివృత్తుండును = విడిచినవాడు; బుధ = జ్ఞానులైన; జన = వారికి; విధేయుండును = స్వాధీనుడు; మహా = గొప్ప; భాగదేయుండును = (విష్ణుభక్తి)సంపన్నుడు; సుగుణ = మంచి గుణములు యనెడి; మణి = రత్నముల; గణ = సమూహములచే; గరిష్ఠుండును = గొప్పవాడు; పరమ = అత్యుత్తమ; భాగవత = భాగవతులలో; శ్రేష్ఠుండును = ఉత్తముడు; కర్మబంధ = కర్మబంధములనెడి; లతా = తీగలకు; లవిత్రుండును = కొడవలివంటివాడు; పవిత్రుండు = పావనుడు; ఐన = అయినట్టి; పుత్రుని = కుమారుని; అందున్ = ఎడల; విరోధించి = శత్రుత్వము వహించి; సురవిరోధి = హిరణ్యకశిపుడు {సురవిరోధి - సుర (దేవత)లకు విరోధి (శత్రువు), హిరణ్యకశిపుడు}; అనుకంప = దయ; లేక = లేకుండగ; చంపన్ = చంపుటకు; పంపెను = పంపించెను; అని = అని; పలికిన = చెప్పిన; నారదున్ = నారదుని; కున్ = కి; ధర్మజుండు = ధర్మరాజు; ఇట్లు = విధముగ; అనియె = పలికెను.
७-१२५-वचनमु
इट्लु पूर्वजन्म परमभागवत संसर्गसमागतं बैन मुकुंद चरणारविंद सेवातिरेकंबुन नखर्व निर्वाणभावंबुन विस्तरिंचुचु नप्पटप्पटिकि दुर्जन संसर्ग निमित्तंबुनं दन चित्तं बन्यायत्तंबुगानीक निजायत्तंबु चेयुचु नप्रमत्तुंडुनु, संसार निवृत्तुंडुनु, बुधजनविधेयुंडुनु, महाभागधेयुंडुनु, सुगुणमणिगणगरिष्ठुंडुनु, परमभागवतश्रेष्ठुंडुनु, कर्मबंधलतालवित्रुंडुनु, पवित्रुंडुनु नैन पुत्रुनि यंदु विरोधिंचि सुरविरधि यनुकंपलेक चंपं बंपे" ननि पलिकिन नारदुनकु धर्मजुं डिट्लनिये.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: