Saturday, October 24, 2015

కాళియ మర్దన - ఇది మొద లెవ్వరైన

10.1-698-మ.
ఇది మొద లెవ్వరైన నరు లీ యమునాతటినీ హ్రదంబులో
వదలక తోఁగి నన్ను నుపవాసముతోడఁ దలంచి కొల్చుచుం
గదలక దేవతాదులకుఁ గా జలతర్పణ మాచరించినన్
సదమలచిత్తులై దురితసంఘముఁ బాయుదు రా క్షణంబునన్.
 
  ఇది = ఇప్పటి; మొదలు = నుంచి; ఎవ్వరు = ఎవరు; ఐనన్ = అయినను; నరులు = మానవులు; ఈ = ఈ యొక్క; యమునాతటిన్ = యమునానదివద్ద; ఈ = ఈ యొక్క; హ్రదంబు = మడుగు; లోన్ = అందు; వదలక = పూని; తోగి = స్నానముచేసి; నన్నున్ = నన్ను; ఉపవాసము = నిరాహారము; తోడన్ = తోటి; తలంచి = ధ్యానించి; కొల్చుచున్ = సేవించుచు; కదలక = స్థిరముగా; దేవతలు = దేవతలు; ఆదుల = మున్నగువారి; కున్ = కు; కాన్ = అగునట్లు; జలతర్పణము = నీటినితృప్తికైసమర్పించుట; ఆచరించినన్ = చేసినచో; సత్ = మిక్కలి; అమల = నిర్మలమైన; చిత్తులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; దురిత = పాపముల; సంఘమున్ = సముదాయమును; పాయుదురు = వదలివేసెదరు; ఆ = ఆ; క్షణంబునన్ = క్షణమునందే.

१०.१-६९८-म.
इदि मोद लेव्वरैन नरु ली यमुनातटिनी ह्रदंबुल
वदलक तोँगि नन्नु नुपवासमुतोडँ दलंचि कोल्चुचुं
गदलक देवतादुलकुँ गा जलतर्पण माचरिंचिनन्
सदमलचित्तुलै दुरितसंघमुँ बायुदु रा क्षणंबुनन्.

ఇప్పటి నుంచి ఈ యమునా నది మడుగులో స్నానంచేసి, ఉపవాసం ఉండి, నన్ను పూజించి, దేవతలు మొదలైన వారికి జలతర్పణాలు వదలిన వారెవరైనా ఆ క్షణంలోనే నిర్మలమైన మనస్సు కల వారు అవుతారు, వారి పాపాలన్నీ తత్క్షణమే తొలగి పోతాయి.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=86&Padyam=698.0
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: