Thursday, October 15, 2015

కాళియ మర్దన - బాలుండీతడు



10.1-687-శా.
బాలుం డీతఁడు మంచివాఁడనుచుఁ జెప్పన్రాము క్రూరుండు దు
శ్శీలుండౌ నవునైన నేము సుభగశ్రీఁ బాసి వైధవ్య దు
ష్టాలంకారముఁ బొంద నోడెద మనాథాలాప మాలింపవే
చాలున్ నీ పద తాండవంబు; పతిబిక్షం బెట్టి రక్షింపవే?
          బాలుండు = అమాయకుడు; ఈతడు = ఇతను; మంచివాడు = యోగ్యుడు; అనుచున్ = అని; చెప్పన్ = చెప్పుటకు; రాము = వచ్చినవారముకాము; క్రూరుండు = చెడ్డమనసుకలవాడు; దుశ్శీలుండున్ = చెడునడవడికగలవాడు; ఔనవున్ = అవును; ఐనన్ = అయినప్పటికి; నేము = మేము; సుభగ = అయిదవతనమను; శ్రీన్ = సంపదను; పాసి = తొలగి; వైధవ్య = వైధవ్యమునెడి; దుష్ట = చెడ్డ; అలంకారమున్ = అలంకారహీనమును; పొందన్ = పొందుటకు; ఓడెదము = భయపడుచున్నాము; అనాథ = నీవుతప్పదిక్కులేనివారి; ఆలాపమున్ = వేడ్కొనుటను; ఆలింపవే = వినుము; చాలున్ = ఇక చాలును; నీ = నీ యొక్క; పద = అడుగుల; తాండవంబు = లయబద్దప్రక్షేపములు; పతిబిక్షన్ = భర్త అనెడి బిక్షను; పెట్టి = అనుగ్రహించి; రక్షింపవే = కాపాడుము.
१०.१-६८७-शा.
बालुं डितँडु मंचिवाँडनुचुँ जेप्पन्रामु क्रूरुंडु दु
श्शीलुंडौ नवुनैन नेमु सुभगश्रीँ बासि वैधव्य दु
ष्टालंकारमुँ बोंद नोडेद मनाथालाप मालिंपवे?
चालुन् नी पद तांडवंबु; पतिबिक्षं बेट्टि रक्षिंपवे?
            ఈ కాళీయుడు అమాయకుడు, మంచివాడు అనడం లేదు. నిజమే! ఇతడు క్రూరుడు, దుష్టుడు. అయినా మేము సౌభాగ్యాన్ని పోగొట్టుకొని అసహ్య రూపాలతో ఉండే వైధవ్యం పొందలేము. మేము అనాథలము. మా దీనాలాపాలను మన్నించు. ఇక నీ పాదతాడనాలు చాలించు. పతిబిక్ష పెట్టి మమ్ము పాలించు!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: