Monday, October 19, 2015

కాళియ మర్దన - అని యిట్లు

10.1-691-వ.
అని యిట్లు తమ పెనిమిటి బ్రతుకుఁ గోరెడి భుజగసతుల యందు శరణాగతవత్సలుండైన పుండరీకాక్షుండు కరుణించి, చరణ ఘట్టనంబు చాలించి, తలంగిన, నెట్టకేలకుఁ బ్రాణేంద్రియముల మరలం బడసి, చిదిసి నలఁగిన తలలు సవరించుకొని, వగర్చుచు భుజగపతి జలజనయనునికి నంజలిచేసి మెల్లన నిట్లనియె.

టీకా:

అని = అని; ఇట్లు = ఇలా; తమ = వారి యొక్క; పెనిమిటి = భర్త; బ్రతుకున్ = జీవించియుండుటను; కోరెడి = వేడుకొనెడి; భజగ = సర్ప; సతుల = స్త్రీల; అందున్ = ఎడల; శరణాగతవత్సలుండు = శరణుచొచ్చినవారి ఎడల అనుగ్రహము కలవాడు; ఐన = అయిట్టి; పుండరీకాక్షుండు = కృష్ణుడు; కరుణించి = దయచూపి; చరణ = పాదముల; ఘట్టనంబు = తాకిడిని, తన్నులను; చాలించి = ఆపి; తలంగినన్ = ఇవతలకురాగా; ఎట్టకేలకున్ = బహు ప్రయాసముతో; ప్రాణ = ప్రాణములను; ఇంద్రియములన్ = ఇంద్రియములను; మరలన్ = మళ్ళీ; పడసి = వశములోనికిపొంది; చిదిసి = చితికిపోయి; నలగిన = నలగిపోయిన; తలలున్ = పడగలను; సవరించుకొని = చక్కజేసుకొని; వగపు = విచారము; కదురన్ = కలుగగా; భుజగపతి = సర్పరాజు, కాళియుడు; జలజనయనుని = పద్మాక్షుని, కృష్ణుని; కిన్ = కి; అంజలి = నమస్కారము; చేసి = చేసి; మెల్లన = మెల్లిగా; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:

ఇలా తమ భర్త జీవించటాన్ని కోరుకుంటున్న కాళియుని భార్యలైన నాగకాంతలను, శరణు జొచ్చినవారిని కాపాడే వాడైన శ్రీకృష్ణుడు కరుణించాడు. తన కాలితాపులు ఆపుచేసి పక్కకి తప్పుకొన్నాడు. నాగరాజు తన ప్రాణాలు చిట్టచివరకు దక్కించుకొన్నాడు. నలిగి చితికిన తన తలలను సవరించుకొన్నాడు. ఆయసంతో వగరుస్తూ కృష్ణుడికి తలవంచి నమస్కారం చేసి నెమ్మదిగా ఇలా అన్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=84&Padyam=691.0
 : : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: