Friday, September 11, 2015

కాళియ మర్దన - అంతనా

10.1-650-వ.
అంత నా దుర్నిమిత్తంబులు పొడగని బెగడు గదిరిన చిత్తంబుల నుత్తలపడుచు మందనున్న నంద యశోదాదులైన గోపగోపికా జనంబులు హరి దళసరి యెఱుంగక గోపాల గోగణ పరివృతుం డైన కృష్ణుం డెక్కడ నైనం జిక్కనోపునని పొక్కుచుం బెక్కువలైన మక్కువలు చెక్కులొత్త నొక్కపెట్ట బాలవృద్ధసమేతులై మహాఘోషంబున నా ఘోషంబు వెలువడి.
          అంతన్ = అంతట; ఆ = ఆ యొక్క; దుర్నిమిత్తంబులున్ = అపశకునంబులను; పొడగని = కనుగొని, చూసి; బెగడు = భయము; కదిరిన = విజృంభించిన; చిత్తంబులన్ = మనసులతో; ఉత్తలపడుచున్ = కలతపడుతు; మందన్ = వ్రేపల్లెలో; ఉన్న = ఉన్నట్టి; నంద = నందుడు; యశోద = యశోదాదేవి; ఆదులు = మొదలైనవారు; ఐన = అయిన; గోప = గోపకులు; గోపికా = గోపికల; జనంబులు = జనసమూహములు; హరి = కృష్ణుని; దళసరి = సామర్థ్యము; ఎఱుంగక = తెలియక; గోపాల = గొల్లల; గో = ఆవుల; గణ = సమూహములతో; పరివృతుండు = చుట్టబడినవాడు; ఐన = అయినట్టి; కృష్ణుండు = కృష్ణుడు; ఎక్కడన్ = ఎక్కడను; ఐనన్ = అయినను; చిక్కనోపున్ = చిక్కుబడియుండవచ్చు; అని = అని; పొక్కుచున్ = దుఃఖించుచు; పెక్కువలు = అతిశయించినవి; ఐన = అయిన; మక్కువలు = ప్రేమలు; చెక్కులొత్తన్ = మీఱుచుండగా; ఒక్కపెట్టన్ = ఒక్కగుంపుగా; బాల = బాలురతోను; వృద్ధ = వృద్ధులతోను; సమేతులు = కూడినవారు; ఐ = అయ్యి; మహా = అధికమైన; ఘోషంబునన్ = గోలపెడుతు; ఆ = ఆ యొక్క; ఘోషంబున్ = పల్లెనుండి; వెలువడి = బయలుదేరి.
10.1-650-va.
aMta naa durnimittaMbulu poDagani begaDu gadirina chittaMbula nuttalapaDuchu maMdanunna naMda yashodaadulaina gopagopikaa janaMbulu hari daLasari yeRruMgaka gopaala gogaNa parivRituM Daina kRiShNuM DekkaDa nainaM jikkanopunani pokkuchuM bekkuvalaina makkuvalu chekkulotta nokkapeTTa baalavRiddhasamEtulai mahaaghOShaMbuna naa ghoShaMbu veluvaDi.
            యశోద నందుడు మొదలైన గోపికా గోపక జనాలు ఆ దుశ్శకునాలు చూసి బెదిరిన మనసులలో ఆందోళన పడ్డారు. శ్రీకృష్ణుడి శక్తి తెలియక, అతడు ఎక్కడ ఆపదలోపడ్డాడో? అని గోవులు గోపాలకులతో పాటు వారందరు దుఃఖించారు. ప్రేమలు పొంగిపోతుండగా ఒక్కసారిగా వారందరు పిల్లలు ముసలివారితో సహా కేకలు వేసుకుంటు గోకులంనుండి బయల్దేరారు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: