Sunday, July 5, 2015

హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కథ - నీరాగార

7-38-శార్దూల విక్రీడితము
నీరాగారనివిష్టపాంథుల క్రియన్ నిక్కంబు సంసారసం
చారుల్ వత్తురు గూడి విత్తురు సదా; సంగంబు లే దొక్కచో;
శూరుల్ పోయెడి త్రోవఁ బోయెను భవత్సూనుండు దల్లీ! మహా
శూరుం డాతఁడు తద్వియోగమునకున్ శోకింప నీ కేటికిన్.
          హిరణ్యకశిపుడు సోదరుని మరణంతో దుఃఖిస్తున్న కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ఇలా చెప్పసాగాడు ఈ లోకం చల్లని నీళ్ళను అందించే చలివేంద్రం వంటిది. దాహం తీర్చుకోడానికి వచ్చే బాటసారులు కలుస్తారు, విడిపోతారు. వాళ్ళ పని పూర్తికాగానే తమ దారిని తాము వెళ్ళిపోతారు కదా. శాశ్వత అనుబంధాలు ఉండవు. అలాగే ఇక్కడ జీవులు వస్తుంటారు, తమ సమయం తీరగానే వెళ్ళి పోతారు. నీ కొడుకు మహావీరులు వెళ్శే దారిలో వెళ్శాడు. అతను గొప్ప శూరుడు అతని వియోగానికి మీరు దుఃఖించకండి. అవును వీరమాత, వీరపత్ని కంటతడి పెట్టరాదు కదా.
७-३८-शार्दूल विक्रीडितमु
नीरागारनिविष्टपांथुल क्रियन निक्कंबु संसारसं
चारुल वत्तुरु गूडि वित्तुरु सदा; संगंबु लॅ दोक्कचॉ;
शूरुल पॉयेडि त्रॉवँ बॉयेनु भवत्सूनुंडु दल्ली! महा
शूरुं डातँडु तद्वियॉगमुनकुन शॉकिंप नी कॅटिकिन.
            నీరాగార = చలివేంద్రములందు; నివిష్ట = ప్రవేశించిన; పాంథుల్ = బాటసారుల; క్రియన్ = వలె; నిక్కంబున్ = నిజముగ; సంసార = సంసారమునందు; సంచారుల్ = తిరిగెడివారు; వత్తురు = వచ్చెదరు; కూడి = కలయుచు; విత్తురు = విడిపోదురు; సదా = శాశ్వతమైన; సంగంబున్ = కలయిక; లేదు = లేదు; ఒక్కచోన్ = ఒక్కసారి; శూరుల్ = శూరులు; పోయెడి = వెళ్ళెడి; త్రోవన్ = దారిలో; పోయెన్ = వెళ్ళెను; భవత్ = నీ యొక్క; సూనుండు = పుత్రుడు; తల్లీ = తల్లీ; మహా = గొప్ప; శూరుండు = మగటిమగలవాడు; అతడు = అతడు; తత్ = అతని; వియోగమున్ = ఎడబాటున; కున్ = కు; శోకింపన్ = దుఃఖించగా; నీకు = నీకు; ఏటికిన్ = ఎందుకు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: