Thursday, July 30, 2015

సుయజ్ఞోపాఖ్యానము - అని యిట్లు

7-68-వచనము
అని యిట్లు కపటబాలకుండై క్రీడించుచున్న యముని యుపలాల నాలాపంబులు విని సుయజ్ఞుని బంధువు లెల్ల వెఱఁగుపడి సర్వప్రపంచంబు నిత్యంబుగాదని తలంచి శోకింపక సుయజ్ఞునికి సంపరాయిక కృత్యంబులు జేసి చని;రంత నంతకుం డంతర్హితుం డయ్యె" నని చెప్పి హిరణ్యకశిపుండు దన తల్లిని దమ్ముని భార్యలం జూచి యిట్లనియె.
          అని ఇలా విలాసంగా మాయాబాలకుడి రూపంలో వచ్చి యముడు కుళింగ పక్షి కధ తోపాటు చెప్పిన ఊరడింపు మాటలు విన్న సుయజ్ఞుని బంధువులు ఆశ్చర్యపోయారు. ఈ విశ్వం శాశ్వతం కాదు అని తెలుసుకున్నారు. విలపించటం మానారు. కర్తవ్యం ఆలోచించి సుయజ్ఞునికి ఉత్తరక్రియలు చేసి వెళ్ళిపోయారు. యముడు అంతర్ధానం అయిపోయాడు అని చెప్పి హిరణ్యకశిపుడు తన తల్లికి, తమ్ముడి భార్యలకు ఇలా చెప్పాడు.
७-६८-वचनमु
अनि यिट्लु कपटबालकुंडै क्रीडिंचुचुन्न यमुनि युपलाल नालापंबुलु विनि सुयज्ञुनि बंधुवु लेल्ल वेर्रँगुपडि सर्वप्रपंचंबु नित्यंबुगादनि तलंचि शॉकिंपक सुयज्ञुनिकि संपरायिक कृत्यंबुलु जॅसि चनि;रंत नंतकुं डंतर्हितुं डय्ये" ननि चेप्पि हिरण्यकशिपुंडु दन तल्लिनि दम्मुनि भार्यलं जूचि यिट्लनिये.
        అని = అని; ఇట్లు = ఈ విధముగ; కపట = మాయ; బాలకుండు = పిల్లవాడు; = అయ్యి; క్రీడించుచున్న = విహరించుచున్న; యముని = యముడు యొక్క; ఉపలాలన = ఓదార్పు; ఆలాపంబులు = మాటలను; విని = విని; సుయజ్ఞుని = సుయజ్ఞని యొక్క; బంధువులు = చుట్టములు; ఎల్లన్ = అందరును; వెఱగుపడి = తెల్లబోయి; సర్వ = సమస్తమైన; ప్రపంచంబున్ = సృష్టియంతయును; నిత్యంబున్ = శాశ్వతమైనది; కాదు = కాదు; అని = అని; తలంచి = భావించి; శోకింపక = దుఃఖింపక; సుయజ్ఞుని = సుయజ్ఞుని; కిన్ = కి; సంపరాయికకృత్యంబులున్ = అంత్యక్రియలు; చేసి = ఆచరించి; చనిరి = వెళ్ళిరి; అంతన్ = అంతట; అంతకుడు = యముడు; అంతర్హితుండు = కానరానివాడు; అయ్యెన్ = అయిపోయెను; అని = అని; చెప్పి = చెప్పి; హిరణ్యకశిపుండు = హిరణ్యకశిపుడు; తన = తన యొక్క; తల్లిని = అమ్మను; తమ్ముని = సోదరుని యొక్క; భార్యలన్ = భార్యలను; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: