Friday, March 6, 2015

కృష్ణలీలలు

10.1-266-వచనము
మఱియు నవ్వలయపవనదనుజుండు విలయపవనుని తెఱంగునం గసిమసంగి ముసరి మసరుకవిసి విసిరెడి సురకరువలిం బొడమిన పుడమిరజంబు వడి నెగసి గగనమున మెఱసి తరణి కిరణములకు మఱుఁగుపడిన నిబిడ మగు బెడిదంపు తిమిరమున దశదిశ లెఱుంగఁబడక గోకులం బాకులంబు నొంద నొండొరుల నెఱుంగక బెండుపడుచున్న జనంబుల మనంబుల ఘనంబగు భయంబు రయంబునం జెంద నదభ్రపరిభ్రమణ శబ్దంబున దిగంతంబులు చెవుడుపడి పరిభ్రాంతంబులుగ నొక్క ముహూర్తమాత్రంబున భువనభయంకరత్వంబు దోఁచె; నా సమయంబున.
          ఆ సుడిగాలి రాక్షసుడు ప్రళయకాల ప్రభంజనం వలె వృజృంభించి రివ్వురివ్వున విసిరికొట్టాడు. ఆ గాలినుండి పుట్టిన దుమ్ము ధూళి ఉవ్వెత్తుగా లేచింది. ఆ ధూళి ఆకాశమంతా ఆవరించి సూర్యుని కిరణాలకు అడ్డుపడింది. అప్పుడు భయంకరమైన చీకటి ఆకాశమంతా దట్టంగా ఆవరించింది. గోపకులు దిక్కు తెలియక అల్లాడిపోయారు, ఎవ రెక్కడ ఉన్నారో తెలియకుండ పోయింది. దానితో నిశ్చేష్టులైన వారి కందరికి గొప్పభయం పుట్టి మనస్సుల నిండా నిండిపోయింది. ఆ సుడిగాలి వేగానికి ఆ భయంకర ధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. జగమంత గిర్రున తిరుగుతున్నట్లు తోచింది. అలా ఒక్క ముహూర్తం పాటు లోకా లన్నిటికి భయంకరమైన స్థితి ఏర్పడింది.
          కసిమసగు, ముసురు, మసరుకవియు, చెవుడుపడు వంటి జాతీయాలు ప్రయోగం వచనానికి ఎంతో అందాన్నిచ్చాయి.
          మఱియున్ = ఇంకను; వలయపవన = సుడిగాలివంటి తృణావర్త; దనుజుండు = రాక్షసుడు; విలయ = ప్రళయకాలపు; పవను = వాయువుల; తెఱంగు = వలె; కసిమసంగి = రేగి; ముసరి = చుట్టుముట్టి; ముసరుకవిసి = ఆక్రమించి; విసిరెడి = వీచెడి; సురకరువలిన్ = సుడిగాలిని; పొడమినన్ = చూపట్టిన; పుడమి = నేలమీది; రజంబున్ = ధూళి; వడిన్ = వేగముగా; ఎగసి = ఎగిరివచ్చి; గగనమునన్ = ఆకాశమున; మెఱసి = అతిశయించి; తరణి = సూర్యుని; కిరణముల = కిరణముల; కున్ = కు; మఱుగుపడిన = కనబడకుండ చేసిన; నిబిడము = దట్టమైనది; అగు = ఐన; బెడిదంపు = భయంకరమైన; తిమిరమునన్ = చీకటి యందు; దశదిశలు = దిక్కు {దశదిశలు - దిక్కులు4 (1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తరము) మూలలు4 (1ఈశాన్యము 2ఆగ్నేయము 3నైరుతి 4వాయవ్యము) మరియు పైనకింద2}; ఎఱుంగబడక = తోచక; గోకులంబున్ = వ్రేపల్లె; ఆకులంబున = కలతను; ఒందన్ = పొందగా; ఒండొరులన్ = ఒకరినొకరు; ఎఱుంగక = చూడ లేక; బెండుపడుచున్న = నిశ్చేష్టు లగుచున్న; జనంబుల = వారి; మనంబులన్ = మనసు లందు; ఘనంబు = అత్యధికమైనది; అగు = ఐన; భయంబు = భయములు; రయంబునన్ = శీఘ్రముగ; చెందెన్ = కలిగినవి; అదభ్ర = తక్కువకాని, అదికమైన; పరిభ్రమణ = తిరుగటవలని; శబ్దంబునన్ = ధ్వనిచేత; దిగంతంబులున్ = దిక్కులకడలనుకూడ; చెవుడుపడి = చెవులు గళ్ళుపడి; పరిభ్రాంతంబులు = మిక్కలి భ్రాంతిచెందినవారు; కన్ = అయిపోగ; ఒక్క = ఒకేఒక; ముహూర్త = ముహూర్తపు; మాత్రంబునన్ = కాలములోనే; భువన = లోకములకు; భయంకరంబున్ = భీతిగొల్పెడిదిగా; తోచెన్ = కనబడెను; = ; సమయంబునన్ = సమయమునందు.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: