Monday, December 22, 2014

రుక్మిణీకల్యాణం – మఱియుసూతమాగధ

64- వ.
మఱియు సూత మాగధ వంది గాయక పాఠక జను లంతంత నభినందించుచుఁ జనుదేర మందగమనంబున, ముకుంద చరణారవిందంబులు డెందంబునం దలఁచుచు నిందుధరసుందరీ మందిరంబు చేరి సలిల ధౌత చరణకరారవింద యై వార్చి శుచియై, గౌరీసమీపంబునకుం జనియె నంత ముత్తైదువలగు భూసురోత్తమ భార్యలు భవసహితయైన భవానికి మజ్జనంబు గావించి, గంధాక్షత లిడి, వస్త్రమాల్యాది భూషణంబుల నలంకరించి ధూపదీపంబు లొసంగి నానావిధో పహారంబులు సమర్పించి, కానుక లిచ్చి, దీపమాలికల నివాళించి రుక్మిణీదేవిని మ్రొక్కించి; రప్పుడు.
          అక్కడక్కడ సూత వంది మాగధులు వంశకీర్తి, పరాక్రమం వర్ణిస్తున్నారు స్తోత్రాలు చేస్తున్నారు, గీతాలు పాడేవాళ్ళు పాడుతున్నారు, పద్యాలు చదివేవాళ్ళు చదువుతున్నారు. స్వయంవర పెళ్ళి కూతురు, రుక్మిణి మెల్లగా నడుస్తూ చక్రి పాదాలు స్మరిస్తూ ఉమాసతి గుడికి చేరింది. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని, గౌరీదేవి దగ్గరకు వెళ్ళింది. బ్రాహ్మణ ముత్తైదువలు శివపార్వతులకు అభిషేకం చేసి, అక్షతలు పూల మాలలు వస్త్రాభరణాలు అలంకరించారు. కానుకలు దీపాలు నివేదించారు. రుక్మిణిచేత మొక్కించారు, అప్పుడు.
64- va.
maRriyu soota maagadha vaMdi gaayaka paaThaka janu laMtaMta nabhinaMdiMchuchuM~ janudEra maMdagamanaMbuna, mukuMda charaNaaraviMdaMbulu DeMdaMbunaM dalaM~chuchu niMdudharasuMdaree maMdiraMbu chEri salila dhauta charaNakaraaraviMda yai vaarchi shuchiyai, gaureesameepaMbunakuM janiye naMta muttaiduvalagu bhoosurOttama bhaaryalu bhavasahitayaina bhavaaniki majjanaMbu gaaviMchi, gaMdhaakShata liDi, vastramaalyaadi bhooShaNaMbula nalaMkariMchi dhoopadeepaMbu losaMgi naanaavidhO pahaaraMbulu samarpiMchi, kaanuka lichchi, deepamaalikala nivaaLiMchi rukmiNeedEvini mrokkiMchi; rappuDu.
          మఱియున్ = ఇంకను; సూత = కీర్తించువారు; మాగధ = ప్రతాపము వర్ణించువారు; వంది = స్తోత్రములు చేయువారు; గాయక = పాటలు పాడువారు; పాఠక = వంశావళి చదువువారు; జనులు = ప్రజలు; అంతంతన్ = అక్కడక్కడ; అభినందించుచున్ = పొగడుతు; చనుదేర = రాగా; మంద = మెల్లని; గమనంబునన్ = నడకలతో; ముకుంద = శ్రీకృష్ణుని; చరణ = పాదములనెడి; అరవిందంబులున్ = పద్మములను; డెందంబునన్ = మనసునందు; తలచుచు = స్మరించుతు; ఇందుధరసుందరీ = పార్వతీదేవి యొక్క {ఇందుధరసుందరి - ఇందుధరుని (శివుని) యొక్క సుందరి (భార్య), పార్వతి}; మందిరంబున్ = గుడిని; చేరి = దగ్గరకువెళ్ళి; సలిల = నీటితో; ధౌత = కడగబడిన; చరణ = కాళ్ళు; కర = చేతులు అనెడి; అరవింద = పద్మములు కలామె; = అయ్యి; వార్చి = ఆచమనము చేసి; శుచి = పరిశుద్ధురాలు; = అయ్యి; గౌరీ = పార్వతీదేవి; సమీపంబున్ = దగ్గర; కున్ = కు; చనియె = వెళ్ళను; అంతన్ = అంతట; ముత్తైదువలు = పునిస్త్రీలు {ముత్తైదువ - భర్త జీవించి ఉన్నామె, పునిస్త్రీ}; అగు = ఐన; భూసుర = బ్రాహ్మణ; ఉత్తమ = శ్రేష్ఠుల; భార్యలు = స్త్రీలు; భవ = శివునితో {భవుడు - సమస్తము తానే అగువాడు, శివుడు}; సహిత = కలిసి ఉన్నామె; ఐన = అయిన; భవాని = పార్వతీదేవి {భవాని - భవుని భార్య, పార్వతి}; కిన్ = కి; మజ్జనంబు = అభిషేకము; కావించి = చేసి; గంధ = సుగంధ ద్రవ్యములు; అక్షతలు = అక్షింతలు {అక్షతలు - పసుపు కలిపిన బియ్యము గింజలు}; ఇడి = వేసి; వస్త్ర = బట్టలు; మాల్య = పూలదండలు; ఆది = మున్నగు; భూషణంబులన్ = ఆలంకారములచేత; అలంకరించి = అలంకారము చేసి; ధూప = ధూపము; దీపంబులు = దీపములను; ఒసంగి = ఇచ్చి; నానా = అనేక; విధ = రకములైన; ఉపహారంబులున్ = నైవేద్యములను; సమర్పించి = ఇచ్చి; కానుకలు = కానికలు; ఇచ్చి = ఇచ్చి; దీప = దీపముల; మాలికలన్ = వరుసలను; నివాళించి = హారతులిచ్చి; రుక్మిణీదేవిని = రుక్మిణీదేవిచేత; మ్రొక్కించిరి = నమస్కరింపజేసిరి; అప్పుడు = అప్పుడు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

No comments: