Friday, June 20, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 327


లావొక్కింతయులేదు


8-90-శా.
లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెనుమూర్ఛవచ్ఛెఁ దనువున్ స్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; న్నింపం దగున్ దీనునిన్;
రావే! యీశ్వర! కావవే వరద! సంక్షింపు భద్రాత్మకా!
          ఓ పరమేశ్వరా! నాలో కొంచం కూడ శక్తి మిగలలేదు. ధైర్యం తగ్గిపోయింది. ప్రాణాలు చలించిపోతున్నాయి, మూర్చకూడ వచ్చేస్తోంది. అలసట కలిగింది. నీవు తప్ప వేరే దిక్కులేదు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవలసింది దేవాధిదేవా! వరాలిచ్చే దేవా! రావయ్యా! కరుణించ వయ్యా! సర్వభద్రుడా! కాపాడ వయ్యా!
ఇది తెలుగు వాళ్ళకి పరిచయం అక్కరలేని అత్యద్భుతమైన పద్యం. గజేంద్రుడు శక్తిమీర మకరం బారినుండి తప్పించుకోడానికి ప్రయత్నించాడు. ఇక తనవల్ల కాని పరిస్థితి వచ్చేస్తోంది. ఆర్తితో భగవంతుని ప్రార్థిస్తున్నాడు.
8-90-Saa.
laa vokkiMtayu laedu; dhairyamu vilOlaMbayye; braaNaMbulun
Thaavul dappenumoorChavachChe@M danuvun Dassen SramaMbayyeDin
neevae tappa nita@hparaM beRu@Mga; manniMpaM dagun deenunin;
raavae! yeeSvara! kaavavae varada! saMrakshiMpu bhadraatmakaa!
          లావు = శక్తి; ఒక్కింతయున్ = కొంచము కూడ; లేదు = లేదు; ధైర్యము = ధైర్యము; విలోలంబు = తగ్గి; అయ్యెన్ = పోయింది; ప్రాణంబులున్ = ప్రాణములు; ఠావుల్ = స్థానముల నుండి; తప్పెన్ = చలించి పోతున్నాయి; మూర్ఛ = మగత; వచ్ఛెన్ = వచ్చేస్తోంది; తనువున్ = శరీరము; డస్సెన్ = అలసిపోయింది; శ్రమంబున్ = కష్టముగా; అయ్యెడిన్ = ఉన్నది; నీవే = నీవు మాత్రము; తప్పన్ = తప్పించి; ఇతఃపరంబు = మరింకొకరుని; ఎఱుంగన్ = తెలియను; మన్నింపన్ = ఆదుకొన; తగున్ = తగిన వాడను; దీనునిన్ = దీనావస్థ నున్నవాడను; రావే = రమ్ము; ఈశ్వర = భగవంతుడ; కావవే = కరుణించుము; వరద = వరముల నిచ్చెడివాడ; సంరక్షింపు = కాపాడుము; భద్రాత్మక = శుభమే తానైన వాడ.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: