Friday, June 13, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 314


పుట్టితి బుద్ధి యెఱింగితి

10.1-536-క.
పుట్టితి; బుద్ధి యెఱింగితిఁ;
బుట్టించితి జగము; సగము పోయెను బ్రాయం;
బిట్టివి నూతన సృష్టులు
పుట్టుట లే; దౌరా! యిటు బూమెలు భూమిన్.
                ఏనాడో పుట్టాను. అన్నినేర్చుకొన్నాను. జగత్తు అంతా సృష్టించాను. వయస్సు సగం గడిచిపోయింది. ఇంతవరకు ఎప్పుడు ఇట్లు కొత్త సృష్టులు పుట్టడం చూడలేదు. ఔరా! నేను పుట్టించిన భూలోకంలో యిన్ని మాయలు ఉన్నాయా!
బ్రహ్మ దేవుడు గొల్లపిల్లలు గో వత్సాదులను మాయచేసి, ఓ గుహలో దాచాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆ జీవాలన్నీ తానే అయ్యి భూ కాలంలో సంవత్సరం పాటు నడిపాడు. వాటన్నిటిని చూసి తెలుసుకోలేక, బొడ్డు తామరలో వికసించిన ఆ బ్రహ్మ దేవుడు ఇలా ఆశ్చర్యపోతున్నాడు
10.1-536-ka.
puTTiti; buddhi yeRiMgiti@M;
buTTiMchiti jagamu; sagamu pOyenu braayaM;
biTTivi nootana sRshTulu
puTTuTa lae; dauraa! yiTu boomelu bhoomin.
          పుట్టితిన్ = జన్మించితిని; బుద్ది = వివేకమును, ఙ్ఞానము; ఎఱింగితి = తెలుసుకొంటి; పుట్టించితిన్ = సృష్టించితిని; జగమున్ = లోకములను; సగము = అర్థభాగము; పోయెను = గడచిపోయినది; ప్రాయంబు = వయసు; ఇట్టివి = ఇలాంటి; నూతన = సరికొత్త; సృష్టులు = సృష్టింపబడుటలు; పుట్టుట = కలుగుట; లేదు = జరుగలేదు; ఔరా = అయ్యో; ఇటు = ఇట్లు; బూమెలు = మాయలు; భూమిన్ = భూలోకమున.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: