Sunday, June 1, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 303

ధనములపహరించి



1-229-ఆ.
నము లపహరించి నతోడఁ జెనకెడు
నాతతాయి జనుల ని వధించి
బంధు మరణ దుఃఖ రమున ధర్మజుఁ
డెట్లు రాజ్యలక్ష్మి నిచ్చగించె?
          తన సిరిసంపదలన్నీ అపహరించి తనతో యుద్ధానికి సిద్ధమైన దుర్మార్గపు ఆతతాయిలను (ఇంటికి నిప్పు పెట్టేవాడు, విషము పెట్టేవాడు, కత్తితో నరికేవాడు, ధనము దోచుకొనే వాడు, నేల నపహరించేవాడు, ఇతరుల భార్యను చెరపట్టేవాడు వీరారుగురుని ఆతతాయి అంటారు) సమరంలో సంహరించిన ధర్మరాజు చుట్టాలందరు మరణించారనే దుఃఖభారంతో కూడి ఉండి ఈ రాజ్యభారాన్ని భరించటానికి ఏ విధంగా అంగీకరించాడు అని అడిగాడు.
ధర్మరాజు రాజ్యం చేపట్టాడని సూతుడు చెప్పాడు. శౌనకముని వ్యక్తపరచిన సందేహమిది.
1-229-aa.
dhanamu lapahariMchi tanatODa@M jenakeDu
naatataayi janula nani vadhiMchi
baMdhu maraNa du@hkha bharamuna dharmaju@M
DeTlu raajyalakshmi nichchagiMche?
          ధనములు = ధనములను; అపహరించి = దొంగిలించి; తన = తన; తోడన్ = మీద; చెనకెడు = గొడవచేయువారు; ఆతతాయి = హత్యలు చేయువారైన; జనులన్ = మానవులను; అనిన్ = యుద్ధములో; వధించి = సంహరించి; బంధు = బంధువుల; మరణ = మరణమువలన కలిగెడు; దుఃఖ = బాధ యొక్క; భరమున = భారముతో; ధర్మజుఁడు = ధర్మరాజు; ఎట్లు = ఏవిధముగ; రాజ్యలక్ష్మిన్ = రాజ్యపాలనను; ఇచ్చగించె = అంగీకరించెను.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: