Friday, May 9, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 282

అంగవ్రాతములో


7-188-శా.
అంగవ్రాతములోఁ జికిత్సకుఁడు దుష్టాంగంబు ఖండించి శే
షాంగ శ్రేణికి రక్ష చేయు క్రియ నీ ఙ్ఞుం గులద్రోహి దు
స్సంగుం గేశవ పక్షపాతి నధముం జంపించి వీరవ్రతో
త్తుంగ ఖ్యాతిఁ జరించెదం గులము నిర్దోషంబు గావించెదన్.
          ఈ ప్రహ్లాదుడు మూర్ఖుడు, వంశనాశకుడు, చెడు సావాసాలు పట్టిన వాడు, కేశవ పక్షపాతంతో ఉన్నాడు. శరీరంలో చెడిపోయిన భాగాన్ని కత్తిరించి తొలగించి వైద్యుడు మిగతా దేహానికి రక్షణ చేకూర్చుతాడు. అలాగే వీడిని చంపించి మహావీరు డను కీర్తితో తిరిగుతాను. నా వంశాన్ని పవిత్రం చేసుకొంటాను.
లోకంలో అన్ని శాస్త్రాలు చదివాను శ్రీహరే విశ్వ కర్త భర్త అని చెప్తున్న కొడుకు గురించి హిరణ్యకశిపుడు అంటున్న మాటలు యివి.
7-188-Saa.
aMgavraatamulO@M jikitsaku@MDu dushTaaMgaMbu khaMDiMchi Sae
shaaMga SraeNiki raksha chaeyu kriya nee ya~@MnuM guladrOhi du
ssaMguM gaeSava pakshapaati nadhamuM jaMpiMchi veeravratO
ttuMga khyaati@M jariMchedaM gulamu nirdOshaMbu gaaviMchedan.
          అంగ = అవయవముల; వ్రాతము = సముదాయము; లోన్ = అందు; చికిత్సకుడు = వైద్యుడు; దుష్ట = పాడైన; అంగంబున్ = అవయమును; ఖండించి = కత్తిరించివేసి; శేష = మిగిలిన; అంగ = అవయవముల; శ్రేణి = సముదాయమున; కిన్ = కు; రక్ష = శుభమును; చేయు = చేసెడి; క్రియన్ = విధముగ; = ; అజ్ఞున్ = తెలివితక్కువానిని; కుల = వంశమునకు; ద్రోహిన్ = ద్రోహము చేయువానిని; దుస్సంగున్ = చెడు సావాసము చేయువానిని; కేశవ = నారాయణుని {కేశవుడు - కేశి యను రాక్షసుని సంహరించినవాడు, విష్ణువు}; పక్షపాతిన్ = పక్షము వహించు వాని; అధమున్ = నీచుని; చంపించి = సంహరింప జేసి; వీర = శౌర్యవంతమైన; వ్రత = కార్యములను చేసెడి నిష్ఠచే; ఉత్తుంగ = అత్యధికమైన; ఖ్యాతిన్ = కీర్తితో; చరించెదన్ = తిరిగెదను; కులము = వంశము; నిర్దోషము = కళంకము లేనిదిగా; కావించెదన్ = చేసెదను.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: