Monday, February 24, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 209

వేలపులటె

10.1-313-.
వేలుపులఁటె; నా కంటెను
వేలుపు మఱి యెవ్వఁ రనుచు వికవిక నగి మా
వేలుపుల గోడపై నో
హేలావతి! నీ తనూజుఁ డెంగిలిఁ జేసెన్.
          ఓ యమ్మ! యశోదమ్మ! గొప్పగా నవ్వేవు గాని దీనికేమంటావు. మా యింట్లో దేవతలను చిత్రించిన గోడను చూసి, వీళ్ళా దేవతలు? నాకంటె వేరె దేవతలు ఎవరన్నారు?” అంటు పకపక నవ్వుతూ నీ కొడుకు గోడమీద ఎంగిలి చేసాడు.
అంటు గోపికలు బాలకృష్ణుని చేష్టలు చెప్తున్నారు. గోపిక పదం జ్ఞానికి ప్రతీక. సర్వమునకు కారణ వస్తువైన పరమాత్మ నేనై ఉండగా, అహంకి ప్రతిరూపమైన నా యందు అనన్యభక్తి చూపక నాకంటె దేవుడు వేరే ఉన్నాడని పూజిస్తున్నారా అని నవ్వుతున్నాడు. అహం బ్రహ్మః, సోహం అని అధ్యయనాలు చేస్తు, ఇంకా బొమ్మల పూజలేమిటి అని ప్రశ్నిస్తున్నాడు. ఎంగిలి చేయటం అంటే వ్యర్థమనుట. మానవజన్మకి పరమతారకం స్వస్వరూప విజ్ఞానమే తప్ప తక్కిన సమస్తము వ్యర్థకాలక్షేపము కనుక అది కూడదు అని సూచిస్తున్నాడు శ్రీకృష్ణపరబ్రహ్మము.
10.1-313-ka.
vaelupula@MTe; naa kaMTenu
vaelupu maRi yevva@M ranuchu vikavika nagi maa
vaelupula gODapai nO
haelaavati! nee tanooju@M DeMgili@M jaesen.
          వేలుపులటె = దేవతలా (ఇవి); నా = నాకు; కంటెను = వేరైన; వేలుపు = దేముడు; మఱిన్ = ఇంకను; ఎవ్వరు = ఎవరున్నారు; అనుచున్ = అనుచు; వికవికన్ = విరగబడి వికవిక అనుచు; నగి = నవ్వి; మా = మా యొక్క; వేలుపులగోడ = దేవతలను చిత్రించిన గోడ; పైన్ = మీద; = ఓహో; హేలావతి = విలాసవతీ; నీ = నీ యొక్క; తనూజుడు = పుత్రుడు; ఎంగిలి = మైల; చేసెను = పరచెను.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: