Sunday, January 26, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 183

రావేసుందరి

10.1-773-శా.
రావే సుందరి! యేమె బోటి! వినవే; రాజీవనేత్రుండు బృం
దావీధిం దగ వేణు వూఁదుచు లసత్సవ్యానతాస్యంబుతో
భ్రూవిన్యాసము లంగుళీ క్రమములుం బొల్పార షడ్జంబుగాఁ
గావించెన్ నటుభంగి బ్రహ్మ మగు ద ద్గాంధర్వ సంగీతమున్.
          ఓ చక్కదనాల చిన్నదాన! ఇలారావే. ఏమే వింటున్నావా. బృందావన వీధిలో పద్మాక్షుడు మన శ్రీకృష్ణుడు వేణువు ఊదుతూ ఎడమవైపుకు వంచిన ముఖంతో కనుబౌమలాడిస్తూ వేణువుపై వేళ్ళవిన్యాసాలు వెలయిస్తూ నటునివలె షడ్జమస్వరంలో బహ్మగాంధర్వగీతాన్ని ఆలపిస్తున్నాడు.
          అని బృందావనంలో కృష్ణుడు మన్మథోద్దీపితంగా వాయిస్తున్న మురళీగాన లోలులైన గోపికలు ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటున్నారు. అసలే బృందావనం బాగా పెద్దది, అతిశ్రేష్ఠమైనది, బహుమనోహరమైనది. శ్రీకృష్ణభగవానుల ఆకర్షణ చాలా ఎక్కువ, ఆలపిస్తున్నది పరబ్రహ్మం తానైన గాంధర్వగీతం, అది మనస్సును మథించి ఉద్దీపితం చేసేది, మరి గోపికలు గో (జ్ఞానం) ఓపిక ఎక్కు వున్నవాళ్ళుట. మరి వేగిరపాటు సహజమే కదా.
10.1-773-Saa.
raavae suMdari! yaeme bOTi! vinavae; raajeevanaetruMDu bRM
daaveedhiM daga vaeNu voo@Mduchu lasatsavyaanataasyaMbutO
bhroovinyaasamu laMguLee kramamuluM bolpaara shaDjaMbugaa@M
gaaviMchen naTubhaMgi brahma magu da dgaaMdharva saMgeetamun.
          రావే = రమ్ము; సుందరి = చక్కని చుక్క; ఏమె = ఒసేయ్; బోటి = వనితా; వినవే = వినుము; రాజీవనేత్రుండు = పద్మాక్షుడు, కృష్ణుడు; బృందా = బృందావనము; వీధిన్ = దారులమ్మట; తగన్ = చక్కగా; వేణువున్ = మురళిని; ఊదుచున్ = పూరించుచు; లసత్ = తేటగాయున్న; సవ్య = ఎడమపక్కకు; ఆనత = వంచబడిన; ఆస్యంబు = మోము; తోన్ = తోటి; భ్రూ = కనుబొమల; విన్యాసములన్ = కదలించుటలతో; అంగుళీ = వేళ్ళ యొక్క; క్రమములున్ = వాడుటలోని లయలు; పొల్పారన్ = చక్కగా యుండు నట్లు; షడ్జంబున్ = షడ్జమ స్వరము; కాన్ = కలుగు నట్లు; కావించెన్ = చేసెను, పలికించెను; నటు = నటుని; భంగిన్ = వలె; బ్రహ్మము = గొప్పది, వేద మయ మైనది; అగు = ఐన; తత్ = ఆ యొక్క; గాంధర్వ = గంధర్వులు చేయు నట్టి; సంగీతమున్ = గానమును.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: