Tuesday, December 17, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 143


anayaMbu

4-43-సీ.
అనయంబు లుప్తక్రియాకలాపుఁడు మాన;హీనుఁడు మర్యాదలేని వాఁడు
మత్తప్రచారుఁ డున్మత్తప్రియుఁడు దిగం;బరుఁడు భూత ప్రేత రివృతుండు
దామస ప్రమథ భూములకు నాథుండు; భూతిలిప్తుం డస్థిభూషణుండు
నష్టశౌచుండు నున్మదనాథుఁడును దుష్ట;హృదయుఁ డుగ్రుఁడును బరేతభూ ని
తే. కేతనుఁడు వితతస్రస్తకేశుఁ డశుచి
యయిన యితనికి శివనాముఁ ను ప్రవాద
మెటులు గలిగె? నశివుఁ డగు నితని నెఱిఁగి
యెఱిఁగి వేదంబు శూద్రున కిచ్చి నటులు.
          

          దక్షుడు శివుని ఎలా నిందిస్తున్నా స్తుతి కూడ స్పురిస్తున్న చమత్కారం ఉన్న పద్యం యిది – ఇతను ఎప్పుడు వేదకర్మ లాచరించని వాడు. (కర్మలు చేయని వాడు అంటే పూర్తిగా కర్మలకు అతీతుడు). మానాభిమానాలు లేని వాడు. (మానం లేనివాడు అంటే గౌరవ అగౌరవాలు పట్టని వాడు). నియమాలు లేని వాడు. (మర్యాద లేదంటే దేశకాలాదికి తరతమ భేదాలకి అతీతుడు). మత్తెక్కి తిరుగు వాడు. (ఆత్మానందంలో మెలగు వాడు). పిచ్చివారి కిష్టుడు. (ఉన్నత్తాకారంలో మెలగే సిద్ధులకు ఇష్టుడు). నగ్నంగా ఉంటాడు. (దిగంబరుడు ఆకాశ అంతరిక్షాలు దేహంగా కలవాడు). భూతాలు ప్రేతాలు ఎప్పుడు చుట్టూ ఉంటాయి. (పంచభూతాలు మరణానంతర జీవాత్మలు కూడ ఆశ్రయించి ఉంటాయి). తమోగుణం గల ప్రమథ గణాలకు నాయకుడు. బూడిద పూసుకుంటాడు. (ఆది విరాగి కనుక వైరాగ్య చిహ్న మైన విభూతి రాసుకుంటాడు). ఎముకలు అలంకారాలుగా ధరిస్తాడు. (అస్థి భూషణుడు అంటే బ్రహ్మ కపాలాలు ధరిస్తాడు). అపవిత్రుడు. (శౌచాశౌచాలకి అతీత మైన వాడు). (ఉన్మత్తులనే భూతగణాలకి అధిపతి. లౌకిక విలువలు లెక్కచెయ్యని వాడు). దుష్టబుద్ధి. (దుష్ట అర్థచేసుకోరాని నిగూఢ మనస్సు కలవాడు). ఉగ్రమైన స్వభావం కల వాడు. (ఉగ్రుడు అంటే రుద్రుడు). శ్మశాన వాసి. (మరణ స్థితులకు అవ్వల నుండు వాడు). జుట్టు విరబోసుకొని ఉంటాడు. (సంకోచ సందేహాదులకు అతీతుడు). శుచి  శుభ్రం లేకుండా మలినదేహంతో ఉంటారు. (అశుచి అంటే సర్వం తానే కనుక  శుచి అశుచి భేదాలు లేని వాడు).  అలాంటి వాడికి శివుడు అని ఎందుకో అసందర్భంగా పిలుస్తారు. శివుడు అంటే శుభాలను కలిగించే వాడు అని చూడొద్దా. (శివనాముడను ప్రవాదము పేరుకు మాత్రమే శివుడు అనటం అసందర్భం) ఇంతటి అశివుడు అని తెలిసికూడ, శూద్రునికి వేదాలు చెప్పినట్లు, శివుడు అని పేరు పెట్టారు.

4-43-see.
anayaMbu luptakriyaakalaapu@MDu maana;heenu@MDu maryaadalaeni vaa@MDu
mattaprachaaru@M Dunmattapriyu@MDu digaM;baru@MDu bhoota praeta parivRtuMDu
daamasa pramatha bhootamulaku naathuMDu; bhootiliptuM DasthibhooshaNuMDu
nashTaSauchuMDu nunmadanaathu@MDunu dushTa;hRdayu@M Dugru@MDunu baraetabhoo ni
tae. kaetanu@MDu vitatasrastakaeSu@M DaSuchi
yayina yitaniki Sivanaamu@M Danu pravaada
meTulu galige? naSivu@M Dagu nitani neRi@Mgi
yeRi@Mgi vaedaMbu Soodruna kichchi naTulu.

          అనయంబున్ = ఎప్పుడు, మిక్కిలి; లుప్త = శూన్యమై పోయిన; క్రియా = పనులు, యఙ్ఞకర్మములు; కలాపుడు = చేయుటలు కలవాడు; మాన = శీలము, అభిమానము; హీనుడు = లేనివాడు; మర్యాద = మర్యాద, నియమములు; లేనివాడు = లేనట్టివాడు; మత్త ప్రచారుడు = మత్తెక్కి తిరుగు వాడు, మిక్కిలి ప్రచారము కలవాడు; ఉన్మత్త ప్రియుడు = పిచ్చివారి కిష్ఠుడు, ఉన్మత్తులు అనెడి భూతగణములకు నాయకుడు; దిగంబరుడు = దిక్కులే అంబరముగా కలవాడు; భూతప్రేత = భూత ప్రేతములు చేత; పరివృతుండు = చుట్టబడి యుండు వాడు; తామస = తమో గుణము కల; ప్రమథ = ప్రమథ; భూతముల్ = గణముల; కున్ = కి; నాథుండు = నాయకుడు; భూతి = బూడిద, విభూతి; లిప్తుండు = పూసుకొనువాడు; అస్థి = ఎముకలు; భూషణుండు = అలంకారములుగ కలవాడు; నష్ట శౌచుండు = శుచిత్వము లేని వాడు; దుష్ట హృదయుడు = దుష్ట మైన మనసు కలవాడు; ఉగ్రుడు = ఉగ్ర రూపము కల వాడు; పరేత భూమిని కేతనుడు = శ్మశాన వాసి; వితత స్రస్త = మిక్కిలి విరబోసుకొన్న; కేశుడు = కేశములు కల వాడు; అశుచి = అపవిత్రడు; అయిన = అయి నట్టి; ఇతని = ఇతని; కిన్ = కి; శివ = శివ యనెడి; నాముడు = పేరు బడ్డ వాడు; అను = అనెడి; ప్రవాదము = తప్పుడు ప్రచారము; ఎటులన్ = ఎలా; కలిగెన్ = కలిగినది; అశివుడు = అశుభ మైన వాడు; అగు = అయి నట్టి; ఇతనినన్ = ఇతనిని; ఎఱిగియెఱిగి = బాగ తెలిసుండు కూడ; వేదంబున్ = వేదములను; శూద్రున్ = శూద్రుని; కిన్ = కి; ఇచ్చినటుల = ఇచ్చినట్లు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: